8-306-క.
సభ యై యుండెద మిందఱ
మభయంబున వచ్చు కొలఁది నమృతంబును నీ
విభరాజగమన! తప్పక
విభజింపు విపక్షపక్ష విరహితమతి వై.
8-307-వ.
అని మందలించిన దైత్యులం గని మాయాయువతి రూపుం డగు హరి తన వాఁడి వాలు
జూపుటంపఱలవలన వారల తాలుముల నగలించి చిఱునగవు లెగయ
మొగమెత్తి యిట్లనియె.
టీకా:
సభ = కొలువుతీరినవారము;
ఐ =
అయ్యి; ఉండెదము = ఉంటాము;
ఇందఱము = మేమందరము;
అభయంబునన్ = భయములేకుండగ;
వచ్చుకొలది = వంతువచ్చునంత;
అమృతంబున్ = అమృతమును;
నీవు = నీవు;
ఇభరాజగమన =
సుందరి; తప్పక = తప్పకుండ;
విభజింపు = పంచిపెట్టుము;
విపక్షవిపక్షరహిత =
పక్షపాతరహితమైన;
మతివి = బుద్ధిగలవాడవు;
ఐ = అయ్యి.
అని
= అని; మదలించిన
= చెప్పినట్టి;
దైత్యులన్ = రాక్షసులను;
కని = చూసి;
మాయా = కపట;
యువతి = స్త్రీ;
రూపుండు = రూపముననున్నవాడు;
అగు = అయిన;
హరి = విష్ణుమూర్తి;
తన = తన యొక్క;
వాడి = వాడియైన;
వాలుచూపుల = వాలుచూపులనెడి;
అంపఱల = తూపుల,
బాణముల; వలన = చేత; వారల = వారి యొక్క;
తాలుములన్ = ఓర్పులను;
అగలించి = పోగొట్టి;
చిఱునగవులు =
చిరునవ్వులు;
ఎగయన్ = చిలుకగా;
మొగము = ముఖమును;
ఎత్తి = పైకెత్తి;
ఇట్లు = ఈ
విధముగా; అనియె = పలికెను.
భావము:
గజరాజువంటి
చక్కటి నడక గల సుందరీ! మేము ఉభయులమూ బారులు తీరి వరుసగా
కూర్చుంటాము. పరాయి వారూ, తన వారూ అనే భేద భావం చూపకుండా మా ఉభయులకూ సరిగా ఈ అమృతాన్ని నువ్వు పంచిపెట్టు.”
ఈ విధంగా అమృతం పంచమని హెచ్చరిస్తున్న రాక్షసులను చూసి, మాయా మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన అందమైన వాలుచూపుల తూపులతో వారి ఓరిమిలను బద్దలు చేసి, చిరునవ్వులు చిందిస్తూ ఇలా అన్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment