Tuesday, February 7, 2017

వామన వైభవం - 109:

8-651-వ.
ఇట్లు సమాగతుండైన తమ తాతం గనుఁగొని విరోచన నందనుండు వారుణపాశబద్ధుండుఁ గావునఁ దనకుం దగిన నమస్కారంబు జేయ రామింజేసి సంకులాశ్రువిలోల లోచనుండై సిగ్గుపడి నత శిరస్కుండై నమ్రభావంబున మ్రొక్కు చెల్లించె; నంతఁ బ్రహ్లాదుఁడు ముఖమండపంబున సునందాది పరిచర సమేతుండై కూర్చున్న వామనదేవునిం గని యానంద బాష్పజలంబులుఁ బులకాకుంరంబులున్ నెరయ దండప్రణామం బాచరించి యిట్లని విన్నవించె.

టీకా:
ఇట్లు = ఈ విధముగ; సమాగతుండు = వచ్చినట్టివాడు; ఐన = అయిన; తమ = వారి యొక్క; తాతన్ = తాతను; కనుగొని = చూసి; విరోచననందనుండు = బలిచక్రవర్తి; వారుణపాశ = వరుణపాశములతో; బద్దుండు = కట్టబడినవాడు; కావునన్ = కనుక; తన = అతని; కున్ = కి; తగిన = తగినట్టి; నమస్కారంబు = నమస్కారములు; చేయరామిన్ = చేయలేకపోవుట; చేసి = వలన; సంకుల = పొర్లిపోవుతున్న; అశ్రు = కన్నీళ్లతో; విలోల = చలించిన; లోచనుండు = కన్నులు కలవాడు; ఐ = అయ్యి; సిగ్గుపడి = లజ్జితుడై; నత = వంచిన; శిరస్కుండు = తల కలవాడు; ఐ = అయ్యి; నమ్ర = నమ్రతగల; భావంబునన్ = విధముగా; మ్రొక్కుచెల్లించెన్ = నమస్కరించెను; అంతన్ = అంతట; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ముఖమండపంబున = మొగసాల; సునంద = సునందుడు; ఆది = మున్నగు; పరిచర = పరిచరులతో; సమేతుండు = కలిసియున్నవాడు; ఐ = అయ్యి; కూర్చున్న = కూర్చొని యున్న; వామనదేవునిన్ = వామనావతారుని; కని = చూసి; ఆనంద = సంతోషపు; బాష్పజలంబులు = కన్నీళ్ళు; పులకరంబులున్ = పలకింతలు; నెరయన్ = వ్యాపించగా; దండప్రణామంబు = సాష్టాంగనమస్కారములు; ఆచరించి = చేసి; ఇట్లు = ఇలా; అని = అని; విన్నవించె = మనవిచేసెను.

భావము:
బలి చక్రవర్తి తన తాత రాక గమనించినా, వరుణపాశాలతో కట్టివేయబడి ఉన్నందు వలన, అతడు ప్రహ్లాదుడికి నమస్కారం చేయడానికి వీలుకాలేదు. బలిచక్రవర్తి కన్నులలో కన్నీళ్ళు పొంగాయి; అతడు సిగ్గుతో తలవంచుకున్నాడు; వినయంగా తలవంచి తాతకు మ్రొక్కు చెల్లించాడు. అప్పుడు, ప్రహ్లాదుడు మొగసాలలో సునందుడూ మొదలైన వారితో కూర్చున్న వామనదేవుని చూసాడు; సంతోషంతో అతని కన్నులు చెమ్మగిల్లాయి; ఒడలు పులకరించింది; అతడు స్వామికి సాగిలబడే నమస్కరించి ఇలా మనవి చేసాడు

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=82&Padyam=651

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments: