Monday, August 22, 2016

క్షీరసాగరమథనం – ఇవ్విధంబున న క్కపట

8-304-వ.
ఇవ్విధంబున న క్కపట యువతీరత్నంబు జగన్మోహన దేవతయునుంబోలె నెమ్మొగంబు తావికి మత్తిల్లిన తేఁటి మొత్తంబులన్ గెలిచి చిగురు జొంపంబుల నెడగలుగ జడియుచు ముఱియుచుండ రాక్షసవరులు గనుంగొని.

టీకా:
            ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ఆ = ఆ; కపట = మాయా; యువతీరత్నము = శ్రేష్ఠమైనస్త్రీ; జగన్మోహన = జగన్మోహినీ; దేవతయునున్ = దేవి; పోలెన్ = వలె; నెఱ = నిండు; మొగంబున్ = ముఖము; తావి = సుగంధమున; కిన్ = కు; మత్తిల్లిన = మత్తెక్కినట్టి; తేటి = తుమ్మెదల; మొత్తంబులన్ = గుంపులను; గెలిచి = అదలించి; చిగురు = చిగురుటాకుల; జొంపంబులన్ = పొదరిండ్ల; ఎడగలుగన్ = దూరుటకు; జడియుచున్ = బెదురుతూ; ముఱియుచుండన్ = మురిసిపోతుండగా; రాక్షస = రాక్షస; వరులు = ఉత్తములు; కనుంగొని = చూసి.

భావము:
            ఇలా ఆ మాయలమారి జవరాలు, జగత్తుని మోహింపజేసే దేవతలాగ ఒప్పి ఉండి, తన అందమైన ముఖ సుగంధానికి ఆకర్షితమై ముసురుతున్న తుమ్మెదలను అదలిస్తూ, మురిసిపోతూ, చిగురాకుల పొదల వెంట సంచరిస్తున్న ఆమెను అసుర వీరులు చూసి, మోహంలో పడిపోయి, ఆమెతో ఇలా అనసాగారు. . . . . .


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: