Tuesday, September 13, 2016

క్షీరసాగరమథనం – ఇట్లు దానవేంద్రుని


8-337-వ.
ఇట్లు దానవేంద్రుని మాయావిశేషవిధానంబున సురానీకంబులపైఁ బర్వతంబులు పడియె; దావాగ్ని దందహ్యమాన తరువర్షంబులు గురిసె సటంక శిఖర నికర శిలాసారంబులు గప్పె; మహోరగ దందశూకంబులు గఱచె; వృశ్చికంబులు మీటె; వరాహ వ్యాఘ్ర సింహంబులు గదిసి విదళింపన్ దొరఁకొనియె; వనగజంబులు మట్టిమల్లాడం జొచ్చె; శూలహస్తులు దిగంబరులునై రండు రండని బలురక్కసులు శతసహస్రసంఖ్యులు భేదనచ్ఛేదన భాషణంబులు చేయం దొడంగిరి; వికృత వదనులు గదాదండధారులు నాలంబిత కేశభారులునై యనేక రాక్షస వీరులు "పోనీకు పోనీకుఁడు; తునుము తునుముం" డని వెనుతగిలిరి; పరుష గంభీర నిర్ఘాత సమేతంబులయిన జీమూత సంఘాతంబులు వాతాహతంబు లై యుప్పతిల్లి నిప్పుల కుప్పలు మంటల ప్రోవులుం గురిసె; మహాపవన విజృంభితంబైన కార్చిచ్చు ప్రళయానలంబు చందంబునం దరికొనియె; ప్రచండ ఝంఝానిల ప్రేరిత సముత్తుంగ తరంగావర్త భీషణంబయిన మహార్ణవంబు చెలియలి కట్ట దాఁటి వెల్లివిరిసిన ట్లమేయంబయి యుండె; నా సమయంబునం బ్రళయకాలంబునుం బోలె మిన్ను మన్నును రేయింబగలు నెఱుంగ రాదయ్యె; అయ్యవసరంబున.
టీకా:
            ఇట్లు = ఇలా; దానవేంద్రుని = బలి యొక్క; మాయా = మాయా యందలి; విశేష = ప్రత్యేకమైన; విధానంబునన్ = విధానములవలన; సుర = దేవతా; అనీకంబుల్ = సైన్యముల; పైన్ = మీద; పర్వతంబులు = కొండలు; పడియెన్ = పడెను; దావాగ్ని = కార్చిచ్చుతో; దందహ్యమాన = కాలిపోతున్న; తరు = వృక్షముల; వర్షంబులు = వానలు; కురిసెన్ = కురుసినవి; సటంక = టంకారములతోకూడిన; శిఖర = కొండశిఖరముల; నికర = సమూహముల; శిలా = రాళ్ళ; సారంబులు = వర్షములు; కప్పె = పడెను; మహోరగ = కొండచిలువలు; దందశూకంబులున్ = పాములు; కఱచెన్ = కరచినవి; వృశ్చికంబులున్ = తేళ్ళు; మీటెన్ = కుట్టినవి; వరాహ = అడవిపందులు; వ్యాఘ్ర = పులులు; సింహంబులున్ = సింహములు; కదిసి = పైకిదూకి; విదళింపన్ = చీల్చివేయ; దొరకొనియె = మొదలిడెను; వనగజంబులున్ = అడవి ఏనుగులు; మట్టిమల్లాడ = తొక్కవేయ; చొచ్చెన్ = సాగెను; శూల = శూలములు; హస్తులు = చేతధరించినవారు; దిగంబరులున్ = వివస్త్రలు; ఐ = అయ్యి; రండురండు = రారమ్ము; అని = అని; బలు = బలిష్టమైన; రక్కసులు = రాక్షసులు; శత = వందలు; సహస్ర = వేల; సంఖ్యులు = సంఖ్యలుగలవారు, మంది; భేదన = తిరస్కార; ఛేదన = ఖండించెడి; భాషణంబులున్ = కేకలను; చేయన్ = పెట్టుట; తొడగిరి = మొదలిడిరి; వికృత = వికారమైన; వదనులు = ముఖముగలవారు; గదాదండ = గదాయధములను; ధారులు = ధరించినవారు; ఆలంబిత = వేళ్ళాడుతున్న; కేశభారులునున్ = శిరోజములుగలవారు; ఐ = అయ్యి; అనేక = పలు; రాక్షస = రాక్షస; వీరులు = శూరులు; పోనీకు = పోనివ్వకండి; పోనీకుడు = పోనివ్వకండి; తునుము = నరకండి; తునుముండు = నరకండి; అని = అని; వెనుతగిలిరి = తరిమిరి; పరుష = క్రూరమైన; గంభీర = గంభీరమైన; నిర్ఘాత = పిడుగులతో; సమేతంబులు = కూడినవి; అయిన = ఐన; జీమూత = మేఘముల; సంఘాతంబులు = సమూహములు; వాతా = గాలిచేత; హతంబులు = చెదరగొట్టబడినవి; ఐ = అయ్యి; ఉప్పతిల్లి = పుట్టి; నిప్పుల = నిప్పుల; కుప్పలున్ = కుప్పలను; మంటల = మంటల; ప్రోవులున్ = పోగులు; కురిసెన్ = వర్షించెను; మహా = గొప్ప; పవన = గాలిచేత; విజృంభితంబు = ప్రేరేపింపబడినది; ఐన = అయిన; కార్చిచ్చున్ = దావాగ్ని; ప్రళయ = ప్రళయకాలపు; అనలంబు = అగ్ని; చందంబునన్ = వలె; తరికొనియెన్ = రగుల్కొనెను; ప్రచండ = తీవ్రమైన; ఝంఝా = ఝంఝం యనెడి; అనిల = గాలిచేత; ప్రేరిత = ప్రేరేపింపబడిన; సముత్తంగ = మిక్కలి ఎత్తైన; తరంగ = అలలు; ఆవర్త = సుడిగుండములతో; భీషణంబు = భయంకరమైనది; అయిన = ఐన; మహార్ణవంబున్ = మహాసముద్రములు; చెలియలికట్ట = సరిహద్దుగట్టు; దాటి = దాటిపోయి; వెల్లివిరిసిన = ఉప్పొంగిన; అట్లు = విధముగ; అమేయంబు = అపరిమేతమైనది; అయి = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ; సమయంబునన్ = సమయములో; ప్రళయకాలంబును = ప్రళయకాలము; పోలెన్ = వలె; మిన్నున్ = నింగి; మన్నునున్ = నేల; రేయి = రాత్రి; పగలున్ = పగలు; ఎఱుంగన్ = తెలియ; రాదయ్యెన్ = రాకుండెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:
          ఇలా బలిచక్రవర్తి పన్నిన ఇంద్రజాలం వలన దేవతలమీద పర్వతాలు వచ్చి పడ్డాయి; కార్చిచ్చుతో మండుతూ చెట్లు చెలరేగాయి; కొండశిఖరాలనుండి రాళ్ళ వాన వర్షించింది; పెద్దపెద్ద నాగుపాములు మీదపడి కరిచాయి; తేళ్ళు కుట్టాయి; అడవి పందులూ, పులులూ, సింహాలూ మీదమీదకి దూకి చీల్చబోతున్నాయి; అడవి ఏనుగులు వచ్చి పడద్రొక్కాయి;
          మహారక్కస మూకలు లక్షల సంఖ్యలలో, దిసమొలలతో  శూలాలు ధరించి, రండి రం డంటూ, నరుకుతాం, కోస్తాంఅంటూ కేకలు పెట్టారు. రాక్షస వీరులు ఎంతో మంది గదాదండాలు ధరించి, వికారమైన ముఖాలతో, వ్రేలాడుతున్న శిరోజాలతో పోనివ్వకండి, పోనివ్వకండి. . . నరకండి, నరకండి అంటూ వెన్నంటి తరుమసాగారు. భీకరమైన, గంభీరమైన పిడుగులతో కూడిన మేఘ సమూహాలు గాలివాలులకు చెలరేగి, నిప్పుల కుప్పలనూ, మంటల రాసులనూ కురిపించాయి. పెనుగాలుల వలన చెలరేగిన కారుచిచ్చు ప్రళయ కాలపు అగ్నివలె మండసాగింది. తీవ్రమైన తుఫాను వలన అల్లకల్లోలమైన సముద్రపు అలలు, సుడిగుండాలు పెద్దపెద్దవాటితో పొంగి గట్లుదాటి పొర్లసాగింది. అప్పుడు, ప్రళయకాలమా అన్నట్లు నింగీ, నేలా; రాత్రీ, పగలూ తేడా తెలియరాకుండా పోయింది.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: