Monday, March 9, 2015

కృష్ణలీలలు

10.1-269-ఉత్పలమాల
క్కడఁ బెట్టితిం దనయుఁ డిక్కడ నాడుచు నుండె గాలి దా
నెక్కడినుండి వచ్చె శిశు వెక్కడి మార్గము పట్టిపోయె నే
నెక్కడఁ జొత్తు నంచుఁ గమలేక్షణ గ్రేపుఁ దొఱంగి ఖిన్నయై
పొక్కుచు వ్రాలు గోవు క్రియ భూస్థలి వ్రాలె దురంత చింతయై
         పిల్లాడ్ని ఇక్కడే ఇలా పడుకో బెట్టా. నా చిన్ని కన్నయ్య ఇక్కడే ఆడుతు ఉన్నాడు. ఇంతలో ఈ పాడు గాలి ఎక్కనుండి వచ్చిందో. నా పిల్లాడ్ని ఎక్కడకి ఎగరేసుకు పోతోందో. ఏమైపోతు ఉన్నాడో. అయ్యో నా కింకేం సాయం దొరుకుతుంది.అంటూ ఆ కలువ కన్నుల కాంతామణి యశోద, లేగదూడ దూరమైన దుఃఖంతో అరుస్తు కూలే పాడి ఆవులా, భరించరాని దుఃఖంతో నేలమీద కుప్పకూలి పోయింది.
10.1-269-utpalamaala
ikkaDaM~ beTTitiM danayuM~ DikkaDa naaDuchu nuMDe gaali daa
nekkaDinuMDi vachche shishu vekkaDi maargamu paTTipOye nE
nekkaDaM~ jottu naMchuM~ gamalEkShaNa grEpuM~ doRraMgi khinnayai
pokkuchu vraalu gOvu kriya bhoosthali vraale duraMta chiMtayai
          ఇక్కడన్ = ఈ ప్రదేశము నందే; పెట్టితిన్ = ఉంచితిని; తనయుడు = కొడుకు; ఇక్కడన్ = ఈ ప్రదేశము నందే; ఆడుచుండెన్ = ఆడుకొనుచుండెను; గాలి = సుడిగాలి; తాన్ = అది; ఎక్కడ = ఎక్కడ; నుండి = నుండి; వచ్చెన్ = వచ్చినది; శిశువున్ = పిల్లవాడు; ఎక్కడి = ; మార్గమున్ = దారి; పట్టి = అమ్మట; పోయెన్ = వెళ్ళిపోయెను; నేన్ = నేను; ఎక్కడన్ = ఎక్కడ; చొత్తును = శరణు పొందగలను; అని = అని; అంచున్ = అనుచు; కమలేక్షణ = సుందరి {కమలేక్షణ కమలముల వంటి కన్నులు గలామె, అందగత్తె, స్త్రీ}; క్రేపున్ = దూడను; తొఱంగి = ఎడబాసి; ఖిన్న = ఖేదము పొందినామె; = అయ్యి; పొక్కుచున్ = తపించుచు; వ్రాలు = నేలగూలెడి; గోవు = ఆవు; క్రియన్ = వలె; భూస్థలిన్ = నేలమీద; వ్రాలెన్ = పడెను; దురంత = అంతులేని; చింత = విచారము కలామె; = అయ్యి.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

No comments: