Sunday, September 11, 2016

క్షీరసాగరమథనం – నాకాధీశుఁ బదింట

అష్టమ స్కంధముబలిప్రతాపము
8-335-శా.
నాకాధీశుఁ బదింట, మూఁట గజమున్నాల్గింట గుఱ్ఱంబులన్
కాస్త్రంబున సారథిం జొనిపె, దైత్యేంద్రుండు దా నాకస
ల్లోకాధీశుఁడు ద్రుంచి యన్నిటిని దోడ్తో నన్ని భల్లంబులన్
రాకుండన్ రిపువర్గముం దునిమె గీర్వాణారి యగ్గింపఁగన్.

టీకా:
            నాకాధీశున్ = ఇంద్రుని; పదింటన్ = పదింటితోను (10); మూటన్ = మూడింటితో (3); గజమున్ = ఐరావతమును; నాల్గింటన్ = నాలుగింటితోను (4); గుఱ్ఱంబులన్ = గుర్రములను; ఏక = ఒక (1); అస్త్రంబునన్ = బాణముతోను; సారథిన్ = సారథిని; చొనిపెన్ = నాటెను; దైత్రేంద్రుండు = బలిచక్రవర్తి; తాన్ = అతను; ఆకసల్లోకాధీశుడు = ఇంద్రుడు; త్రుంచి = విరిచి; అన్నిటినిన్ = అన్నింటిని; తోడ్తోన్ = వెంటనే; అన్ని = అన్ని; భల్లంబులన్ = బాణములతోను; రాకుండన్ = చేరకుండ; రిపు = శత్రువు యొక్క; వర్గమున్ = సమూహమును; తునిమెన్ = ఖండించెను; గీర్వాణారి = బలి; అగ్గింపగన్ = మెచ్చుకొనగా.

భావము:
          ఆ యుద్ధంలో దైత్యరాజు బలి చక్రవర్తి, స్వర్గాధిపది దేవేంద్రునిమీద పది బాణాలనూ, ఆయన వాహనం ఐరావతంమీద మూడు బాణాలనూ, ఆయన రథం లాగే గుర్రాలమీద నాలుగు బాణాలూ, రథసారథి మీద ఒక బాణం వేసాడు. వెంటనే ఆకాశలోకాలకు ప్రభువు అయిన దేవేంద్రుడు అ బాణాలన్నిటిని ఖండించాడు. ఆ అసుర చక్రవర్తి బలి దేవేంద్రుని పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: