Friday, September 30, 2016

క్షీరసాగరమథనం – ఆకాశంబున వచ్చు

8-374-శా.
కాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా
నా కాండంబుల వాని కంఠము దెగన్ దంభోళియున్ వైచె న
స్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగ లేదయ్యె; వా
డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్.
8-375-వ.
ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది దన మనంబున.

టీకా:
            ఆకాశంబునన్ = ఆకాశములో; వచ్చు = వచ్చుచున్న; శూలమున్ = శూలమును; జంభారాతి = ఇంద్రుడు; ఖండించి = ముక్కలుచేసి; నానా = అనేకమైన; కాండంబులన్ = బాణములతో; వాని = అతని; కంఠమున్ = కంఠము; తెగన్ = తెగిపోవునట్లు; దంభోళియున్ = వజ్రాయుధమును; వైచెన్ = వేసెను; అస్తోక = బలమైన; ఇంద్ర = ఇంద్రుని; ఆయుధమున్ = ఆయుధముకూడ; సురారి = రాక్షసుని; గళమున్ = గొంతును; త్రుంపగన్ = తెంప; లేదయ్యె = లేకపోయినది; వాడు = అతడు; ఆకంపింపకన్ = చలింపకుండగ; నిల్చెన్ = నిలబడెను; దేవవిభుడు = ఇంద్రుడు; అతి = మిక్కలి; ఆశ్చర్యమున్ = ఆశ్చర్య; పొందగన్ = పడిపోయెను.
            ఇట్లు = ఈ విధముగ; నిలిచి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; నముచిన్ = నముచిని; కనుంగొని = చూసి; వజ్రంబు = వజ్రము; ప్రతిహతంబు = వమ్ముపోయినది; అగుట = అయిపోవుట; కున్ = కు; శంకించి = సందేహించి; బలభేది = ఇంద్రుడు; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు.

భావము:
          నముచి విసిరిన శూలం ఆకాశంలో వస్తుండగానే, ఇంద్రుడు దానిని ఖండించాడు. నముచి తల నరకడానికి అనేకమైన బాణాలు వేశాడు, వజ్రాయుధం ప్రయోగించాడు. కానీ నముచి తలను వజ్రాయుధం సైతం ఖండించ లేకపోయింది. నముచి చలించకుండా నిలబడి ఉండడం చూసి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు.
          ఇలా వజ్రాయుధం ప్రయోగించినా ఎదురు నిలబడగలిగిన నముచిని చూసి, సందేహించి, ఇంద్రుడు తనలో ఈ విధంగా అనుకున్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: