8-305-సీ.
అవుఁగదే లావణ్య; మవుఁగదే మాధుర్య;
మవుఁగదే సతి! నవయౌవనాంగి!
యెటనుండి వచ్చితి? వేమి యిచ్ఛించెదు? ;
నీ నామమెయ్యది? నీరజాక్షి!
యమర గంధర్వ సిద్ధాసుర చారణ;
మనుజకన్యలకు నీ మహిమ గలదె?
ప్రాణ చిత్తేంద్రియ పరిణామ దాయియై;
నిర్మించెఁ బో విధి నిన్ను గరుణ;
8-305.1-తే.
వనిత! గశ్యపు సంతతి వార మేము
భ్రాతలము సురలకు నిద్ధపౌరుషులము
జ్ఞాతులకు మాకు నేకార్థసంగతులకుఁ
బాలు దీరని యర్థంబు బంచి యిమ్ము.
టీకా:
అవుగదే = చాలాబాగుంది; లావణ్యము = చక్కటిముఖకాంతి; అవుగదే = చాలాబాగుంది; మాధుర్యము = సౌందర్యము; అవుగదే = చాలాబాగుంది; సతి = స్త్రీ; నవయౌవనాంగి = సుందరీ; ఎట = ఎక్కడ; నుండి = నుంచి; వచ్చితివి = విచ్చేసినావు; ఏమి = దేనిని; ఇచ్చించెదు = ఇష్టపడెదవు; నీ = నీ యొక్క; నామము = పేరు; ఎయ్యది = ఏది; నీరజాక్షి = అందగత్తె; అమర = దేవతా; గంధర్వ = గంధర్వ; సిద్ధ = సిద్ధుల; అసుర = రాక్షస; చారణ = చారణుల; మనుజ = మానవ; కన్యల్ = స్త్రీల; కున్ = కు; నీ = నీ యొక్క; మహిమ = గొప్పదనము; కలదె = ఉన్నదా, లేదు; ప్రాణ = ప్రాణములకు; చిత్త = మనసునకు; ఇంద్రియ = ఇంద్రియములకు; పరిణామ = నిండుదనమును; దాయి = ఇచ్చువాడు; ఐ = అయ్యి; నిర్మించెన్ = సృష్టించెను; పో = కాబోలు; విధి = బ్రహ్మదేవుడు; నిన్ను = నిన్ను; కరుణన్ = కృపకలిగి.
వనిత = స్త్రీ; కశ్యపు = కశ్యపుని యొక్క; సంతతివారము = పిల్లలము; మేము = మేము; భ్రాతలము = సోదరులము; సురల్ = దేవతల; కున్ = కు; ఇద్ద = ప్రసిద్ధమైన; పౌరుషులము = పౌరుషముగలవారము; జ్ఞాతల్ = సహోదరులపిల్లల; కున్ = కు; మా = మా; కున్ = కు; పాలు = పంపకములు; తీరని = కుదరకున్నట్టి; అర్థంబున్ = ఈ పదార్థమును; పంచి = పంచి; ఇమ్ము = పెట్టుము.
భావము:
“ఓ కమలాల వంటి కన్నులున్న కోమలాంగీ! చక్కదనాల జవరాలా! ఓ వన్నెలాడీ! ఏమి లావణ్యం! ఏమి మాధుర్యం! ఎక్కడి నుండి వచ్చావు? ఏమి కావాలి? నీ పేరేమిటి? గంధర్వ, సిద్ధ, దేవత, రాక్షస, చారణ, మానవ కన్యలలో ఎవరి యందూ నీ అంత అందచందాలు లేవు. నీ మిక్కిలి ప్రియమైన మనసుకీ, అవయవాలకూ నిండుదనం సమకూర్చిన బ్రహ్మదేవుడు నిన్ను ప్రీతితో సృష్టించాడు కాబోలు! మేము కశ్యపుని సంతతి వారము, దేవతలకు సోదరులము. ఎదురులేని పౌరుషం కలవారము. ఒకే ప్రయోజనాన్ని ఆశించి శ్రమించి సంపాదించిన ఈ పదార్థాన్ని పంచుకోడంలో జ్ఞాతులమైన మాలో మాకు పంపకాలు కుదరటం లేదు. నువ్వు పంచు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment