Friday, September 30, 2016

క్షీరసాగరమథనం – ఆకాశంబున వచ్చు

8-374-శా.
కాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా
నా కాండంబుల వాని కంఠము దెగన్ దంభోళియున్ వైచె న
స్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగ లేదయ్యె; వా
డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్.
8-375-వ.
ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది దన మనంబున.

టీకా:
            ఆకాశంబునన్ = ఆకాశములో; వచ్చు = వచ్చుచున్న; శూలమున్ = శూలమును; జంభారాతి = ఇంద్రుడు; ఖండించి = ముక్కలుచేసి; నానా = అనేకమైన; కాండంబులన్ = బాణములతో; వాని = అతని; కంఠమున్ = కంఠము; తెగన్ = తెగిపోవునట్లు; దంభోళియున్ = వజ్రాయుధమును; వైచెన్ = వేసెను; అస్తోక = బలమైన; ఇంద్ర = ఇంద్రుని; ఆయుధమున్ = ఆయుధముకూడ; సురారి = రాక్షసుని; గళమున్ = గొంతును; త్రుంపగన్ = తెంప; లేదయ్యె = లేకపోయినది; వాడు = అతడు; ఆకంపింపకన్ = చలింపకుండగ; నిల్చెన్ = నిలబడెను; దేవవిభుడు = ఇంద్రుడు; అతి = మిక్కలి; ఆశ్చర్యమున్ = ఆశ్చర్య; పొందగన్ = పడిపోయెను.
            ఇట్లు = ఈ విధముగ; నిలిచి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; నముచిన్ = నముచిని; కనుంగొని = చూసి; వజ్రంబు = వజ్రము; ప్రతిహతంబు = వమ్ముపోయినది; అగుట = అయిపోవుట; కున్ = కు; శంకించి = సందేహించి; బలభేది = ఇంద్రుడు; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు.

భావము:
          నముచి విసిరిన శూలం ఆకాశంలో వస్తుండగానే, ఇంద్రుడు దానిని ఖండించాడు. నముచి తల నరకడానికి అనేకమైన బాణాలు వేశాడు, వజ్రాయుధం ప్రయోగించాడు. కానీ నముచి తలను వజ్రాయుధం సైతం ఖండించ లేకపోయింది. నముచి చలించకుండా నిలబడి ఉండడం చూసి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు.
          ఇలా వజ్రాయుధం ప్రయోగించినా ఎదురు నిలబడగలిగిన నముచిని చూసి, సందేహించి, ఇంద్రుడు తనలో ఈ విధంగా అనుకున్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Thursday, September 29, 2016

క్షీరసాగరమథనం – తన చుట్టంబులఁ

అష్టమ స్కంధమునముచివృత్తాంతము
8-372-వ.
అప్పుడు నముచి నిలువంబడి.
8-373-మ.
 చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధ శోకాత్ముఁడై
కాంతంబును నశ్మసారమయమున్ ఘంటాసమేతంబునై
దృగ్దుస్సహమైన శూలము నొగిన్ సారించి వైచెన్ సురేం
ద్రునిపై దీన హతుండవౌ దని మృగేంద్రుంబోలి గర్జించుచున్.

టీకా:
            అప్పుడు = అప్పుడు; నముచి = నముచి; నిలువంబడి = నిలబడి.
            తన = తన యొక్క; చుట్టంబులన్ = బంధువులను; చంపెన్ = చంపెను; వీడు = ఇతడు; అనుచున్ = అనుచు; ఉద్యత్ = ఉప్పొంగిన; క్రోధ = కోపము; శోక = దుఃఖము కల; ఆత్ముడు = మనసు కలవాడు; = అయ్యి; కనక = బంగారము; అంతంబునున్ = చివరగలది; అశ్మసార = ఇనుముతో; మయము = పోతపోసినది; ఘంటా = గంటలుతో; సమేతంబునున్ = కూడినది; ఐ = అయ్యి; జన = జనులకు; దృక్ = చూడ; దుస్సహము = శక్యముగానిది; ఐన = అయిన; శూలమున్ = బల్లెమును; సారించి = సాచిపెట్టి; వైచెన్ = వేసెను; సురేంద్రుని = ఇంద్రుని; పైన్ = మీదకు; దీనన్ = దీనితో; హతుండవు = చచ్చినవాడవు; ఔదు = అయ్యెదవు; అని = అని; మృగేంద్రు = సింహము; పోలి = వలె; గర్జించుచున్ = గర్జించుచు.

భావము:
          బల, పాకాసురులు మరణించిన పిమ్మట, యుద్ధ భూమిలో ఇంద్రునికి నముచి ఎదురునిలిచి. . .
          తన బంధువులను దేవేంద్రుడు చంపాడని అధికమైన దుఃఖం, కోపం ఉప్పొంగాయి. బంగారపు పిడీ, గంటలూ కలిగి జనులకు చూడటానికే భయంపుట్టేలా ఉన్న ఇనప శూలాన్ని చేపట్టాడు. దీనితో చస్తావు అని సింహంలా గర్జిస్తూ ఆ శూలాన్ని సాటిపెట్టి ఇంద్రుడిపైకి విసిరాడు.   


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Wednesday, September 28, 2016

క్షీరసాగరమథనం – విఱిగిన సేనఁ

8-370-వ.
ఇట్లు వెలువడి.
8-371-చ.
విఱిగిన సేనఁ గాంచి సురవీరుఁ డొహో యని బిట్టు చీరి క్ర
మ్మఱఁ బురికొల్పి పాకబల స్తకముల్ నిశితాస్త్రధారలన్
నెసిన తీక్ష్ణవజ్రమున నేలకు వ్రాల్చెను వాని చుట్టముల్
వెచిరి; తచ్చమూపతులు విహ్వలులై చెడి పాఱి రార్తితోన్.

టీకా:
            ఇట్లు = ఇలా; వెలువడి = బయటకొచ్చి.
            విఱిగిన = కకావికలైన; సేనన్ = సైన్యమును; కాంచి = కనుగొని; సురవీరుడు = ఇంద్రుడు; ఓహో = ఓయ్; అని = అని; బిట్టు = గట్టిగా; చీరి = పిలిచి; క్రమ్మఱన్ = మరల; పురికొల్పి = ఉత్సాహపరచి; పాక = పాకుని; బల = బలుని; మస్తకముల్ = తలలను; నిశిత = వాడియైన; అస్త్ర = కత్తి; ధారలన్ = పదునులతో; నెఱసిన = నిండినట్టి; తీక్ష్ణ = అతితీవ్రమైన; వజ్రమునన్ = వజ్రాయుధముతో; నేల = భూమి; కున్ = కి; వ్రాల్చెను = కూల్చెను; వాని = అతని; చుట్టముల్ = బంధువులు; వెఱచిరి = బెదిరిపోయిరి; తత్ = అతని; చమూపతులున్ = సేనానాయకులు; విహ్వలుల = భయకంపితులు; ఐ = అయి; చెడి = చెదరి; పాఱిరి = 
పారిపోయిరి; ఆర్తి = దుఃఖము; తోన్ = తోటి.

భావము:
          ఇలా ఇంద్రుడు అసురుల అమ్ముల పంజరం నుండి వెలువడి. . .
          వెనుదిరిగి పారిపోతున్న తన సైన్యాన్ని ఓహో. .  అంటూ గట్టిగా పిలిచాడు. సైనికులను యుద్ధానికి పురిగొల్పాడు. పాకుడి తలను వాడి బాణాలతోనూ, బలాసురుడి  తలను వజ్రాయుధంతోనూ నేలకూల్చాడు. అది చూసి బలి బంధువులు భయపడిపోయారు. అతని సేనానాయకులు భయకంపితులై ఏడుస్తూ పారిపోసాగారు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Tuesday, September 27, 2016

క్షీరసాగరమథనం – ఓహో! దేవతలార!

8-367-వ.
అయ్యవసరంబున.
8-368-మ.
రారాతుల బాణజాలముల పాలై పోయితే చెల్లరే! 
రాధీశ్వర! యంచు ఖిన్నతరులై యంభోధిలోఁ జంచల
త్వమునం గ్రుంకు వణిగ్జనంబుల క్రియన్ దైత్యాధిపవ్యూహ
ధ్యమునం జిక్కిరి వేల్పు లందఱు విపద్ధ్వానంబులం జేయుచున్.
8-369-శా.
హో! దేవతలార! కుయ్యిడకుఁ; డే నున్నాఁడ "నం చంబుభృ
ద్వాహుం డా శరబద్ధ పంజరము నంతం జించి తేజంబునన్
వాహోపేత రథంబుతోడ వెలికిన్ చ్చెన్ నిశాంతోల్ల స
న్మాహాత్మ్యంబునఁ దూర్పునం బొడుచు నా మార్తాండు చందంబునన్.

టీకా:
            ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
            అమరారాతుల = రాక్షసుల; బాణ = బాణముల; జాలములన్ = సమూహముల; పాలైపోయితే = గురియైతివా; చెల్లరే = అయ్యో; అమరాధీశ్వర = ఇంద్రా; అంచున్ = అనుచు; ఖిన్నతరులు = మిక్కలి దుఖితులు; ఐ = అయ్యి; అంభోధి = సముద్రము; లోన్ = మధ్యన; చంచలత్వమునన్ = తడబడబాటువలన; క్రుంకు = మునిగిపోయెడి; వణిక్ = వర్తక; జనంబుల = జనముల; క్రియన్ = వలె; దైత్య = రాక్షస; అధిప = రాజుల; వ్యూహము = సైనిక వ్యూహము; మధ్యమునన్ = నడుమనందు; చిక్కిరి = చిక్కుకొనిరి; వేల్పులు = దేవతలు; అందఱున్ = అందరును; విపద్ధ్వానంబులన్ = హాహాకారములను; చేయుచున్ = చేస్తూ.
            ఓహో = ఓ; దేవతలారా = దేవతలు; కుయ్యిడకుడు = భయపడకండి; ఏన్ = నేను; ఉన్నాడను = ఉన్నాను; అంచున్ = అనుచు; అంబుభృద్వాహుండు = ఇంద్రుడు, {అంబుభృద్వాహుడు – అంబుభృత్ (మేఘము) వాహుడు (వహించువాడు), ఇంద్రుడు}; ఆ = ఆ; శర = బాణములచే; బద్ద = కట్టబడిన; పంజరమున్ = పంజరమును; అంతన్ = అంతటిని; చించి = చీల్చివేసి; తేజంబునన్ = ప్రకాశముతో; వాహ = గుర్రముల; ఉపేత = సహితమైన; రథంబున్ = రథము; తోడన్ = తోపాటు; వెలికిన్ = బయటకు; వచ్చెన్ = వచ్చివేసెను; నిశాంత = ఉదయకాలమున; ఉల్లసత్ = ఉల్లాసముతోను; మహాత్మ్యంబునన్ = మహిమతోటి; తూర్పునన్ = తూర్పువైపున; పొడుచు = ఉదయించెడి; ఆ = ఆ; మార్తాండు = సూర్యుని; చందంబునన్ = వలె.

భావము:
          అలా ఇంద్రుడు బాణాలచే కప్పబడిన సమయంలో . . .
          దేవతందరూ అయ్యో! స్వర్గాధిపతీ! అసురుల బాణాలకు గురి అయిపోయావా!” అంటూ ఆర్తనాదాలు చేశారు. ఆ రాక్షసరాజుల యుద్ధవ్యూహం మధ్యలో చిక్కుకుపోయారు. సముద్రం మధ్యలో అల్లల్లాడిపోతూ మునిగిపోతున్న పడవలోని వర్తకుల వలె హాహాకారాలు చేసారు.
          ఇంతలో దేవేంద్రుడు ఓ దేవతలారా! భయపడకండి. నేను ఇక్కడే ఉన్నాను. అంటూ ఆ అమ్ముల పంజరాన్ని చీల్చుకుని గుర్రాలతో కూడిన రథం తోపాటు బయటికి వచ్చాడు. ఉల్లాసంతో మహిమతో ఉదయకాలంలో తూర్పున ఉదయించే సూర్యుడిలా ప్రకాశిస్తూ బయటకు వచ్చాడు.  

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :