బహుమాయుఁడైన మయుచే
విహతం బగు హరుని యశము విఖ్యాత జయా
వహముగ నీ భగవంతుఁడు
మహితాత్ముఁడు మున్నొనర్చె మనుజవరేణ్యా!
7-388-వ.
అనిన ధర్మనందనుం డిట్లనియె.
టీకా:
బహు = పలు; మాయుడు = మాయలు గలవాడు; ఐన = అయిన; మయు = మయుని; చేన్ = చేత; విహతంబు = భంగపరచబడిన; హరుని = పరమశివుని {హరుడు - ప్రళయకాలమున సర్వమును హరించువాడు, శివుడు}; యశము = కీర్తిని; విఖ్యాత = ప్రసిద్దమైన; జయ = గెలుపు; ఆవహము = నెలవైనది; కన్ = అగునట్లు; ఈ = ఈ; భగవంతుడు = హరి; మహితాత్ముడు = హరి {మహితాత్ముడు - మహిత (మహిమ గల) ఆత్ముడు (స్వరూపము గలవాడు), విష్ణువు}; మున్ను = పూర్వము; ఒనర్చెన్ = చేసెను; మనుజవరేణ్యా = రాజా. అనినన్ = అనగా; ధర్మనందనుండు = ధర్మరాజు {ధర్మ నందనుడు - యమధర్మరాజు యొక్క కొడుకు, ధర్మరాజు}; ఇట్లు = ఇలా; అనియె = అడిగెను.
భావము:
“నరోత్తమా! ధర్మరాజా! ఒకసారి మాయలమారి అయిన మయుని వలన మహిమాన్వితమైన శివుని యశస్సుకి మచ్చ కలిగింది. అప్పుడు భగవంతుడు శ్రీమహా విష్ణువు శంకరునికి జయం కలిగించి, ఆయన కీర్తికి వన్నెతెచ్చాడు.” అని నారదుడు చెప్పాడు. అలా నారదుడు చెప్పగా విని ధర్మరాజు ఇలా అడిగాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=7&Ghatta=12&Padyam=387
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment