8-331-వ.
మఱియు
నముచి శంబర బాణ ద్విమూర్ధ కాలనాభ శకుని జంభాయోముఖ ప్రహేతి హేతి భూతసంత్రాస హయగ్రీవ కపిలేల్వలోత్కళ మేఘదుందుభి మయత్రిపురాధిప విప్రచిత్తి విరోచన వజ్ర దంష్ట్ర తారకారిష్టారిష్టనేమి శుంభ నిశుంభ శంకుశిరః ప్రముఖులును బౌలోమ కాలకేయులును, నివాత కవచ ప్రభృతులును, దక్కిన దండయోధులునుం గూడికొని యరదంబులం దురగంబుల మాతంగంబుల హరిణంబుల హరి కిరి శరభ మహిష గవయ ఖడ్గ గండభేరుండ చమరీ
జంబుక శార్దూల గో వృషాది మృగంబులను, గంక గృధ్ర కాక కుక్కుట బక శ్యేన హంసాది విహంగంబులను, దిమి తిమింగ లాది జలచరంబులను, నరులను, నసుర సుర నికర వికృత విగ్రహ రూపంబులగు జంతువులను నారోహించి తమకు నడియాలంబులగు గొడుగులు పడగలు
జోడుఁగైదువలు పక్కెరలు బొమిడికంబులు మొదలగు పోటుము
ట్లాయితంబుగఁ గైకొని వేఱు వేఱ మొనలై
విరోచననందనుం
డగు బలిముందట నిలువంబడిరి; దేవేంద్రుండును నైరావతారూఢుండై వైశ్వానర వరుణ వాయు దండధరాద్యనేక నిర్జర వాహినీ సందోహంబునుం, దాను నెదురుపడి పిఱుతివియక
మోహరించె; నట్లు సంరంభసన్నాహ సముత్సాహంబుల రెండుదెఱంగుల వారునుం బోరాడు వేడుకల మీఁటగు మాటల సందడించుచున్న సమయంబున.
టీకా:
మఱియున్ = ఇంకను;
నముచి = నముచి;
శంబర = శంబరుడు;
బాణ = బాణుడు;
ద్విమూర్ధ = ద్విమూర్ధుడు;
కాలనాభ = కాలనాభుడు; శకుని = శకుని;
జంభ = జంభుడు;
అయోముఖ = అయోముఖుడు;
ప్రహేతి =
ప్రహేతి; హేతి = హేతి;
భూతసంత్రాస = భూతసంత్రాసుడు;
హయగ్రీవ = హయగ్రీవుడు;
కపిల = కపిలుడు; ఇల్వల = ఇల్వలుడు;
ఉత్కళ = ఉత్కళుడు;
మేఘ = మేఘుడు;
దుందుభి =
దుందుభుడు; మయ = మయుడు;
త్రిపురాధిప = త్రిపురాధిపుడు;
విప్రచిత్తి =
విప్రచిత్తి;
విరోచన = విరోచనుడు;
వజ్ర = వజ్రదంష్ట్రుడు;
తారక = తారకుడు;
అరిష్టనేమి = అరిష్టనేమి;
శుంభ = శుంభుడు;
నిశుంభ = నిశుంభుడు;
శంకుశిరస్ =
శంకుశిరసుడు;
ప్రముఖులునున్ = మొదలైనవారు;
పౌలోమ = పౌలోములు;
కాలకేయులును =
కాలకేయులు; నివాత = నివాతుడు;
కవచ = కవచుడు;
ప్రభృతులును = మున్నగువారు;
తక్కిన = మిగిలిన; దండయోధులునున్ = సేనానాయకులను;
కూడికొని = కలుపుకొని;
అరదంబులన్ =
రథములను; తురగంబులన్ = గుర్రములను;
మాతంగంబులన్ = ఏనుగులను;
హరిణంబులన్ =
లేళ్ళను; హరి = సింహములు;
కిరి = అడవిపందులు;
శరభ = శరభమృగములు;
మహిష =
దున్నపోతులు;
గవయ = గురుపోతులు;
ఖడ్గ = ఖడ్గమృగములు;
గండభేరుండ =
గండభేరుండపక్షులు;
చమరీ = ఆడుసవరపు మృగము;
జంబుక = నక్కలు;
శార్దూల =
పెద్దపులులు;
గో = ఆవులు;
వృష = ఎద్దులు;
ఆది = మున్నగు;
మృగంబులను = జంతువులను;
గృధ = గద్దలు;
కాక = కాకులు;
కుక్కుట = కోళ్ళు;
బక = కొంగలు;
శ్యేన = డేగలు;
హంస = హంసలు; ఆది = మొదలైన;
విహంగంబులను = పక్షులను;
తిమి = తిములు;
తిమింగల =
తిమింగలములు;
ఆది = మున్నగు;
జలచరంబులను = నీటిజంతువులను;
నరులను = నరులు;
అసుర = రాక్షసులు; సుర = దేవతల;
నికర = గుంపుల;
వికృత = వికారమైన;
విగ్రహ =
ఆకృతములుగల;
రూపంబులు = స్వరూపములుగలవి;
అగు = అయిన;
జంతువులను = జంతువులను;
ఆరోహించి = ఎక్కి;
తమ = వారి; అడియాలంబులు = సంకేతములు;
అగు = అయిన;
గొడుగులు =
గొడుగులు; పడగలు = ధ్వజములు,
టెక్కెములు;
జోడుకైదువలు = జోడు కైదువలు;
పక్కెరలు = వాహనములమీదిబట్టలు;
బొమిడికంబులు = కిరీటములు;
మొదలగు = మొదలగు;
పోటుముట్లు =
యుద్ధసాధనములను;
ఆయితంబుగన్ = సిద్దముచేయబడినవిగా;
కైకొని = తీసుకొని;
వేఱువేఱ =
వేరేవేరే; మొనలు = వ్యూహములుగలవారు;
ఐ = అయ్యి; విరోచన = విరోచనుడను రాక్షసుని;
నందనుండు = కొడుకు;
అగు = అయిన;
బలి = బలి; ముందటన్ = ముందు;
నిలువంబడిరి =
నిలబడిరి; దేవేంద్రుండునున్ = ఇంద్రుడు;
ఐరావత = ఐరావతమును;
ఆరూఢుండు =
ఎక్కినవాడు;
ఐ = అయ్యి; వైశ్వానర = అగ్నిదేముడు;
వరుణ = వరుణుడు;
వాయు =
వాయుదేవుడు;
దండధర = యమధర్మరాజు;
ఆది = మున్నగు;
అనేక = అనేకమైన;
నిర్జర =
దేవతల; వాహినీ = సేనా;
సందోహంబునున్ = సమూహములతో;
తాను = అతను;
ఎదురుపడి =
ఎదుర్కొని; పిఱుతివియక = వెనుదీయక;
మోహరించెన్ = వ్యూహములుపన్నెను;
అట్లు = అలా;
సంరంభ = వేగిరపాటులతో;
సన్నాహ = సంసిద్ధత;
సముత్సాహంబుల = మిక్కిలిఉత్సాహముతో;
రెండు = రెండు (2);
తెఱంగులన్ = పక్షముల;
వారునున్ = వారు;
పోరాడు =
యుద్ధముచేసెడి;
వేడుకలన్ = ఉత్సుకతతో;
మీటు = ఉద్రేకపువి;
అగు = అయిన;
మాటలన్ =
పలుకులతో; సందడించుచున్న = సందడిచేయుచున్న;
సమయంబునన్ = సమయమునందు.
భావము:
అలా
వస్తున్న బలిచక్రవర్తి ముందు భాగంలో నముచీ, శంబరాసురుడు, బాణాసురుడు,
ద్విమూర్థుడు, శకుని, జంభాసురుడు, అయోముఖుడు, ప్రహేతి, హేతి, భూతసంత్రాసుడు,
హయగ్రీవుడు, కపిలుడు, ఇల్వలుడు, ఉత్కలుడు, మేఘదుందుభి, మయుడు, త్రిపురాసులు,
విప్రచిత్తి, విరోచనుడు, వజ్రదంష్ట్రుడు, తారకుడు, అరిష్టుడు, అరిష్టనేమి, శంభుడు,
నిశంభుడు, శంకుశిరుడు మొదలైనవారు; పౌలములు, కాలకేయులూ, నివాతులు, కవచులు మున్నగువారు; మిగిలిన సేనానాయకులు అందరూ వారి వారి సేనలను నడుపుకుంటూ వస్తున్నారు. వారు
రథాలూ, గుర్రాలు, ఏనుగులు, జింకలు, సింహాలు, పందులు, శరభాలు, దున్నపోతులు, గురుపోతులు,
ఖడ్గమృగాలు, గండబేరుండాలు, సవరపుమృగాలు, నక్కలు, పులులు, ఎద్దులు మొదలైన జంతువులను; రాంబందులు, గ్రద్దలు, కాకులు, కోడిపుంజులు, కొంగలు, డేగలు, హంసలు మున్నగు
పక్షులను; తిములు, తిమింగలాలు మున్నగు జలచరాలనూ; నరవాహనాలను; రాక్షసాకారాలతో, దేవతాకారాలతో వికారాలైన
ఆకారాలు గల జంతువులనూ వాహనాలుగా చేసికొని ఎక్కి వస్తున్నారు. తమతమ సంకేతాలైన
గొడుగులు, జండాలూ, కవచాలూ, ఆయుధాలు, వాహనాలపై వేసే అంగీలు, శిరస్త్రాణాలు మున్నగు
సమస్త సాధనాలతో సిద్దంగా వస్తున్నారు.
దేవేంద్రుడు
ఐరావతంపై ఎక్కి వస్తున్నాడు. అతనితోపాటు అగ్ని, వరుణుడు, వాయువు, యముడు మొదలైన
అనేక దేవతులు తమ సైన్య సమూహాలతో వచ్చి వెనుదీయకుండా దానవులను ఎదిరించారు. రెండు
పక్షాల వారూ అమిత ఉత్సాహంతో, వేగిరిపాటుతో, గట్టిగా పూని యుద్ధం చేయడానికి సన్నధులు
అయ్యారు. క్రోధోద్రేకాలతో పరస్పరం అధిక్షేపించుకుంటున్నారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment