Thursday, September 15, 2016

క్షీరసాగరమథనం – విహగేంద్రాశ్వ

అష్టమ స్కంధము : హరి అసురుల శిక్షించుట
8-341-వ.
అట్లు మొఱయిడు నవసరంబున.
8-342-మ.
విగేంద్రాశ్వ నిరూఢుఁడై మణిరమా విభ్రాజితోరస్కుఁడై
హుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుఁడై భాస్వత్కిరీటాది దు
స్సహుఁడై నవ్యపిశంగచేల ధరుఁడై సంఫుల్లపద్మాక్షుఁడై
విహితాలంకృతితోడ మాధవుఁడు దా వేంచేసె నచ్చోటికిన్.

టీకా:
          అట్లు = అలా; మొఱ = మొర; ఇడు = పెట్టు; అవసరంబునన్ = సమయమునందు.
          విహగేంద్ర = గరుడ; అశ్వ = వాహన; నిరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; మణి = కౌస్తుభమణి; రమా = లక్ష్మీదేవిలచేత; విభ్రాజిత = ప్రకాశించుతున్న; ఉరస్కుడు = వక్షస్థలముగలవాడు; = అయ్యి; బహు = అనేక; శస్త్ర = శస్త్రములు; అస్త్ర = అస్త్రములు; రథాంగ = చక్రములు; సంకలితుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; భాస్వత్ = మెరుస్తున్న; కిరీట = కిరీటములు; ఆది = మున్నగువానితో; దుస్సహుడు = చూడశక్యముగానివాడు; ఐ = అయ్యి; నవ్య = కొత్త; పిశంగ = పసుపుపచ్చని; చేల = బట్టలు; ధరుడు = ధరించినవాడు; ఐ = అయ్యి; సంపుల్ల = బాగుగా విరిసిన; పద్మ = పద్మములవంటి; అక్షుడు = కన్నులుగలవాడు; ఐ = అయ్యి; విహిత = తగిన; అలంకృతి = అలంకారముల; తోడన్ = తోటి; మాధవుడు = విష్ణువు; తాన్ = అతను; వేంచేసెన్ = వచ్చెను; ఆ = ఆ; చోటున్ = ప్రదేశమున; కిన్ = కు.

భావము:
           అలా దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటున్న సమయంలో . .
          మహావిష్ణువు తన వాహనం పక్షిరాజు గరుడుని మీద కూర్చుని అక్కడకి వచ్చాడు. అప్పుడు ఆయన వక్షస్థలం మీద కౌస్తుభమణి మణితోనూ, లక్ష్మీదేవితోనూ ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్రాయుధంతో సహా అనేక ఆయుధాలు అన్నీ ఆయన వద్ద ఉన్నాయి. చూడ శక్యము కానంతటి ధగధగలాడే కిరీటాలు మున్నగునవీ; సరిక్రొత్త పసుపుపచ్చని పట్టు బట్టలూ; తగిన ఆభరణాలు  అనేకమూ ధరించి ఉన్నాడు. వికసించిన పద్మాల వంటి కన్నులతో విరాజిల్లుతున్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: