8-282-సీ.
అమర ముత్తైదువనై యుండ వచ్చును;
వరుసకు సవతు లెవ్వరును లేరు
వెలయంగ నశ్రాంత విభవ మీతని యిల్లు;
శృంగార చందన శీతలుండు
గలఁగఁ డెన్నఁడు శుద్ధకారుణ్యమయమూర్తి;
విమలుండు గదిసి సేవింప వచ్చు
నెఱి నాడి తిరుగఁడు నిలుకడఁ గలవాఁడు;
సకల కార్యములందు జడత లేదు;
8-282.1-ఆ.
సాధురక్షకుండు షడ్వర్గ రహితుండు
నాథుఁ డయ్యె నేని నడప నోపు
నితఁడె భర్త యనుచు నింతి సరోజాక్షుఁ
బుష్ప దామకమునఁ బూజచేసె.
టీకా:
అమరన్ = చక్కగా;
ముత్తైదువన్ = సౌభాగ్యవతిగా;
ఐ = ఉండి; ఉండవచ్చున్ = ఉండవీలగును;
వరుస =
బాంధవ్యవరుస;
కున్ = కు; సవతులు = సపత్నులు;
ఎవ్వరున్ = ఎవరుకూడా;
లేరు = లేరు;
వెలయంగన్ = ప్రసిద్ధముగ;
అశ్రాంత = ఎడతెగని;
విభవము = వైభవములుగలది;
ఈతని = ఇతని
యొక్క; ఇల్లు = నివాసము;
శృంగార = సౌందర్యవంతమైన;
చందన = మంచిగంధమువలె;
శీతలుండు = చల్లనివాడు;
కలగడు = కలతచెందడు;
ఎన్నడున్ = ఎప్పుడును;
శుద్ధ = నిర్మలమైన;
కారుణ్య = దయ;
మయ = కలిగిన;
మూర్తి = స్వరూపుడు;
విమలుండు = స్వచ్ఛమైనవాడు;
కదిసి = చేరి;
సేవింప = కొలచుటకు;
వచ్చున్ = వీలగును;
నెఱిన్ = నిండుగా;
ఆడి =
పలికినమాట; తిరుగడు = తప్పడు;
నిలుకడ = స్థిరత్వము;
కల = కలగిన;
వాడు = వాడు;
సకల = సమస్తమైన;
కార్యములు = కార్యక్రమముల;
అందున్ = ఎడల;
జడత = అలసత్వము;
లేదు = లేదు.
సాధు = సజ్జనులను;
రక్షకుండు = రక్షించెడివాడు;
షడ్వర్గ = కామాది;
రహితుండు = లేనివాడు;
నాథుడు =
పతి; అయ్యెనేని = అయినచో;
నడపన్ = చక్కగావర్తించ;
ఓపున్ = వీలగును;
ఇతడె =
ఇతడుమాత్రమే;
భర్త = (నా) పతి;
అనుచున్ = అనుచు;
ఇంతి = స్త్రీ;
సరోజాక్షున్ =
విష్ణుమూర్తిని;
పుష్ప = పూల;
దామకమునన్ = మాలతో;
పూజ = సత్కరించుట;
చేసెన్ =
చేసెను.
భావము:
విష్ణుమూర్తిని
నచ్చుకుంటూ ఇలా అనుకుంది. “విష్ణువు (శాశ్వతుడు కనుక) దగ్గర అయితే (నిత్య)
సౌభాగ్యవతిగా ఉండవచ్చు, వంతుకు వచ్చే సవతులు లేరు, ఇతని ఇల్లు ఎడతెగని
సంపదలకు నిలయం. ఇతడు అందగాడు, చందనం వలె చల్లని వాడు. ఎప్పుడూ కలత చెదడు.
దయామయుడు, నిర్మలమైన వాడు. ఇతనిని చేరి సేవించవచ్చు. ఆడినమాట తప్పడు. స్థిరత్వం
కలవాడు, ఏ పనిలోనూ ఆలస్యం లేని వాడు. సజ్జనులను కాపాడే వాడు, కారం క్రోధం మొదలైన
చెడ్డగుణాలు లేని వాడు”. “ఇతడు నాకు తగిన భర్త” అని నిశ్చయించుకుంది. పద్మాలవంటి
కన్నులు గల విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసి వరించింది.
:
:చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment