8-308-క.
సుందరులగు పురుషులఁగని
పొందెడు నాయందు నిజము పుట్టునె మీకున్?
బృందారకరిపులారా!
చెందరు కామినుల విశ్వసింపరు పెద్దల్.
8-309-క.
పలుకులు మధురసధారలు
దలఁపులు నానా ప్రకార దావానలముల్
చెలుములు సాలావృకములు
చెలువల నమ్ముటలు వేదసిద్ధాంతములే?
టీకా:
సుందరులు = అందమైనవారు;
అగు =
అయిన; పురుషులన్ = మగవారిని;
కని = కనుగొని;
పొందెడు = పొందునట్టి;
నా = నా; అందున్ = ఎడల;
నిజము = సత్యము;
పుట్టునె = కలుగుతుందా;
మీకున్ = మీకు;
బృందారకరిపులారా = రాక్షసులు;
చెందరు = దరిచేరరు;
కామినులన్ = స్త్రీలను;
విశ్వసింపరు = నమ్మరు;
పెద్దల్ = పెద్దలు.
పలుకులు
= మాటలు; మధు =
తేనెల వంటి;
రస = రుచులు;
ధారలు = కారునవి;
తలపులు = ఆలోచనలు;
నానా = అనేక;
ప్రకార =
విధములైన; దావానలముల్ = కార్చిచ్చులు;
చెలుములు = స్నేహములు;
సాలావృకములు =
నక్కలు; చెలువలన్ = అందగత్తెలను;
నమ్ముటలు = విశ్వసించుట;
వేదసిద్ధాంతములే = ప్రమాణికములా,
కాదు.
భావము:
“ఓ అసురులారా! నేను అందమైన మగవారిని చూసుకుని పొందగోరే దానను. మీకు నా మీద నమ్మకం కుదురుతోందా? పెద్దలు అందగత్తెలను నమ్మి దరిచేరరు కదా!
అందగత్తెల
మాటలు తియ్యనైన తేనెలు జాలువారుతూ ఉంటాయి. వారి ఆలోచనలు
అనేక విధాలైన కార్చిచ్చులు, వారి స్నేహాలు తోడేళ్ళవంటివి. అటువంటివారిని విశ్వశించడాలు అంగీకారమైనవి కావు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment