Saturday, September 3, 2016

క్షీరసాగరమథనం – దానవు

8-326-క.
దావు లమృతము ద్రావం
బూని పయోరాశిఁ ద్రచ్చి పొగిలిన మాడ్కిన్
శ్రీనాథ పరాఙ్ముఖులగు
హీనులు పొందంగఁజాల రిష్టార్థంబుల్.
8-327-క.
శోధించి జలధి నమృతము
సాధించి నిలింపవైరి క్షుర్గతులన్
రోధించి సురల కిడి హరి
బోధించి ఖగేంద్రు నెక్కి పోయె నరేంద్రా!

టీకా:
            దానవులు = రాక్షసులు; అమృతమున్ = అమృతమును; త్రావన్ = తాగవలెనని; పూని = ప్రయత్నించి; పయోరాశిన్ = సముద్రమును; త్రచ్చి = చిలికి; పొగిలిని = దుఃఖముచెందిన; మాడ్కిన్ = వలె; శ్రీనాథ = విష్ణుని; పరాఙ్ముఖులు = వ్యతిరేకులు; అగు = అయిన; హీనులు = వివేకహీనులు; పొందంగన్ = పొందుటకు; చాలరు = సమర్ధులుకారు; ఇష్ట = కోరిన; అర్థముల్ = ప్రయోజనములను.
            శోధించి = కష్టపడిప్రయత్నించి; జలధిన్ = సముద్రమునందు; అమృతమున్ = అమృతమును; సాధించి = సంపాదించి; నిలింపవైరిన్ = రాక్షసులను; చక్షుర్ = చూపుల; గతులన్ = నడకలతోనే; రోధించి = నియమించి; సురల్ = దేవతల; కున్ = కు; ఇడి = ఇచ్చి; హరి = విష్ణుమూర్తి; బోధించి = హెచ్చరించి; ఖగేంద్రున్ = గరుత్మంతుని; ఎక్కి = ఎక్కి; పోయెన్ = వెళ్ళిపోయెను; నరేంద్రా = రాజా.

 భావము:
               రాక్షసులు అమృతం త్రాగాలని సంకల్పించి, పాలసముద్రాన్ని చిలికినా దుఃఖాన్ని పొందారు. అవును, లక్ష్మీపతి విష్ణుమూర్తి యందు భక్తిలేని వివేకహీనులు కోరిన కోరికలు తీరి కృతార్థులు కాలేరు కదా.
               ఓ పరీక్షిన్మహారాజా! రాక్షసులను తన కంటి చూపులతోనే నిరోధించి, కష్టపడి సాధించిన అమృతాన్ని, దేవతలకు ఇచ్చి విష్ణుమూర్తి గరుత్మంతుని ఎక్కి వెళ్ళిపోయాడు.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: