8-664-క.
సావర్ణి మనువు వేళను
దేవేంద్రుండగు నితండు దేవతలకు; దు
ర్భావిత మగు నా చోటికి
రావించెద; నంతమీఁద రక్షింతు దయన్.
టీకా:
సావర్ణి = సావర్ణి; మనువు = మనువు; వేళను = కాలమునందు; దేవేంద్రుండు = దేవేంద్రుడు; అగున్ = అగును; ఇతండు = ఇతను; దేవతల్ = దేవతల; కున్ = కుకూడ; దుర్భావితము = ఊహించసాధ్యంకానిది; అగున్ = అయినట్టి; ఆ = ఆ; చోటి = పదవి; కిన్ = కి; రావించెదన్ = తీసుకొచ్చెదను; అంతమీద = ఆ తరువాత; రక్షింతున్ = కాపాడెదను; దయన్ = దయతో.
భావము:
సావర్ణి మనువు కాలంలో ఇతడు దేవతలకు ప్రభువై దేవేంద్రుడు అవుతాడు. ఊహించడానికీ వీలుకాని ఆ పదవికి నేనే పిలిపిస్తాను. తరువాత దయతో కాపాడతాను కూడ.
8-665-క.
వ్యాధులుఁ దప్పులు నొప్పులు
బాధలుఁ జెడి విశ్వకర్మభావిత దనుజా
రాధిత సుతలాలయమున
నేధిత విభవమున నుండు నితఁ డందాకన్.
టీకా:
వ్యాధులు = రోగములు; దప్పులు = కష్టములు; నొప్పులు = నొప్పులు; బాధలు = బాధలు; చెడి = లేకుండపోయి; విశ్వకర్మ = విశ్వకర్మచేత; భావిత = సృష్టింపబడినట్టి; దనుజ = రాక్షసులచే; ఆరాధిత = సేవింపబడెడి; సుతలాలయమునన్ = సుతలలోకమున; ఏధిత = వృద్ధిపొందినట్టి; విభవమునన్ = వైభవముతో; ఉండున్ = ఉండును; ఇతండు = ఇతను; అంత = అప్పటి; దాకన్ = వరకు.
భావము:
రోగాలూ శ్రమలూ ఆపదలూ దుఃఖాలు లేకుండా; విశ్వకర్మ చేత సృష్టింపబడిన సుతలలోకంలో, అంతవరకూ ఇతడు దానవుల సేవలు అందుకుంటూ. ఐశ్వర్యంతో వైభవాలతో ఉంటాడు.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=84&Padyam=665
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :
No comments:
Post a Comment