Friday, August 12, 2016

క్షీరసాగరమథనం – అటమున్న యబ్దిరాజు

8-287-వ.
అటమున్న యబ్దిరాజు దనయందు నున్న యమూల్యంబైన కౌస్తుభంబు పేరిటి యనర్ఘ మణిరాజంబు నయ్యంబుజాక్షునకు సమర్పించిన దానిం దన వక్షస్థలంబున ధరియించె; నప్పు డయ్యాదిలక్ష్మియు శ్రీవత్స కౌస్తుభ వైజయంతీవనమాలికా తారహారాద్యలంకృతంబైన పుండరీకాక్షు వక్షంస్థలంబున వసియించె నయ్యవసరంబున.

టీకా:
            అట = అంతకు; మున్న = ముందు; అబ్దిరాజు = సముద్రుడు; తన = తన; అందున్ = లో; ఉన్న = ఉన్నట్టి; అమూల్యంబు = వెలలేనిది; ఐన = అయిన; కౌస్తుభంబున్ = కౌస్తుభము; పేరిటి = అనెడి పేరుగల; అనర్ఘ = అమూల్యమైన; మణి = రత్నములలో; రాజంబున్ = శ్రేష్ఠమైనదానిని; ఆ = ; అంబుజాక్షున్ = విష్ణుని; కున్ = కి; సమర్పించినన్ = కానుకా ఇవ్వగా; దానిన్ = దానిని; తన = తన; వక్షస్థలంబునన్ = గుండెలపైన; ధరియించెన్ = ధరించెను; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; ఆదిలక్ష్మియున్ = లక్ష్మీదేవి కూడ; శ్రీవత్స = శ్రీవత్స; కౌస్తుభ = కౌస్తుభ; వైజయంతీ = వైజయంతి యనెడి; వనమాలిక = మాల; తారాహార = ముత్యాలహారము; ఆది = మొదలైనవానిచే; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయిన; పుండరీకాక్షు = విష్ణుని; వక్షస్థలంబునన్ = ఎదపైన; వసియించెన్ = ఉండెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో.

భావము:
          ఇలా లక్ష్మీదేవి వరించి విష్ణువును చేరబోతున్న సమయంలో, కడలిరాజు అయిన సాగరుడు, అల్లుడైన విష్ణుమూర్తికి తనలో ఉన్నట్టి కౌస్తుభం అనే అమూల్యమైన రత్నాన్ని కానుకగా ఇచ్చాడు. దానిని తన వక్షస్థలం మీద విష్ణువు ధరించాడు. అప్పుడు ఆ ఆదిలక్ష్మి శ్రీవత్సమూ, కౌస్తుభమూ, వైజయంతిమాలా, ముత్యాలహారమూ మొదలైన విభూషణాలతో భూషితమైన ఆ పద్మనయనుడైన శ్రీ మహావిష్ణువు ఎదపై నివసించింది. అప్పుడు. . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: