Sunday, March 1, 2015

కృష్ణలీలలు

10.1-260-వచనము
అంత నబ్బాలునిమేన బాలగ్రహంబు సోఁకునుగదా యని శంకించి, గోపకు లనేకు లనేక బలి విధానంబులు చేసిరి; బ్రాహ్మణులు దధికుశాక్షతంబుల హోమంబు లాచరించిరి; ఋగ్యజు స్సామ మంత్రంబుల నభిషేచనంబులు చేయించి స్వస్థిపుణ్యాహ వచనంబులు చదివించి కొడుకున కభ్యుదయార్థంబు నందుం డలంకరించిన పాఁడిమొదవుల విద్వజ్జనంబుల కిచ్చి వారల యాశీర్వాదంబులు గైకొని ప్రమోదించెనని చెప్పి శుకుం డిట్లనియె.
       బాల కృష్ణుడు శకటాసుర సంహారం చేసిన తరువాత, అనేకమంది గోపకులు పిల్లాడికి బాలగ్రహం సోకిందేమో అని అనేక రకాల శాంతులు బలులుచేసారు. బ్రాహ్మణులు పెరుగు, దర్భలు, అక్షంతలు దిష్టి తీసి హోమంలో వేసారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు పలికారు. పుణ్యాహవచనాలు చదివారు. నందుడు కుమారుని అభ్యుదయం కోసం అలంకరించిన పాడి ఆవులను పండితులకు దానం చేసాడు. వారి ఆశీర్వాదలు విని ఆనందించాడు. అంటు శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పసాగాడు.
10.1-260-vachanamu
aMta nabbaalunimEna baalagrahaMbu sOM~kunugadaa yani shaMkiMchi, gOpaku lanEku lanEka bali vidhaanaMbulu chEsiri; braahmaNulu dadhikushaakShataMbula hOmaMbu laachariMchiri; Rigyaju ssaama maMtraMbula nabhiShEchanaMbulu chEyiMchi svasthipuNyaaha vachanaMbulu chadiviMchi koDukuna kabhyudayaarthaMbu naMduM DalaMkariMchina paaM~Dimodavula vidvajjanaMbula kichchi vaarala yaasheervaadaMbulu gaikoni pramOdiMche” nani cheppi shukuM DiTlaniye.
          అంతన్ = అప్పుడు; = ; బాలుని = పిల్లవాని; మేనన్ = దేహమునందు; బాలగ్రహంబు = పిల్లలపిశాచము; సోకునుకదా = పట్టవచ్చును; అని = అని; శంకించి = సందేహించి; గోపకులు = గొల్లలు; అనేకులు = చాలామంది; అనేక = బహువిధముల; బలి = బలులిచ్చెడి; విధానంబులు = కార్యక్రమములు; చేసిరి = చేసితిరి; బ్రాహ్మణులు = విప్రులు; దధి = పెరుగు; కుశ = దర్భలు; అక్షతంబుల = అక్షతలు {అక్షతలు - క్షతము (బాధ) లేనివి}; హోమంబులు = హోమములను; ఆచరించిరి = చేసిరి; ఋగ్యజుస్సామ = వేదత్రయమునకుచెందిన; మంత్రంబులన్ = మంత్రములతో; అభిషేచనంబు = అభిషేకములు; చేయించి = చేయించి; స్వస్థిపుణ్యాహ = శుభప్రధమైన; వచనంబులు = మంత్రములను; చదివించి = పఠింపజేసి; కొడుకున్ = పుత్రున; కున్ = కు; అభ్యుదయ = మేలుకలుగుట; అర్థంబున్ = కోసము; నందుండు = నందుడు; అలంకరించిన = ఆభరణాదులిడిన; పాడి = పాలిచ్చెడి; మొదవులన్ = పశువులను; విద్వత్ = విద్వాంసులైన; జనంబుల్ = వారి; కిన్ = కి; ఇచ్చి = దానములు చేసి; వారల = వారి యొక్క; ఆశీర్వాదంబులున్ = దీవెనలను; కైకొని = స్వీకరించి; ప్రమోదించెను = ఆనందించెను; అని = అని; చెప్పి = తెలిపి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం  : :

No comments: