8-648-సీ.
చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల;
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
మని కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీ పాదకమలంబు నియతిఁ జేరె
8-648.1-తే.
భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?
టీకా:
చుట్టాలు = బంధువులు; దొంగలు = చోరులు; సుతులు = పుత్రులు; ఋణస్థులు = అప్పులవాళ్ళు; కాంతలు = భార్యలు; సంసార = భవబంధములకు; కారణములు = హేతువులు; ధనములు = సంపదలు; అస్థిరములు = నిలకడలేనివి; తనువు = దేహము; అతి = మిక్కిలి; చంచల = చంచలమైనది; కార్యార్థులు = ప్రయోజనముకోరువారు; అన్యులు = శత్రువులు; గడచు = గడిచిపోవునది; కాలము = కాలము; ఆయువు = ఆయుష్షు; సత్వరము = త్వరగ తరగిపోవునది; ఐశ్వర్యమున్ = ఆశ్వర్యము; అతి = మిక్కిలి; శీఘ్రము = తొందరగాపోవునది; అని = అని; కాదె = కాదా కనుకనే; తమ = అతని యొక్క; తండ్రిన్ = తండ్రిని; అతకరించి = అతిక్రమించి; మా = మా యొక్క; తాత = పితామహుడు; సాధు = మంచివారిచే; సమ్మతుండు = అంగీకరింపబడినవాడు; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; నీ = నీ యొక్క; పాద = పాదములు యనెడి; కమలంబున్ = పద్మములను; నియతిన్ = నిష్టగా; చేరెన్ = చేరెను. భద్రుడు = అదృష్టవంతుడు; అతని = అతని; కిన్ = కి; మృతి = మరణము; లేని = లేనట్టి; బ్రతుకున్ = జీవితము; కలిగెన్ = లభించెను; వైరులు = శత్రువులు; ఐ = అయ్యి; కాని = తప్పించి; తొల్లి = ఇంతకుముందు; మా = మాకుచెందిన; వారు = వారు; కానరు = దర్శించలేకపోయిరి; అర్థివి = యాచకునివి; ఐ = అయ్యి; వచ్చి = వచ్చి; నీవున్ = నీవు; నన్నున్ = నన్ను; అడుగుట = దానమడుగుట; ఎల్లన్ = అంతయు; పద్మలోచన = నారాయణ; నా = నా యొక్క; పుణ్య = పుణ్యమునకు; ఫలము = ప్రతిఫలము; కాదె = కాదా ఏమి.
భావము:
పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుస్సు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శతృవులుగా మారితే తప్ప నిన్ను దర్సించలేకపోయారు. నీవు బిచ్చగాడు వలె వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=81&Padyam=648
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment