10.1-280-సీస పద్యము
జననాథ! యొకనాడు చన్ను చేఁపినఁ దల్లి;
చిన్నిముద్దులకృష్ణుఁ జేరఁ దిగిచి
యెత్తి పెందొడలపై నిడికొని ముద్దాడి;
చన్నిచ్చి నెమ్మోము చక్క నివిరి
యల్లని నగవుతో నావులించిన బాలు;
వదన గహ్వరమున వారినిధులు
దిశలు భూమియు వనద్వీపశైలంబులు;
నేఱులు గాలియు నినుడు శశియు
10.1-280.1-ఆటవెలది
దహనుఁ డాకసంబు దారలు గ్రహములు
నఖిలలోకములు చరాచరంబు
లైన భూతగణము లన్నియు నుండుటఁ
జూచి కన్నుమోడ్చి చోద్యపడియె.
ఓ మహా జనాధిప! పరీక్షిన్మహారాజా!
యశోదకు ఒకనాడు పాలిండ్లు చేపుకు వచ్చాయి. తన ముద్దుల కృష్ణుని ఎత్తుకొని, ఒడిలో
పడుకోబెట్టుకొని ముద్దాడింది. చిన్న కృష్ణునికి చక్కగా పాలు తాగించింది. ప్రేమగా
ముఖం నిమురసాగింది. ఆ అల్లరి పిల్లాడు తన మాయలమారి చిరునవ్వులు నవ్వుతు
నిద్రవస్తున్నట్లు ఆవులించాడు. అతని నోరు పెద్ద కొండగుహవలె యశోదకు కనబడింది. ఆ
లోతులలో సముద్రాలు, దిక్కులు, భూమి, అరణ్యాలు, ద్వీపాలు, పర్వతాలు, నదులు, గాలి,
సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఆకాశము, తారలు, గ్రహాలు, సర్వలోకాలు చరచారాలైన అన్ని
జీవరాశుల తోసహా కనబడ్డాయి. ఆమె కన్నులు అరమోడ్పులు అయ్యాయి. ఆమె నివ్వెరపోయింది.
వదన గహ్వరము అంటే వాక్ స్థానమైనది. మరి ఈ
చరాచరజగత్తు సమస్తం వాగధిష్టానం. . అంటే శబ్దనిష్టం కదా. “సర్వంశబ్దనిష్టంజగత్” అని ప్రమాణం. అంటే శబ్దం లేకపోతే ఏమి లేదని. ఆహా
ఏమి చోద్యం. చూపుతున్నవాడు సాక్షాత్తు పరబ్రహ్మ. చూపుతున్నది తల్లి జీవజాలం సమస్తం
అనుకోవచ్చా. జననాథుడు అంటే జీవజాలంలో జ్ఞానం గల మానవు లందరికి నాథుడు.
జననాథ = రాజా {జననాథుడు - జనులకు పతి, రాజు}; ఒక = ఒకానొక; నాడు = దినమున; చన్నున్ = స్తనమునందు; చేపిన = పాలు ఉబ్బగా; తల్లి = తల్లి; చిన్ని = చిన్నవాడైన; ముద్దుల = గారాల; కృష్ణున్ = కృష్ణుని; చేరన్ = దగ్గరకురమ్మని; తిగిచి = తీసుకొని; ఎత్తి = ఎత్తుకొని; పెందొడల = పెద్దవైనతొడల; పైన్ = మీద; ఇడికొని = పెట్టికొని; ముద్దాడి = ముద్దులుపెట్టుకొని; చన్నున్ = చనుబాలు; ఇచ్చి = తాగించి; నెఱ = విశాలమైన; మోమున్ = ముఖమును; చక్కన్ = చక్కగా; నివిరి = నిమిరి; అల్లని = మెల్లని; నగవు = నవ్వు; తోన్ = తోపాటు; ఆవులించిన = ఆవులింతలిడగా; బాలు = పిల్లవాని; వదనగహ్వరమున = నోటియందు; వారినిధులున్ = సముద్రములు; దిశలున్ = దిక్కులు; భూమియున్ = భూమండలము; వన = అడవులు; ద్వీప = ద్వీపములు; శైలంబులున్ = పర్వతములు; ఏఱులున్ = నదులు; గాలియున్ = వాయువు; ఇనుడు = సూర్యుడు; శశియున్ = చంద్రుడు.
దహనుడు = అగ్ని; ఆకసంబున్ = ఆకాశము; తారలున్ = నక్షత్రములు; గ్రహములున్ = గ్రహములు; అఖిల = సమస్తమైన; లోకములున్ = లోకములు; చర = చరించగలిగినవి; అచర = చరించలేనివి; ఐన = అయినట్టి; భూతగణములు = జీవజాలములు; అన్నియును = సమస్తము; ఉండుటన్ = ఉండుటను; చూచి = చూసి; కన్ను = కళ్ళు; మోడ్చి = మూసికొని; చోద్యపడియె = ఆశ్చర్యపోయెను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=36&Padyam=280.0
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం :
:
No comments:
Post a Comment