7-36-సీస పద్యము
గ్రామ పురక్షేత్ర ఖర్వటఖేట ఘో; షారామ నగరాశ్రమాదికములు
గాలిచి, కొలఁకులు గలఁచి, ప్రాకార గో; పుర సేతువులు త్రవ్వి, పుణ్య భూజ
చయములు ఖండించి, సౌధ ప్రపా గేహ; పర్ణశాలాదులు పాడుచేసి,
సాధు గో బ్రాహ్మణ సంఘంబులకు హింస; గావించి, వేదమార్గములు జెఱచి,
7-36.1-ఆటవెలది
కుతల మెల్ల నిట్లు
కోలాహలంబుగా; దైత్యు లాచరింపఁ దల్లడిల్లి
నష్టమూర్తు లగుచు
నాకలోకము మాని; యడవులందుఁ జొచ్చి
రమరవరులు.
హిరణ్యాక్షుని ఆజ్ఞతో రెచ్చిపోయిన
రాక్షసులు; గ్రామాలు,
పట్టణాలు, పుణ్యక్షేత్రాలు, పేటలు, పల్లెలు, గొల్లపల్లెలు, రాచనగరులు, నగరాలు,
ఆశ్రమాలు మొదలైనవాటిని ఆ రాక్షసులు ధ్వంసంచేశారు; చెరువులను
కలచివేసారు; ప్రహారీ గోడలు, గోపురాలు త్రవ్వేసారు; వంతెనలు, ఆనకట్టలు కూల్చేసారు; మంచి చెట్లను,
మహావృక్షాలను నరికేసారు; మేడలు, మిద్దెలు, చల్లని మంచినీళ్ళ
పందిళ్ళు, ఇళ్ళు, పాకలు మొదలైనవానిని పాడుచేశారు; సాదువులను,
గోవులను, బ్రాహ్మణులను హింసించారు; వేద సంప్రదాయాలను నాశనం
చేశారు; ఇలా ఆ రాక్షసులు భూలోకం అంతా అల్లకల్లోలం చేసారు; దేవతలు అందరూ భయపడిపోయి తేజస్సులు కోల్పోయి అడవులలోకి పారిపోయారు;
7-36-seesa padyamu
graama purakShEtra kharvaTakhETa ghO; Shaaraama
nagaraashramaadikamulu
gaalichi, kolaM~kulu galaM~chi, praakaara gO; pura
sEtuvulu travvi, puNya bhooja
chayamulu khaMDiMchi, saudha prapaa gEha;
parNashaalaadulu paaDuchEsi,
saadhu gO braahmaNa saMghaMbulaku hiMsa; gaaviMchi,
vEdamaargamulu jeRrachi,
7-36.1-aaTaveladi
kutala mella niTlu kOlaahalaMbugaa; daityu
laachariMpaM~ dallaDilli
naShTamoortu laguchu naakalOkamu maani;
yaDavulaMduM~ jochchi ramaravarulu.
గ్రామ = ఊళ్ళు; పుర = పట్టణములు; క్షేత్ర = పుణ్యక్షేత్రములు; ఖర్వట = పేటలు {ఖర్వట – ఒ కప్రక్క గ్రామము ఒక ప్రక్క పట్టణము కలిగినది, కొండను ఆనుకొనిన గ్రామము, పేట}; ఖేట = పాలెములు {ఖేట – పంటకాపులుండు పల్లె, పాలెము}; ఘోష = గొల్ల పల్లెలు; నగర = నగరములు; ఆశ్రమ = ఆశ్రమములు; ఆదికములు = మొదలగునవి; గాలిచి = వెదకి; కొలకులున్ = మడుగులను; కలచి = కలియబారజేసి; ప్రాకార = ప్రహారీగోడలు; గోపుర = బురుజులు; సేతువులు = ఆనకట్టలు, వంతెనలు; త్రవ్వి = తవ్వేసి; పుణ్య = పుణ్యవంతమైన; భూజ = చెట్ల {భూజము - భూమినుండి జము (పుట్టునది), వృక్షము}; చయములున్ = సమూహములను; ఖండించి = నరకి; సౌధ = మేడలు; ప్రపా = చలివేంద్రములు; గేహ = ఇండ్లు; పర్ణశాల = పాకలు; ఆదులున్ = మొదలగునవానిని; పాడుచేసి = పాడుచేసి; సాధు = సజ్జనుల; గో = గోవుల; బ్రాహ్మణ = బ్రాహ్మణుల; సంఘంబుల్ = సమూహముల; కున్ = కు; హింస = బాధించుట; కావించి = చేసి; వేద = వేదములందు విధింపబడిన; మార్గములున్ = విధానములను; చెఱచి = పాడుచేసి.
కుతలము = భూలోకము; ఎల్లన్ = అంతటిని; ఇట్లు = ఈ విధముగా; కోలాహలంబు = సంకులము; కాన్ = అగునట్లు; దైత్యులు = రాక్షసులు; ఆచరింపన్ = చేయగా; తల్లడిల్లి = బెగ్గడిల్లి; నష్ట = నాశనమైన; మూర్తులు = రూపములుగలవారు; అగుచున్ = అగుచు; నాకలోకము = స్వర్గలోకము; మాని = వదలి; అడవుల్ = అడవుల; అందున్ = లోనికి; చొచ్చిరి = దూరిరి; అమర = దేవతలలో; వరులు = శ్రేష్ఠులు.
: :చదువుకుందాం భాగవతం;
బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment