Friday, March 4, 2016

నృసింహరూపావిర్భావము – అంత నద్దానవేంద్రుండు

7-290-వ.
అంత నద్దానవేంద్రుండు మహోద్దండంబగు గదాదండంబు గిరగిరం ద్రిప్పి నరమృగేంద్రుని వ్రేసిన; నతండు దర్పంబున సర్పంబు నొడిసిపట్టు సర్పపరిపంథి నేర్పున దితిపట్టిం బట్టికొనిన, మిట్టిపడి దట్టించి బిట్టు కట్టలుక న య్యసురవరుండు దృఢబలంబున నిట్టట్టు జడిసి పట్టు దప్పించుకొని, విడివడి దిటవు దప్పక కుప్పించి యుప్పరం బెగసి విహంగకులరాజ చరణ నిర్గళిత భుజంగంబు తెఱంగునం దలంగ నుఱికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుం; డయ్యెడి నని తలంచి, కలంగక చెలంగుచుఁ దన్ను నిబిడనీరద నికరంబుల మాటున నిలింపులు గుంపులు గొని డాఁగి మూఁగి క్రమ్మఱ నాత్మీయ జీవన శంకా కళంకితు లై మంతనంబులఁ జింతనంబులు చేయుచు నిరీక్షింప నక్షీణ సమరదక్షతా విశేషం బుపలక్షించి ఖడ్గ వర్మంబులు ధరియించి, భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘన లాఘవంబులం బరిభ్రమణ భేదంబులం గరాళవదనుం డయి, యంతరాళంబునఁ దిరుగు సాళువపు డేగ చందంబున సంచరించిన; సహింపక.
టీకా:
అంతన్ = అంతట; ఆ = ఆ; దానవ = దానవుల; ఇంద్రుడు = ప్రభువు; మహా = గొప్ప; ఉద్దండంబు = పెద్దదైనది; అగు = అయిన; గదాదండంబున్ = గదను; గిరగిరన్ = గిరగిరా; త్రిప్పి = తిప్పి; నరమృగేంద్రుని = నరసింహుని; వ్రేసినన్ = కొట్టగా; అతండు = అతడు; దర్పంబునన్ = గర్వముతో; సర్పంబున్ = పామును; ఒడిసి = ఒడుపుతో; పట్టు = పట్టుకొనెడి; సర్పపరిపంథి = గరుత్మంతుని {సర్పపరిపంథి - సర్ప (పాములకు) పరిపంథి (శత్రువు), గరుత్మంతుడు}; నేర్పునన్ = ప్రావీణ్యముతో; దితిపట్టిన్ = హిరణ్యకశిపుని; పట్టికొనినన్ = పట్టుకొనగా; మిట్టిపడి = ఎగిసిపడి; దట్టించి = అదలించి; బిట్టు = మించిన; కట్టలుకన్ = రోషాతిశయముచేత; ఆ = ఆ; అసుర = రాక్షస; వరుండు = శ్రేష్ఠుడు; దృఢ = గట్టి; బలంబునన్ = బలముతో; ఇట్టట్టు = ఇటు అటు; జడిసి = విదలించుకొని; పట్టు = పట్టునుండి; తప్పించుకొని = తప్పించుకొని; విడివడి = విడిపించుకొని; దిటవున్ = ధైర్యమును; తప్పక = వీడక; కుప్పించి = దుమికి; ఉప్పరంబు = పైకి; ఎగసి = ఎగిరి; విహంగకులరాజ = గరుత్మంతుని {విహంగకులరాజు - విహంగ (పక్షుల) కులమునకు రాజు, గరుత్మంతుడు}; చరణ = కాళ్ళనుండి; నిర్గళిత = తప్పించుకొన్న; భుజంగంబు = పాము; తెఱంగునన్ = వలె; తలంగన్ = తొలగి; ఉఱికి = పారి; తన = తన యొక్క; భుజ = బాహు; ఆటోపంబునన్ = బలముచేత; నరకంఠీరవుండు = నరసింహుడు; కుంఠితుండు = ఓడిపోయినవాడు; అయ్యెడిని = అగును; అని = అని; తలంచి = భావించి; కలంగక = బెదరక; చెలంగుచున్ = చెలరేగుచు; తన్నున్ = తనను; నిబిడ = దట్టములైన; నీరద = మేఘముల; నికరంబులు = సముదాయములు; మాటునన్ = చాటున; నిలింపులు = దేవతలు; గుంపులుకొని = గుంపులుగుంపులుగా; డాగి = దాక్కొనుచు; మూగి = పరచుకొని; క్రమ్మఱ = మరల; ఆత్మీయ = తమ యొక్క; జీవన = జీవితములమీద; శంక = అనుమానముచేత; కళంకితులు = కళంకితమైనవారు; = అయ్యి; మంతనంబునన్ = రహస్యముగా; చింతనంబులు = సంప్రదింపులు; చేయుచున్ = చేయుచు; నిరీక్షింపన్ = చూచుచుండగా; అక్షీణ = గొప్ప; సమర = యుద్ధ; దక్షతా = ప్రావీణ్యముయొక్క; విశేషంబున్ = అతిశయమును; ఉపలక్షించి = గుర్తుచేసుకొని; ఖడ్గ = కత్తి; వర్మంబులున్ = ఒరలు; ధరియించి = ధరించి; భూ = నేల; నభో = ఆకాశ; భాగంబులన్ = ప్రదేశములలో; వివిధ = పలురకముల; విచిత్ర = ఆశ్చర్యకరమైన; లంఘన = మల్లయుద్దదూకుటలందలి; లాఘవంబులన్ = నేర్పులతో; పరిభ్రమణ = తిరుగుటలోని; భేదంబులన్ = విశేషములతో; కరాళ = భయంకరమైన; వదనుండు = ముఖముగలవాడు; అయి = అయ్యి; అంతరాళంబునన్ = ఆకాశమున; తిరుగు = తిరిగెడి; సాళువపు = కణుజు; డేగ = డేగ; చందంబునన్ = వలె; సంచరించినన్ = తిరుగాడుచుండగా; సహింపక = ఒర్వక.
భావము:
దానవ వీరుడైన హిరణ్యకశిపుడు తన భయంకరమైన గదాదండాన్ని గిరగిరా త్రిప్పి నరసింహుని మీదకి విసిరాడు. ఆయన వెంటనే, గరుత్మంతుడు సర్పాన్ని ఒడిసి పట్టినట్లుగా రాక్షసరాజును పట్టుకున్నాడు. ఆ దానవుడు ఎగిరి పడి ఇటూనటూ గింజుకుని, రోషంతో, చాకచక్యంతో బలంపుంజుకుని, పట్టు తప్పించుకున్నాడు. అధైర్యం చెందకుండా గరుత్మంతుని పట్టు తప్పించుకున్న సర్పరాజు లాగా ఎగిరి ఎగిరి పడుతూ చిందులు త్రొక్కుతూ పోరాడసాగాడు. “తన భుజబలానికి ఈ నరసింహుడు లొంగిపోతాడులే” అనుకుంటూ, నదురు బెదురు లేకుండా రాక్షసేశ్వరుడు విజృంభిస్తున్నాడు. తన పరాక్రమాన్ని నైపుణ్యంగా ప్రదర్శిస్తున్నాడు. దేవతలు ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల చాటున నక్కి నక్కి చూస్తూ “మన జీవితాలకు ముప్పు తప్పేలా లేదు, వీడేమో లొంగేలా లేడు” అనే సందేహాలతో దిగులుపడసాగారు. అయినా రహస్యంగా ఆ రాక్షసుడినే చూస్తున్నారు. హిరణ్యకశిపుడు కవచధారి అయి యుద్ధ విద్య తంత్రాలు ప్రదర్శిస్తూ చిత్ర విచిత్ర గతులలో ఖడ్గచాలనం చేస్తూ భూమ్యాకాశా లంతటా తానే పరిభ్రమిస్తున్నాడు. మల్ల యుద్ధ విద్యా విన్యాసాలైన ఉరుకుట, తిరుగుట మున్నగునవి లాఘవంగా చూపుతున్నాడు. రకరకాల పరిభ్రమణాలు చేస్తూ, భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డేగలాగా ఎగిరి పడుతున్న రాక్షసుడి అహంకారాన్ని సహించక నరసింహ ప్రభువు ఆగ్రహించాడు.
७-२९०-व.
अंत नद्दानवेंद्रुंडु महोद्दंडंबगु गदादंडंबु गिरगिरं द्रिप्पि नरमृगेंद्रुनि व्रेसिन; नतंडु दर्पंबुन सर्पंबु नोडिसिपट्टु सर्पपरिपंथि नेर्पुन दितिपट्टिं बट्टिकोनिन, मिट्टिपडि दट्टिंचि बिट्टु कट्टलुक न य्यसुरवरुंडु दृढबलंबुन निट्टट्टु जडिसि पट्टु दप्पिंचुकोनि, विडिवडि दिटवु दप्पक कुप्पिंचि युप्परं बेगसि विहंगकुलराज चरण निर्गळित भुजंगंबु तेर्रंगुनं दलंग नुर्रिकि तन भुजाटोपंबुन नरकंठीरवुंडु कुंठितुं; डय्येडि ननि तलंचि, कलंगक चेलंगुचुँ दन्नु निबिडनीरद निकरंबुल माटुन निलिंपुलु गुंपुलु गोनि डाँगि मूँगि क्रम्मर्र नात्मीय जीवन शंका कळंकितु लै मंतनंबुलँ जिंतनंबुलु चयुचु निरीक्षिंप नक्षीण समरदक्षता विशषं बुपलक्षिंचि खड्ग वर्मंबुलु धरियिंचि, भूनभभागंबुल विविध विचित्र लंघन लाघवंबुलं बरिभ्रमण भदंबुलं गराळवदनुं डयि, यंतराळंबुनँ दिरुगु साळुवपु डेग चंदंबुन संचरिंचिन; सहिंपक.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: