8-324-క.
ఒకబొట్టుఁ జిక్క కుండఁగ
సకల సుధారసము నమర సంఘంబులకుం
బ్రకటించి పోసి హరి దన
సుకరాకృతిఁ దాల్చె నసుర శూరులు బెగడన్.
8-325-మ.
అమరుల్ రక్కసులుం బ్రయాసబలసత్త్వార్థా భిమానంబులన్
సములై లబ్దవికల్పు లైరి యమరుల్ సంశ్రేయముం బొంది ర
య్యమరారుల్;
బహుదుఃఖముల్
గనిరి తా మత్యంత దోర్గర్వులై;
కమలాక్షున్ శరణంబు వేఁడని జనుల్ కల్యాణ సంయుక్తులే.
టీకా:
ఒక = ఒక్క; బొట్టున్ = చుక్కకూడ; చిక్కకుండగన్ = మిగలకుండ;
సకల = అంత; సుధా = అమృతపు;
రసమున్ =
రసమును; అమర = దేవతా;
సంఘంబుల్ = సమూహముల;
కున్ = కు; ప్రకటించి = బాహాటముగా;
పోసి = పోసి;
హరి = విష్ణుమూర్తి;
తన = తన యొక్క;
సూకర = వరాహావతారపు,
సౌకర్యవంతమైన;
ఆకృతిన్ = రూపును;
తాల్చెన్ = ధరించెను;
అసుర = రాక్షస;
శూరులు =
వీరులు; బెగడన్ = బెదిరిపోగ.
అమరుల్ = దేవతలు;
రక్కసులున్ = రాక్షసులు;
ప్రయాసన్ = శ్రమపడుట;
బల = శక్తి;
సత్త్వ = సామర్థ్యము;
అర్థాభిమానంబులన్ = పూనికలు కలిగుండుటలో;
సములు = సరిసమానులు;
ఐ = అయి యున్నను;
లబ్ద = ఫలితములుపొందుటలో;
వికల్పులు = అసమత్వముగలవారు;
ఐరి = అయినారు;
అమరుల్ =
దేవతలు; సంశ్రేయమున్ = మిక్కిలి శుభములను;
పొందిరి = పొందిరి;
ఆ = ఆ; అమరారుల్ =
రాక్షసులు; బహు = అనేకరకముల;
దుఃఖముల్ = దుఃఖములను;
కనిరి = పొందిరి;
తాము =
వారు; అత్యంత = బహుమిక్కిలి;
దోర్గర్వులు = భుజబలగర్వముగలవారు;
ఐ = అయ్యి; కమలాక్షున్ = విష్ణుమూర్తి;
శరణంబు = శరణు;
వేడని = కోరని;
జనుల్ = వారు;
కల్యాణ = మంగళములను; సంయుక్తులే = కూడినవారా,
కాదు.
భావము:
విష్ణు మూర్తి, ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా, అమృతమంతా దేవతకు బాహాటంగా
పోసి, మోహినీ రూపాన్ని వదలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస
వీరులు దుఃఖించారు.
దేవతలూ, రాక్షసులూ సరిసమానమైన సంకల్పమూ, శక్తీ, బలమూ, తెలివీ, ధనమూ, ఆత్మగౌరవమూ ఉన్నవారే.
కానీ ఇద్దరికి రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును
ఆశ్రయించని కారణంచేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాల పాలయ్యారు. అవును, విష్ణువును శరణు వేడని
వారు శుభాలు పొందలేరు కదా!
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment