8-353-శా.
“నీవే పోటరివే?
సురేంద్ర! తెగడన్ నీకేల?
గెల్పోటముల్
లేవే? యెవ్వరి పాలఁ బోయినవి? మేల్గీడుల్ విరించాదులుం
ద్రోవం జాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా
దైవం బేమి?
కరస్థలామలకమే? దర్పోక్తులుం బాడియే?
8-354-ఆ.
జయము లపజయములు సంపద లాపద
లనిల చలిత దీపికాంచలములు
చంద్రకళలు మేఘచయములు దరఁగలు
మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు.”
టీకా:
నీవే = నువ్వొక్కవే;
పోటరివే = మొనగాడవా కాదు;
సురేంద్ర = దేవేంద్రుడా;
తెగడన్ = దూషించుట;
నీకు =
నీకు; ఏలన్ = ఎందుకులే;
గెల్పు = జయ;
ఓటముల్ = అపజయములు;
లేవే = తప్పవుగదా;
ఎవ్వరి = ఎవరి;
పాలన్ = ఎడల;
పోయినవి = లేకుండినవి;
మేల్ = సుఖములు;
కీడుల్ =
దుఃఖములు; విరించి = బ్రహ్మదేవుడు;
ఆదులున్ = మొదలగువారైనను;
త్రోవన్ =
తప్పించుకొన;
చాలుదురా = సమర్థులా;
ఏ = ఏ; విధానమునన్ = విధముగానైన;
సంతోషింపన్
= సంతోషించుటకు;
శోకింపన్ = దుఃఖించుటకు;
ఆ = ఆ; దైవంబున్ = దైవము;
ఏమి = ఏమైనా;
కరస్థల = అరచేతిలోని;
అమలకమే = ఉసిరికాయా;
దర్ప = గర్వముతోకూడిన;
ఉక్తులున్ =
పలుకులు; పాడియే = తగునా కాదు.
జయముల్ = జయములు;
అపజయములున్ = అపజయములు;
సంపదలు = సంపదలు;
ఆపదలు = ఆపదలు;
అనిల = గాలికి;
చలిత =
చలించెడి; దీపికాంచలములు = దీపములు;
చంద్ర = చంద్రుని యొక్క;
కళలు = కళలు;
మేఘ =
మబ్బుల; చయములున్ = గుంపులు;
తరగలున్ = నీటిఅలలు;
మెఱుగులు = మెరుపుతీగలు;
అమరవర్య = ఇంద్రా;
మిట్టిపడకు = విర్రవీగవద్దు.
భావము:
“ఓహో దేవేంద్రుడా! నువ్వొక్కడవే మొనగాడవాడను అనుకోకు. మిడిసిపడి తెగడబోకు. జయాపజయాలు
దైవాధీనాలు. ఎవరికైనా ఇవి తప్పవు సుమా. బ్రహ్మాదులైనా సరే సుఖదుఖాలను
తప్పించుకోలేరు. ఇంతోటిదానికి సంతోషించడం గానీ, దుఖించడంగానీ తగదు సుమా. దేవుడు
అరచేతిలో ఉసిరికాయ యేం కాదు. ఇలా ప్రగల్భాలు పలకడం పద్ధతి కాదు.
ఇంద్రా! ఎంతటి దేవతలలో మేటివి అయినా. జయాలు అపజయాలూ; సంపదలూ ఆపదలూ సర్వం అశాశ్వతాలు అనీ; అవి గాలిలో దీపాలు, చంద్రకళలు, మేఘమాలికలు, మెరుపుతీగలు వంటివి అనీ
తెలుసుకో. విర్రవీగబోకు.”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment