8-320-సీ.
మనకు వేల్పులకును మందట లేకుండఁ;
బంచి పెట్టెద నని పడఁతి పూనెఁ
దానేల తప్పును? తప్పదు తరళాక్షి;
గాక రమ్మనుచును గడకఁ బిల్వ
మఱుమాట లాడదో మఱి చూడకుండునో;
చను గవఁ గప్పునో చాలు ననుచు
నొండాడఁ గలుగుచు నొక్కింత సొలయునో;
మనయెడఁ గందునో మగువ యనుచు
8-320.1-ఆ.
నెలతఁ చూడ్కి గముల నీరై కరంగుచుఁ
బ్రణయ భంగ భీతి బద్ధు లగుచు
నూరకుండ్రు గాని యువిద తే తెమ్మని
యడుఁగ జాలరైరి యసుర వరులు.
టీకా:
మన = మన; కున్ = కు; వేల్పుల్ = దేవతల;
కును = కు; మందట = మేరలు;
లేకుండన్ = తప్పకుండగ;
పంచిపెట్టెదను = పెంచిపెడతాను;
అని = అని; పడతి = సుందరి;
పూనెన్ =
బాధ్యతతీసుకొనెను;
తాన్ = ఆమె;
ఏలన్ = ఎందుకు;
తప్పును = అతిక్రమించును;
తప్పదు = అతిక్రమించదు;
తరళాక్షి = సుందరి;
కాక = కాకుండగ;
రమ్ము = రా;
అనుచున్ = అని;
కడకన్ = పూని;
పిల్వన్ = పిలిచినచో;
మాఱు = బదులు;
మాటలాడదో = పలుకదేమో;
మఱి =
తిరిగి; చూడకుండునో = చూడదేమో;
చను = స్తనముల;
కవన్ = ద్వయమును (2);
కప్పునో =
పైటకప్పివేయునేమో;
చాలున్ = ఇంకచాలు;
అనుచున్ = అనుచు;
ఒండాడన్ =
మరోమాటపలుకుటకు;
అలుగుచు = కినిసి,
కోపగించి; ఒక్కింత = కొంచము;
సొలయునో =
వెనుదీయునేమో;
మన = మన; ఎడన్ = అందు;
కందునో = కమలునేమో;
మగువ = పడతి;
అనుచున్ =
అనుచు.
నెలతన్ = సుందరి;
చూడ్కి = చూపుల;
గములన్ = సమూహములకు;
నీరు = నీళ్ళలా;
ఐ = అయ్యి; కరంగుచున్ =
కరగిపోతూ; ప్రణయ = ప్రణయలీల;
భంగ = ఆగిపోతుందనెడి;
భీతి = బెరుకునకు;
బద్దులు =
లొంగినవారు;
అగుచున్ = అగుచు;
ఊరకుండ్రి = ఊరకున్నారు;
కాని = తప్పించి;
ఉవిదన్ = సుందరిని; తేతెమ్ము = తొందరగాతీసుకురా;
అని = అని; అడుగజాలరైరి =
పిలువలేకపోయిరి;
అసుర = రాక్షస;
వరులు = ఉత్తములు.
భావము:
ఆ
మాయా మోహిని చూపులకు కరిగిపోయిన రాక్షసులు “ఈ మగువ మనకూ, దేవతలకూ తేడాలేకుండా పంచిపెడతాను అని పూనుకుంది కదా. అలా చేయకుండా మాట
తప్పుతుందా. లేదు అలా తప్పదు. కానీ, మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో!
తిరిగి చూడదేమో! స్తనద్వయం మీద పైట కప్పేసుకుంటుందేమో! మరోమాట కలిపితే కంగారుపడి
వెనకడుగు వేస్తుందేమో! మన యందు అలుగుతుందేమో! మన మీద చూపుతున్న విశ్వాసం
చెడుతుందేమో!” అనుకుంటూ, జంకుతూ గొంకుతూ, ఊరకే ఉండిపోయారు తప్పించి “సుందరీ! తొందరగా తీసుకురా!” అని పిలవలేకపోయారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :