Wednesday, February 15, 2017

కాళియమర్దనము – ఎదురువచ్చినఁ

:చదువుకుందాం భాగవతం : : బాగుపడదాం మనం అందరం:

10.1-653-సీ.
"దురువచ్చినఁ జాల నెదురుగా జనుదెంతు;
వెదురు వచ్చిన నే డదేల రావు?
చూచినఁ గృపతోడఁ జూచు చుందువు నీవు;
చూచినఁ గనువిచ్చి చూడ వేల?
డాసిన నఱలేక డాయంగ వత్తువు;
డాసిన నేటికి డాయ విచటఁ?
జీరిన "నో!" యని చెలరేగి పలుకుదు;
విది యేమి చీరిన నెఱుఁగకుంట?
10.1-653.1-ఆ.
లఁపు జేయునంతఁ లపోయుచుందువు
లఁపు జేయ నేడు లఁప వకట;"
నుచు భక్తివివశు లాడెడి కైవడి
వ్రేత లెల్ల నాడి వివశ లైరి.
టీకా:
ఎదురువచ్చినన్ = ఎదురైతే; చాలన్ = మిక్కిలగా; ఎదురుగా = ముందుకు; చనుదెంతు = వచ్చెదవు; ఎదురు = ఎదురుగా; వచ్చినన్ = వచ్చినప్పటికి; నేడు = ఇవాళ; అది = అదే; ఏల = ఎందుకు; రావు = రావటంలేదు; చూచినన్ = నిన్నుచూసినచో; కృప = దయాదృష్ణి; తోడన్ = తోటి; చూచుచుందువు = చూసెదవు; నీవు = నీవు; చూచినన్ = ఎంతచూసినను; కను = కళ్ళు; విచ్చి = విప్పి; చూడవు = నీవుచూచుటలేదు; ఏల = ఎందుకు; డాసినన్ = నిన్నుచేరినచో; అఱలేక = అరమరికలేకుండ; డాయంగన్ = చేరుటకు; వత్తువు = వచ్చెదవు; డాసినన్ = మేమువచ్చిచేరినను; ఏటికిన్ = ఎందుకు; డాయవు = దగ్గరకురావు; ఇచటన్ = ఇక్కడ; చీరినన్ = పిలిచినచో; ఓ = ఓహో; అని = అని; చెలరేగి = విజృంభించి; పలుకుదువు = సమాధానమిచ్చెదవు; ఇది = ఇది; ఏమి = ఏమిటి; చీరినన్ = పిలిచినను; ఎఱుగకుంటన్ = తెలియకుండుట.
తలపుచేయున్ = తలచిన; అంత = అంతమాత్రముచేతనే; తలపోయుచున్ = పట్టించుకొనుచు; ఉందువు = ఉండెదవు; తలపుచేయన్ = తలచుకొంటున్నను; నేడు = ఇవాళ; తలపవు = పట్టించుకొనవు; అకట = అయ్యో; అనుచున్ = అనుచు; భక్తి = భక్తిచేత; వివశులు = పరవశులైనవారు; ఆడెడి = పసికెడి; కైవడిన్ = ప్రకారముగా; వ్రేతలు = గోపికలు; ఎల్లన్ = అందరు; ఆడి = పలికి; వివశలు = పరవశత్వంపొందినవారు; ఐరి = అయితిరి.
భావము:
కృష్ణా! మేము ఎదురుగా వస్తే, ఎప్పుడు నీవు మాకు ఎదురుగా వచ్చేవాడివి. ఇవేళ మేము వచ్చినా నీవు రావేమి? మేము చూస్తే దయతో నీవు మమ్మల్ని చూసేవాడివి. ఇవేళ మేం చూసినా నీవు కళ్ళువిప్పి చూడవేమి? మేము నీ దగ్గరకు వస్తే నీవు మా దగ్గరకు వచ్చేవాడివి. మేం దగ్గరకి వచ్చినా నీవు ఇక్కడకి రాటంలేదేమి మేము “కృష్ణా!” అని పిలిస్తే “ఓ!” అని ఉత్సాహంగా పలికేవాడివి. ఇవేళ గొంతెత్తి పిలిచిన తెలియకుండా ఉన్నావేమి? మేము నిన్ను స్మరిస్తే చాలు మమ్మల్ని స్మరించే వాడివి. ఇవేళ మేము స్మరిస్తున్నా మమ్మల్ని తలవట్లేదేమి?” అంటు భక్తితో పరవశులైనవారి వలె పలుకుతు గోపికలు అందరు వివశులు అయ్యారు.

No comments: