Friday, March 11, 2016

నృసింహరూపావిర్భావము – ఇట్లు కేవల

7-299-వ.
ఇట్లు కేవల పురుషరూపంబును మృగరూపంబునుం గాని నరసింహరూపంబున, రేయునుం బవలునుం గాని సంధ్యాసమయంబున, నంతరంగంబును బహిరంగంబునుం గాని సభాద్వారంబున, గగనంబును భూమియునుం గాని యూరుమధ్యంబునఁ, బ్రాణసహితంబులును బ్రాణరహితంబులునుం గాని నఖంబులం, ద్రైలోక్యజన హృదయ భల్లుం డయిన దైత్యమల్లుని వధియించి, మహాదహన కీలాభీల దర్శనుండును, గరాళవదనుండును, లేలిహానభీషణ జిహ్వుండును, శోణిత పంకాంకిత కేసరుండును నై ప్రేవులు కంఠమాలికలుగ ధరించి కుంభికుంభ విదళనంబు చేసి చనుదెంచు పంచాననంబునుం బోలె, దనుజకుంజర హృదయకమల విదళనంబు చేసి, తదీయ రక్తసిక్తంబు లైన నఖంబులు సంధ్యారాగ రక్తచంద్రరేఖల చెలువు వహింప సహింపక, లేచి తన కట్టెదుర నాయుధంబు లెత్తుకొని తత్తఱంబున రణంబునకు నురవడించు రక్కసులం బెక్కుసహస్రంబులం జక్రాధిక నిర్వక్రసాధనంబుల నొక్కనిఁ జిక్కకుండం జక్కడిచె; ని వ్విధంబున.
టీకా:
ఇట్లు = ఈ విధముగ; కేవల = అచ్చమైన; పురుష = మానవ; రూపంబును = స్వరూపము; మృగ = సింహపు; రూపంబునున్ = స్వరూపము; కాని = కానట్టి; నరసింహ = నరసింహపు; రూపంబునన్ = స్వరూపముతో; రేయునున్ = రాత్రి; పవలునున్ = పగలు; కాని = కానట్టి; సంధ్యా = సంధ్య; సమయంబునన్ = సమయములో; అంతర్ = లోపలి; రంగంబునున్ = ప్రదేశము; బహిర్ = బయటి; రంగంబునున్ = ప్రదేశమును; కాని = కానట్టి; సభా = సభాభవనము యొక్క; ద్వారంబునన్ = ద్వారబంధముపైన; గగనంబునున్ = ఆకాశము; భూమియున్ = నేల; కాని = కానట్టి; ఊరు = తొడల; మధ్యంబునన్ = మధ్యభాగమునందు; ప్రాణ = ప్రాణము; సహితంబులునున్ = కలిగినవి; ప్రాణ = ప్రాణము; రహితంబులును = లేనివి; కాని = కానట్టి; నఖంబులన్ = గోరులతోటి; త్రైలోక్య = ముల్లోకములందలి; జన = ప్రజల; హృదయ = హృదయములను; భల్లుండు = బల్లెములవంటివాడు; అయిన = ఐన; దైత్య = దానవ; మల్లుని = శూరుని; వధియించి = సంహరించి; మహా = పెద్ద; దహన = మండుచున్న; కీలా = మంటలవలె; ఆభీల = భయంకరమైన; దర్శనుండును = కనబడెడివాడు; కరాళ = భయంకరమైన; వదనుండును = మోముగలవాడు; లేలిహాన = పామునాలికవంటి; భీషణ = భీకరమైన; జిహ్వుండును = నాలుకగలవాడు; శోణిత = రక్తపు; పంక = బురద; అంకిత = అంటుకొన్న; కేసరుండును = జూలుగలవాడు; ఐ = అయ్యి; ప్రేవులు = పేగులు; కంఠ = మెడలోని; మాలికలు = దండలు; కన్ = అగునట్లు; ధరించి = తాల్చి; కుంభి = ఏనుగు; కుంభ = కుంభస్థలమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; చనుదెంచు = వచ్చెడి; పంచాననంబునున్ = సింహమును; పోలెన్ = వలె; దనుజ = రాక్షసులలో; కుంజర = సింహమువంటివాని; హృదయ = హృదయముయనెడి; కమల = పద్మమును; విదళనంబు = చీల్చుట; చేసి = చేసి; తదీయ = అతని; రక్త = రక్తముచే; సిక్తంబులు = తడసినవి; ఐన = అయిన; నఖంబులున్ = గోళ్ళు; సంధ్యా = సంధ్యాకాలపు; రాగ = రంగుగల; రక్త = ఎర్రని; చంద్ర = చంద్ర; రేఖలన్ = కళల; చెలువున్ = అందమును; వహింపన్ = సంతరించుకొనగా; సహింపక = ఓర్వక; లేచి = పూని; తన = తనయొక్క; కట్టెదుర = కన్నుల ఎదురుగ; ఆయుధంబులన్ = ఆయుధములను; ఎత్తుకొని = ధరించి; తత్తఱంబునన్ = త్వరితముతో; రణంబున్ = యుద్ధమున; కున్ = కు; ఉరవడించు = ఉరుకుతున్న; రక్కసులన్ = రాక్షసులను; పెక్కు = అనెకమైన; సహస్రంబులన్ = వేలకొలది; చక్రాయుధ = చక్రాయుధములు; అధిక = మొదలగు; నిర్వక్ర = అకుంఠితములైన; సాధనంబులన్ = ఆయుధములతో; ఒక్కనిన్ = ఒకడినికూడ; చిక్కకుండగ = వదిలిపెట్టకుండా; చక్కడిచెన్ = సంహరించెను; ఈ = ఈ; విధంబునన్ = విధముగ.
భావము:
ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలకు భంగం కలుగకుండా; కేవలం నరరూపం కానీ, మృగరూపం కానీ కానటువంటి నరసింహ రూపంతో; రాత్రి గానీ, పగలు గానీ కానట్టి సంధ్యాసమయంలో; లోపల కానీ, వెలుపల కానీ కానటువంటి సభాభవనపు గడప మీద; ఆకాశం కానీ, భూమీ కానీ కానట్టి తన ఊరు ప్రదేశంలో (ఒళ్ళో); ప్రాణం ఉన్నవీ కానీ, ప్రాణం లేనివి కానీ కాని గోళ్ళతో సంహరించాడు. అలా ఉగ్రనరసింహస్వామి ముల్లోకాలకూ గుండెల్లో గాలంలా తయారైన ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడిని చంపాడు. అప్పుడు, ఆయన మిక్కిలి ఉగ్ర స్వరూపంతో దావానల జ్వాలలా దర్శనమిచ్చాడు. అతిభయంకరంగా ఉన్న ముఖంతో; నాగేంద్రుని నాలుక లాగ మాటిమాటికి బయటకు వచ్చి చలిస్తున్న భీకరమైన నాలుకతో; నెత్తురుతో తడసి ఎర్రబారిన మెడజూలుతో; భయంకరంగా ఆ దానవ రాజు ప్రేగులు కంఠమాలికలులా వేసుకున్న మెడతో ఆ ఉగ్ర నరసింహుడు దర్శనమిచ్చాడు. ఆ దేవుడు ఆ దానవుడి హృదయకమలం చీల్చి వేసి, మదగజేంద్రుడి కుంభస్థలం చీల్చి చెండాడిన సింహరాజులాగా విరాజిల్లుతున్నాడు; రక్తంలో తడసిన ఆయన గోర్లు సంధ్యారాగ రంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి; ఆ రూపం చూసిన రాక్షస వీరులు కోపాలు పట్టలేక వివిధ ఆయుధాలతో ఆ రాక్షసాంతకుని మీదకి దండెత్తి వచ్చారు; అలా వచ్చిన పెక్కువేల రక్కసులను వచ్చిన వారిని వచ్చినట్లే చక్రాది ఆయుధాలతో ఒక్కడిని కూడా వదలకుండా వధించాడు ఆ ఉగ్ర నరకేసరి.
७-२९९-व.
इट्लु केवल पुरुषरूपंबुनु मृगरूपंबुनुं गानि नरसिंहरूपंबुन, रेयुनुं बवलुनुं गानि संध्यासमयंबुन, नंतरंगंबुनु बहिरंगंबुनुं गानि सभाद्वारंबुन, गगनंबुनु भूमियुनुं गानि यूरुमध्यंबुनँ, ब्राणसहितंबुलुनु ब्राणरहितंबुलुनुं गानि नखंबुलं, द्रैलोक्यजन हृदय भल्लुं डयिन दैत्यमल्लुनि वधियिंचि, महादहन कीलाभील दर्शनुंडुनु, गराळवदनुंडुनु, लेलिहानभीषण जिह्वुंडुनु, शोणित पंकांकित केसरुंडुनु नै प्रेवुलु कंठमालिकलुग धरिंचि कुंभिकुंभ विदळनंबु चेसि चनुदेंचु पंचाननंबुनुं बोले, दनुजकुंजर हृदयकमल विदळनंबु चेसि, तदीय रक्तसिक्तंबु लैन नखंबुलु संध्याराग रक्तचंद्ररेखल चेलुवु वहिंप सहिंपक, लेचि तन कट्टेदुर नायुधंबु लेत्तुकोनि तत्तर्रंबुन रणंबुनकु नुरवडिंचु रक्कसुलं बेक्कुसहस्रंबुलं जक्राधिक निर्वक्रसाधनंबुल नोक्कनिँ जिक्ककुंडं जक्कडिचे; नि व्विधंबुन.

: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: