Thursday, August 4, 2016

క్షీరసాగరమథనం – పలుకుల నమృతంబు

8-273-సీ.
పలుకుల నమృతంబు చిలుక నెవ్వానితో
భాషించె వాఁడెపో బ్రహ్మ యనఁగ
నెలయించి కెంగేల నెవ్వని వరియించె
వాఁడె లోకములకు ల్లభుండు
మెయిదీఁగ నెవ్వని మేనితోఁ గదియించె
వాఁడెపో పరమ సర్వజ్ఞమూర్తి
నెలతుక యెప్పుడు నివసించు నేయింట
నాయిల్లు పరమగు మృత పదము
8-273.1-ఆ.
నింతి చూపు వాఱె నెచ్చోటి కచ్చోటు
జిష్ణుధనద ధర్మ జీవితంబు
గొమ్మ చిన్న నగవు గురుతర దుఃఖ ని
వారణంబు సృష్టి కారణంబు.
8-274-వ.
మఱియు నక్కొమ్మ నెమ్మనంబున.

టీకా:
            పలుకులన్ = పలకరింపులలో; అమృతంబున్ = అమృతము; చిలుకన్ = చిలకరించునట్లు; ఎవ్వాని = ఎవని; తోన్ = తోనైతే; భాషించెన్ = మాట్లాడునో; వాడెపో = అతడుమాత్రమే; బ్రహ్మ = ఆనంద బ్రహ్మ; అనగన్ = అనగా; ఎలయించి = మెచ్చుకొనుచు; కెంగేల = ఎర్రనిచేతితో; ఎవ్వనిన్ = ఎవనినైతే; వరియించెన్ = ఇష్టపడెనో; వాడె = అతడుమాత్రమే; లోకముల్ = భువనముల; కున్ = కు; వల్లభుండు = అధిపతి; మెయి = దేహము యనెడి; తీగన్ = తీవతో; ఎవ్వనిన్ = ఎవనియొక్క; మేని = దేహము; తోన్ = తోటి; కదియించు = కౌగలించుకొనునో; వాడెపో = అతడుమాత్రమే; పరమ = అత్యుత్తమమైన; సర్వజ్ఞమూర్తి = అఖిలముతెలిసినవాడు; నెలతుక = అందగత్తె; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; నివసించున్ = ఉండునో; ఏ = ఏ; ఇంటన్ = గృహమునందు; ఆ = ఆ; ఇల్లు = గృహము; పరము = అత్యుత్తమమైనది; అగు = అయిన; అమృత = శాశ్వతమైన; పదము = వైకుంఠము; ఇంతి = స్త్రీ యొక్క. 
            చూపు = దృష్టి; వాఱెన్ = ప్రసరించెనో; ఏ = ఏ; చోటి = ప్రదేశమున; కిన్ = కు; ఆ = ఆ; చోటున్ = ప్రదేశము; జిష్ణు = ఇంద్రుని; ధనదు = కుబేరుని; ధర్మ = యమధర్మరాజులకు; జీవితంబు = ఆయువుపట్టు; కొమ్మ = అందగత్తె యొక్క; చిన్ననగవు = చిరునవ్వు; గురుతర = మిక్కలి భారమైన; దుఃఖ = దుఃఖములను; నివారణంబు = పోగొట్టునది; సృష్టి = సృష్టిని; కారణంబు = వెలిగింపజేయునది.
            మఱియును = ఇంకను; = ; కొమ్మ = అందగత్తె; నెర = నిండైన; మనంబునన్ = మనసులో.

భావము:
            లక్ష్మీదేవి అమృతాన్ని చిలికించే తన వాక్కులతో ఎవరితో పలుకుతుందో అతడే పరబ్రహ్మ. ఆమె మెచ్చుకుంటూ అందమైన తన చేతితో ఎవరిని వరిస్తుందో అతడే సమస్త లోకాలకూ అధిపతి. ఆమె తీగవంటి తన దేహాన్ని ఎవరి మేనుతో చేరుస్తుందో అతడే సర్వజ్ఞుడు. ఏ ఇంట్లో అయితే ఆమె ఎల్లప్పుడూ నివసిస్తూ ఉంటుందో అది పరమాద్భుతమైన అమృత నిలయం. ఆమె చూపులు ఎచ్చట ప్రసరింపజేస్తూ ఉంటుందో అది ఇంద్రునికీ, కుబేరునికీ, యమునికీ ఆయువుపట్టు. ఆ సుందరి చిరునవ్వు దుఃఖాన్ని తొలగించుతుంది, సృష్టిని ప్రకాశింపజేస్తుంది.
            ఇంకా ఆ మనోహరాంగి లక్ష్మీదేవి తన నిండు మనసులో ఇలా భావిస్తుంది....


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: