Thursday, August 18, 2016

క్షీరసాగరమథనం – ఇట్లు శరణాగతులైన

8-298-వ.
ఇట్లు శరణాగతులైన వేల్పుల దైన్యంబు పొడగని భృత్యుజన కామదుండగు నప్పరమేశ్వరుండు "మీరలు దుఃఖింప వలవ దేను నా మాయాబలంబునంజేసి మీ యర్థంబు మరల సాధించెద" నని పలికె; దత్సమయంబున న య్యమృతపూరంబు నేమ త్రావుదు మని తమకించు దైత్యదానవ జనంబుల లోపల నమంగళంబగు కలి సంభవించిన కతంబునఁ బ్రబలులగు రక్కసులు విలోకించి సత్త్రయాగంబు నందు నడచు చందంబునఁ దుల్యప్రయాస హేతువులగు సురలును సుధా భాగంబున కర్హు లగుదురు గావునఁ బంచి కుడుచుట కర్తవ్యం; బిది సనాతనంబగు ధర్మంబగుటంజేసి య య్యమృత కుంభంబు విడువుండని దుర్భలులగు నిశాచరులు జాతమత్సరులై ప్రబలు లైన తమవారల వారించుచున్న సమయంబున.

టీకా:
            ఇట్లు = ఈ విధముగ; శరణాగతులు = శరణవేడినవారు; ఐన = అయిన; వేల్పుల = దేవతల యొక్క; దైన్యంబు = దీనత్వమును; పొడగని = పరికించి; భృత్య = భక్తులైన; జన = వారి; కామదుండు = కోరికలనిచ్చువాడు; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = విష్ణుమూర్తి; మీరలు = మీరు; దుఃఖింపన్ = బాధపడ; వలదు = వద్దు; ఏను = నేను; నా = నా యొక్క; మాయా = మాయ యొక్క; బలంబునన్ = శక్తి; చేసి = వలన; మీ = మీ యొక్క; అర్ధంబున్ = కోరికను; మరల = తిరిగి; సాధించెదన్ = సంపాదించెదను; అని = అని; పలికెన్ = చెప్పెను; తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు; ఆ = ఆ; అమృత = అమృత; పూరంబున్ = రసమును; నేమ = మేమే; త్రావుదుము = తాగెదము; అని = అని; తమకించు = త్వరపడెడి; దైత్య = దైత్యుల; దానవ = దానవుల; జనంబు = సమూహముల; లోపల = అందు; అమంగళంబు = అశుభకరము; అగు = అయిన; కలి = కలి; సంభవించినన్ = కలిగిన; కతంబునన్ = కారణముచేత; ప్రబలులు = మిక్కిలిబలశాలులు; అగు = అయిన; రక్కసులు = రాక్షసులు; విలోకించి = చూసి; సత్రయాగంబు = పెద్దయజ్ఞము; అందున్ = లో; నడచు = అనుసరించెడి; చందంబునన్ = విధముగనే; తుల్య = సమముగా; ప్రయాస = శ్రమపడుటకు; హేతువులు = కారణులు; అగు = అయిన; సురలును = దేవతలుకూడ; సుధా = అమృతపు; భాగంబున్ = వాటాకు; అర్హులు = తగినవారు; అగుదురు = అవుతారు; కావునన్ = కనుక; పంచి = పంచుకొని; కుడుచుట = తినుట, తాగుట; కర్తవ్యంబు = తగినపని; ఇది = ఇది; సనాతనంబు = పురాతమైనది; అగు = అగు; ధర్మంబు = ఆచారము; అగుటన్ = అగుట; చేసి = వలన; ఆ = ఆ; అమృత = అమృతపు; కుంభంబున్ = పాత్రను; విడువుడు = విడిచిపెట్టండి; అని = అని; దుర్బలులు = బలహీనులు; అగు = అయిన; నిశాచరులు = రాక్షసులు; జాత = కలిగిన; మత్సరులు = మాత్సర్యముగలవారు; ఐ = అయ్యి; ప్రబలులు = అతిశయించినవారు; ఐన = అయిన; తమ = వారి; వారలన్ = వారిని; వారించుచున్న = అడ్డుకుంటున్న; సమయంబునన్ = సమయమునందు.

భావము:
            భక్తుల కోరికలను తీర్చు పరమేశ్వరుడు అయిన విష్ణుమూర్తి, దేవతలు పెట్టే మొరలు ఆలకించి, ఇలా అన్నాడు “మీరేం బాధ పడనక్కర లేదు. మీకోరిక నెరవేరేలా నా మాయాబలంతో పరిస్థితులను మరల్చుతాను.” ఆ సమయంలో రాక్షసులు ఆ అమృతాన్ని తామే త్రాగేద్దాం అని అనుకున్నారు. కానీ, రాక్షసులలో కలి పురుషుని మాయ ఆవహించి, అమంగళకరమైన కలహం బయలుదేరింది. బలహీనులైన వారు కొందరు సత్రయాగం వంటి గొప్ప యాగాలలో ఎలా అయితే పడిన శ్రమకు తగినంత భాగాలు వేసుకుని పంచుకోవటం న్యాయం. ఇది తరతరాలుగా పూర్వంనుంచీ వస్తున్న ధర్మం. కాబట్టి అమృతకలశాన్ని వదిలిపెట్టండి అని చెప్తూ, జాతి మాత్సర్యంతో రెచ్చిపోతున్న రాక్షసులను అడ్డుకున్నారు. ఆ సమయంలో.      


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: