Saturday, September 10, 2016

క్షీరసాగరమథనం – ఇవ్విధంబున

8-334-వ.
ఇవ్విధంబున నుభయబలంబులును మోహరించి బలితో నింద్రుండును, దారకునితో గుహుండును, హేతితో వరుణుండును, బ్రహేతితో మిత్రుండును, గాలనాభునితో యముండును, మయునితో విశ్వకర్మయు, శంబరునితోఁ ద్వష్టయు, విరోచనితో సవితయు, నముచితోఁ బరాజితుండును, వృషపర్వునితో నశ్విదేవతలును, బలిసుతబాణాది పుత్రశతంబుతో సూర్యుండును, రాహువుతో సోముండును, బులోమునితో ననిలుండును, శుంభ నిశుంభులతో భద్రకాళీదేవియు, జంభునితో వృషాకపియును, మహిషునితో విభావసుండును, నిల్వల వాతాపులతో బ్రహ్మపుత్రులును, దుర్మర్షణునితోఁ గామదేవుండును, నుత్కలునితో మాతృకాగణంబును, శుక్రునితో బృహస్పతియు, నరకునితో శనైశ్చరుండును, నివాత కవచులతో మరుత్తులును, గాలేయులతో వసువులు, నమరులును, బౌలోములతో విశ్వేదేవగణంబును, గ్రోధవశులతో రుద్రులును, నివ్విధంబునం గలిసి పెనంగి ద్వంద్వయుద్ధంబు చేయుచు మఱియు రథికులు రథికులను, పదాతులు పదాతులను, వాహనారూఢులు వాహనారూఢులనుం, దాఁకి సింహనాదంబులు చేయుచు, నట్టహాసంబు లిచ్చుచు, నాహ్వానంబు లొసంగుచు, నన్యోన్యతిరస్కారంబులు చేయుచు, బాహునాదంబుల విజృంభించుచుఁ, బెనుబొబ్బల నుబ్భిరేగుచు, హుంకరించుచు, నహంకరించుచు, ధనుర్గుణంబులఁ డంకరించుచు, శరంబుల నాటించుచుఁ, బరశువుల నఱకుచుం, జక్రంబులం జెక్కుచు, శక్తులం దునుముచుఁ, గశలంబెట్టుచుఁ, గుఠారంబులఁ బొడుచుచు, గదల నడచుచుఁ, గరంబులఁ బొడుచుచుఁ, గరవాలంబుల వ్రేయుచుఁ, బట్టిసంబుల నొంచుచుఁ, బ్రాసంబులం ద్రెంచుచుఁ, బాశంబులం గట్టుచుఁ, బరిఘంబుల మొత్తుచు, ముసలంబుల మోఁదుచు, ముద్గరంబుల జదుపుచు, ముష్టివలయంబుల ఘట్టించుచుఁ, దోమరంబుల నుఱుముచు శూలంబులఁ జిమ్ముచు, నఖంబులం జీరుచుఁ, దరు శైలంబుల ఱువ్వుచు, నుల్ముకంబులం జూఁడుచు నిట్లు బహువిధంబులం గలహ విహారంబులు సలుపు నవసరంబున భిన్నంబు లయిన శిరంబులును, విచ్ఛిన్నంబులైన కపాలంబులును, వికలంబులైన కపోలంబులును, జిక్కుపడిన కేశబంధంబులును, భగ్నంబులైన దంతంబులును, గృత్తంబులైన భుజంబులును, ఖండితంబులైన కరంబులును, విదళితంబు లైన మధ్యంబులును, వికృతంబులైన వదనబింబంబులును, వికలంబు లైన నయనంబులును, వికీర్ణంబు లయిన కర్ణంబులును, విశీర్ణంబు లైన నాసికలును, విఱిగిపడిన యూరుదేశంబులును, విసంధులయిన పదంబులునుఁ, జిరిగిన కంకటంబులును, రాలిన భూషణంబులును, వ్రాలిన కేతనంబులును, గూలిన ఛత్రంబులును, మ్రగ్గిన గజంబులును, నుగ్గయిన రథంబులును, నుఱుమైన హయంబులునుఁ, జిందఱవందఱలైన భటసమూహంబులును, నొఱలెడు కొఱప్రాణంబులును, బొఱలెడు మేనులును, నుబ్బి యాడెడు భూతంబులును, బాఱెడు రక్త ప్రవాహంబులును, గుట్టలుగొన్న మాంసంబులును, నెగసి తిరిగెడి కబంధంబులునుఁ, గలకలంబులు జేయు కంక గృధ్రాది విహంగంబులు, నయి యొప్పు నప్పోరతిఘోరంబయ్యె నప్పుడు.
టీకా:
          ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఉభయ = రెండు (2); బలంబులును = సైన్యములు; మోహరించి = గుమిగూడి; బలి = బలి; తోన్ = తోటి; ఇంద్రుండును = ఇంద్రుడు; తారకుని = తారకుడి; తోన్ = తోటి; గుహుండును = గుహుడు; హేతి = హేతి; తోన్ = తోటి; వరుణుండును = వరుణుడు; ప్రహేతి = ప్రహేతి; తోన్ = తోటి; మిత్రుండును = మిత్రుడు; కాలనాభుని = కాలనాభుడి; తోన్ = తోటి; యముండును = యముడు; మయుని = మయుడి; తోన్ = తోటి; విశ్వకర్మయు = విశ్వకర్మ; శంబరుని = శంబరుడి; తోన్ = తోటి; త్వష్టయున్ = త్వష్ట; విరోచని = విరోచనుడి; తోన్ = తోటి; సవితయున్ = సవిత; నముచి = నముచి; తోన్ = తోటి; పరాజితుండును = పరాజిత్తు; వృషపర్వుని = వృషపర్వుడి; తోన్ = తోటి; అశ్వనీదేవతలున్ = అశ్వనీదేవతలు; బలి = బలి యొక్క; సుత = పుత్రుడు; బాణ = బాణుడు; ఆది = మున్నగు; పుత్ర = కొడుకులు; శతంబున్ = నూరుమంది; తోన్ = తోటి; సూర్యుండును = సూర్యుడు; రాహువు = రాహువు; తోన్ = తోటి; సోముండును = చంద్రుండు; పులోముని = పులోముడి; తోన్ = తోటి; అనిలుండును = వాయువు; శుంభ = శుంభుడు; నిశుంభుల = నిశుంభుడుల; తోన్ = తోటి; భద్రకాళీదేవియున్ = భద్రకాళి; జంభుని = జంభుడి; తోన్ = తోటి; వృషాకపియును = వృషాకపి; మహిషుని = మహిషుడి; తోన్ = తోటి; విభావసుండును = విభావసుడు; ఇల్వల = ఇల్వలుడు; వాతాపుల = వాతాపిల; తోన్ = తోటి; బ్రహ్మ = బ్రహ్మదేవుని; పుత్రులును = పుత్రులును; దుర్మర్షణుని = దుర్మర్షణుడి; తోన్ = తోటి; కామదేవుండును = మన్మథుడు; ఉత్కలుని = ఉత్కలుడి; తో = తోటి; మాతృగణంబును = మాతృగణములు; శుక్రుని = శుక్రుడి; తోన్ = తోటి; బృహస్పతియు = బృహస్పతి; నరకుని = నరకుడి; తోన్ = తోటి; శనైశ్చరుండును = శనీశ్వరుడు; నివాత = నివాతులు; కవచుల = కవచుల; తోన్ = తోటి; మరుత్తులును = మరుద్దేవతలు; కాలేయుల = కాలకేయుల; తోన్ = తోటి; వసువులున్ = వసువులు; అమరులునున్ = దేవతలు; పౌలోముల = పులోముని పుత్రుల; తోన్ = తోటి; విశ్వేదేవ = విశ్వేదేవతా; గణంబును = సమూహములు; క్రోధవశుల్ = క్రోధవశుల; తోన్ = తోటి; రుద్రులును = రుద్రులు; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; కలిసి = కూడి; పెనంగి = చుట్టుముట్టి; ద్వంద్వయుద్ధంబు = ద్వంద్వయుద్దములు; చేయుచున్ = చేస్తూ; మఱియున్ = ఇంకను; రథికులు = రథికులు; రథికులను = రథికులను; పదాతులు = కాల్బలము, బంటులు; పదాతులను = కాల్బలములను; వాహనారూఢులు = వాహనాలమీదివారు; వాహనారూఢులను = వాహనాలమీదివారిని; తాకి = ఎదుర్కొని; సింహనాదంబులు = గర్జనలు; చేయుచున్ = చేస్తూ; అట్టహాసంబులున్ = బిట్టునవ్వులు; ఇచ్చుచున్ = చేయుచు; ఆహ్వానంబులు = పిలుపులు; ఒసంగుచున్ = ఇస్తూ; అన్యోన్య = ఒకరినొకరు; తిరస్కారంబులున్ = ధిక్కారములు; చేయుచున్ = చేస్తూ; బాహునాదంబులన్ = భుజములచరుపులతో; విజృంభించుచున్ = మించుతూ; పెను = పెద్దపెద్ద; బొబ్బలన్ = కేకలతో; ఉబ్బి = ఉప్పొంగి; రేగుచున్ = చెలరేగుతూ; హుంకరించుచున్ = హుంకారములుచేయుచు; అహంకరించుచున్ = గర్వములుచూపుతూ; ధనుస్ = విల్లుల; గుణంబులన్ = తాళ్ళను; టంకరించుచు = టంటమ్మనిమోగించుచు; శరంబులన్ = బాణములను; నాటించుచున్ = నాటుతూ; పరశువులన్ = గండ్రగొడ్డళ్ళతో; నఱకుచున్ = నరుకుతూ; చక్రంబులన్ = చక్రములతో; చెక్కుచున్ = చెక్కుతూ; శక్తులన్ = శక్తి ఆయుధములతో; తునుముచున్ = తరుగుతూ; కశలన్ = కొరడాలతో; పెట్టుచున్ = కొడుతూ; కుఠారంబులన్ = గొడ్డళ్లతో; పొడుచుచున్ = పొడుస్తూ; గదలన్ = గదలతో; అడచుచున్ = అణచివేస్తూ; కరంబులన్ = చేతులతో; పొడుచుచన్ = పొడుస్తూ; కరవాలంబులన్ = కత్తులతో; వ్రేయుచున్ = వేస్తూ; పట్టిసంబులన్ = అడ్డకత్తులతో; ఒంచుచున్ = వంచుతూ; ప్రాసంబులన్ = ఈటెలతో; తెంచుచున్ = తెంపేస్తూ; పాశంబులన్ = తాళ్ళతో; కట్టుచున్ = కట్టుతూ; పరిఘంబులన్ = ఇనపగొలుసుగుండ్లతో; మొత్తుచున్ = మొత్తుతు; ముసలంబులన్ = రొకళ్ళతో; మోదుచున్ = దంచుతూ; ముద్గరంబులన్ = సమ్మెటలతో; చదుపుచున్ = బాదుతూ; ముష్టివలయంబుల = పిడికిళ్ళతో; ఘట్టించుచున్ = పొడుస్తూ; తోమరంబులన్ = చర్నాకోళ్ళతో; ఉఱుముచున్ = కొడుతూ; శూలంబులన్ = శూలములతో; చిమ్ముచున్ = చిమ్ముతూ; నఖంబులన్ = గోర్లతో; చీరుతున్ = గీరుతూ; తరు = చెట్లు; శైలంబులన్ = కొండరాళ్ళను; ఱువ్వుచున్ = విసరుతూ; ఉల్ముకంబులన్ = కొరవులతో; చూడుచున్ = కాల్చుతూ; ఇట్లు = ఇలా; బహు = అనేక; విధంబులన్ = రకములుగా; కలహ = యుద్ద; విహారంబులున్ = విన్యాసములు; సలుపు = చేయు; అవసరంబునన్ = సమయమునందు; భిన్నంబులు = పగిలిపోయిన; అయిన = ఐన; శిరంబులును = తలలు; విచ్చింన్నంబులు = బద్దలు; ఐన = అయిన; కపాలంబులును = పుర్రెలు; వికలంబులు = చిట్లిపోయినవి; ఐన = అయిన; కపోలంబులును = చెక్కిళ్ళు; చిక్కుపడిన = చిక్కుపడినట్టి; కేశబంధంబులును = జుట్టుముళ్ళు; భగ్నంబులున్ = రాలిన; ఐన = అయిన; దంతంబులును = పళ్ళు; కృత్తంబులు = తెగినవి; ఐన = అయిన; భుజంబులును = భుజములును; ఖండితంబులున్ = ముక్కలైనవి; ఐన = అయిన; కరంబులును = చేతులు; విదళితంబులున్ = ఖండింపబడినవి; ఐన = అయిన; మధ్యంబులును = నడుములు; వికృతంబులు = రూపుమాపబడినవి; ఐన = అయిన; వదన = ముఖ; బింబంబులునున్ = బంబములు; వికలంబులు = లొట్టబోయినవి; ఐన = అయిన; నయనంబులునున్ = కళ్ళు; వికీర్ణంబులు = చెదరినవి; అయిన = ఐన; కర్ణంబులును = చెవులు; విశీర్ణంబులు = తెగినవి; ఐన = అయిన; నాసికలునున్ = ముక్కులు; విఱిగి = విరిగిపోయి; పడిన = పడిపోయిన; ఊరుదేశంబులును = తొడలు; విసంధులు = కీళ్ళువదలినవి; ఐన = అయిన; పదంబులును = కాళ్ళు; చిరిగిన = చిరిగిపోయిన; కంకటంబులును = కవచములు; రాలిన = రాలిన; భూషణంబులును = ఆభరణములు; వ్రాలిన = వాలిపోయిన; కేతనంబులునున్ = జండాలు; కూలిన = కూలినట్టి; ఛత్రంబులును = గొడుగులు; మ్రగ్గిన = క్రుంగిన; గజంబులును = ఏనుగులు; నుగ్గు = నలిగినవి; అయిన = ఐన; రథంబులునున్ = రథములు; ఉఱుము = పొడిగాయైనవి; ఐన = అయిన; హయంబులును = గుర్రములు; చిందఱవందఱలు = చెల్లాచెదరు; ఐన = అయిన; భట = సేనా; సమూహంబులున్ = సమూహములు; ఒఱలెడు = కొట్టికుంటున్న; కొఱప్రాణంబులును = కొనప్రాణములు; పొఱలెడు = దొర్లుతున్న; మేనులు = దేహములు; ఉబ్బి = సంతోషముతోనుబ్బి; ఆడెడు = ఆడుతున్న; భూతంబులును = పిశాచములు; పాఱెడు = పారుతున్న; రక్త = రక్తపు; ప్రవాహంబులునున్ = ఏరులు; గుట్టలుగొన్న = రాశులుపడిన; మాంసంబులును = మాంసములు; ఎగసితిరిగెడి = ఎగిరిపడెడి; కబంధంబులును = పీనుగులు; కలకలంబులున్ = రొదలు; చేయు = చేయెడి; కంక = రాబందులు; గ్రుధ్ర = గద్దలు; ఆది = మున్నగు; విహంగంబులును = పక్షులును; అయి = కలిగినదై; ఒప్పు = ఒప్పెడి; ఆ = ఆ; పోరు = యుద్దము; అతి = మిక్కిలి; ఘోరంబు = భయంకరమైనది; అయ్యెన్ = అయినది; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:
          ఇలాగ రెండు పక్షాల సైన్యాలూ గుమిగూడాయి. బలిచక్రవర్తితో దేవేంద్రుడూ; తారకునితో కుమార స్వామీ; హేతితో వరుణుడూ; ప్రహేతితో మిత్రుడూ; కాలనాభునితో యముడూ; మయాసురునితో విశ్వకర్మా; శంబరునితో త్వష్టా, విరోచనునితో సవితా; నముచితో పరాజిత్తూ; వృషపర్వునితో అశ్వనీదేవతలూ; బాణుడూ మొదలైన బలి కొడుకులతో సూర్యుడూ; రాహువుతో చంద్రుడూ; పులోమునితో వాయువూ; శుంభ నిశుభులతో భద్రా కాళీ; జంభునితో వృషాకపీ; మహిషునితో విభావసుడూ; ఇల్వలునితోను వాతాపితోనూ బ్రహ్మపుత్రులూ; దుర్మర్షుణునితో మన్మథుడూ; ఉత్కలునితో సప్తమాతృకలూ; శుక్రునితో బృహస్పతీ; నరకునితో శనైశ్వరుడూ; నివాతకవచులతో మరుత్తులూ; కాలకేయులతో వసువులూ, దేవతలూ; పౌలోములతో విశ్వేదేవులూ; క్రోధవశులతో రుద్రులూ; ద్వంద్వ యుద్ధాలలో ఎదిరించారు. అంతేకాకుండా, కాలిబంట్లు కాలిబంట్లతోనూ; రథాలవారు రథాలవారితోనూ; వాహనాలవారు వాహనాల వారితోనూ; ఎదిరించి పోరాడారు. ఆ సేనావాహినులు సింహనాదాలు చేస్తూ, బిట్టుగా నవ్వుతూ, ఒకరినొకరు కేకేస్తూ, ధిక్కారాలు చేస్తూ, భూజాలు తట్టి ముందుకురుకుతూ, గావుకేకలతో ఉప్పొంగిపోతూ, హుంకారాలు చేస్తూ, గర్విస్తూ, అల్లెత్రాళ్ళు మ్రోగిస్తూ; బాణాలను నాటుతూ, గండ్రగొడ్డళ్ళతో నరుకుతూ, చక్రాలతో ఖండిస్తూ, శక్తులతో ముక్కల చేస్తూ, కొరడాలతో కొడతూ, గొడ్డళ్ళతో నరుకుతూ, గదలతో మొత్తుతూ, చేతులతో చరుస్తూ, కత్తులతో ఉత్తరిస్తూ, అడ్డకత్తులతో నొప్పిస్తూ, ఈటెలతో తెగవేస్తూ, తాళ్ళతో కట్టేస్తూ, గుదియలతో అదరగొడుతూ, రోకళ్ళతో దంచుతూ, సమ్మెటలతో బాదుతూ, పిడికిళ్ళతో పొడుస్తూ, తోమరాలతో పిండిచేస్తూ, శూలాలతో కుమ్ముతూ, గోళ్ళతో చీలుస్తూ, చెట్లూ కొండలూ విసురుతూ, కొరవులతో కాల్చుతూ పలు విధాలుగా పోరాటాలు చేసారు.
          ఆ యుద్ధం పగిలిపోయిన తలలు, బ్రద్దలయిపోయిన పుర్రెలు, చీలిపోయిన చెక్కిళ్ళు, చిక్కుపడిపోయిన కొప్పులు, విరిపోయిన పండ్లు, తెగిపోయిన భుజాలు, తునాతునకలయిపోయిన చేతులు, విరిగిపోయిన నడుములు, వికారమైపోయిన ముఖాలు, లొట్టపోయిన కన్నులు, తెగిపోయిన చెవులు, ముక్కలైపోయిన ముక్కులు, విరిగిపోయిన తొడలు, తెగిపోయిన పాదాలుతోనూ; చినిగిపోయిన కవచాలు, రాలిపోయిన నగలు, పడిపోయిన జండాలు, విరిగిపోయిన గొడుగులు, కృంగిపోయిన ఏనుగులు, నుగ్గునుగ్గయిపోయిన రథాలు, కూలిపోయిన గుర్రాలు, చెల్లాచెదురయిపోయిన సైన్యసమూహాలుతోనూ; కొట్టుకుంటున్న కొనప్రాణాలు, పొర్లాడుతున్న శరీరాలుతోనూ; సంతోషంతో చిందులు తొక్కుతున్న పిశాచాలు; పారుతున్న నెత్తురు ఏరులు, పోగులు పడుతున్న మాంసాలు, పెరుగుతున్న పీనుగులు పెంటలుతోనూ; రాబందులూ, గ్రద్దలూ మున్నగు పక్షులు చేస్తున్న రొదలుతోనూ మిక్కిలి భయంకరంగా రూపొందింది.      

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: