Tuesday, April 14, 2020

ధృవోపాఖ్యానము - 36

4-318-వ.
ఇట్లు వాత్సల్యంబునం జల్లుచు సత్యవాక్యంబుల దీవించుచు సువర్ణ పాత్ర రచిత మణి దీప నీరాజనంబుల నివాళింపం బౌర జానపద మిత్రా మాత్య బంధుజన పరివృతుండై చనుదెంచి.
4-319-సీ.
కాంచన మయ మరకత కుడ్య మణిజాల;
సంచయ రాజిత సౌధములను
వరసుధాఫేన పాండుర రుక్మ పరికరో;
దాత్త పరిచ్ఛదతల్పములను
సురతరు శోభిత శుక పిక మిధునాళి;
గాన విభాసి తోద్యానములను
సుమహిత వైడూర్య సోపాన విమల శో;
భిత జలపూర్ణ వాపీచయముల
4-319.1-తే.
వికచ కహ్లార దర దరవింద కైర
వప్రదీపిత బక చక్రవాక రాజ
హంస సారస కారండవాది జల వి
హంగ నినదాభిరామ పద్మాకరముల.
4-320-వ.
మఱియును.

భావము:
ఈ విధంగా ప్రేమతో చల్లుతూ యథార్థవాక్కులతో దీవిస్తూ, బంగారు పాత్రలలో మణిదీపాలుంచి హారతు లివ్వగా ధ్రువుడు పౌరులతో, జానపదులతో, మిత్రులతో, మంత్రులతో, బంధువులతో కలిసి ముందుకు సాగి ధ్రువుడు నగరంలోకి ప్రవేశించాడు. అక్కడి మేడలు పచ్చలు తాపిన బంగారు గోడలతోను, మణిఖచితాలైన గవాక్షాలతోను మెరిసిపోతున్నవి. పట్టెమంచాల పరుపులపై పాలనురుగువలె తెల్లనైన బంగారు జరీ అంచుల దుప్పట్లు పరచబడి ఉన్నాయి. ఉద్యానవనాలు కల్పవృక్షాలతో నిండి చిలుకలు, కోయిలలు, తుమ్మెదల జంటలు పాడే పాటలతో మారుమ్రోగుతున్నాయి. దిగుడు బావులు వైడూర్యాలతో కట్టిన మెట్లతో నిర్మలమైన జలంతో నిండి ప్రకాశిస్తున్నాయి. వికసించిన కలువలతో, కమలాలతో విరాజుల్లుతూ కొక్కెరలు, జక్కవలు, రాయంచలు, బెగ్గురు పక్షులు, కన్నెలేళ్ళు మొదలైన నీటి పక్షుల కలకల ధ్వనులతో అక్కడి దొరువులు, చెరువులు అలరారుతున్నాయి. ఇంకా…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=319

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 35


4-315-సీ.
స్వర్ణ పరిచ్ఛదస్వచ్ఛకుడ్యద్వార;
లాలిత గోపురాట్టాలకంబు;
ఫల పుష్ప మంజరీ కలిత రంభా స్తంభ;
పూగ పోతాది విభూషితంబు;
ఘన సార కస్తూరికా గంధ జలబంధు;
రాసిక్త విపణి మార్గాంచితంబు;
మానిత నవరత్న మయ రంగవల్లీ వి;
రాజిత ప్రతి గృహ ప్రాంగణంబు;
4-315.1-తే.
శుభ నదీజల కుంభ సంశోభితంబు;
తండులస్వర్ణలాజాక్షతప్రసూన
ఫల బలివ్రాత కలిత విభ్రాజితంబు;
నగుచు సర్వతో లంకృత మైన పురము.
4-316-వ.
ప్రవేశించి రాజమార్గంబునఁ జనుదెంచు నప్పుడు.
4-317-మ.
హరిమధ్యల్ పురకామినీ తతులు సౌధాగ్రంబులందుండి భా
స్వర సిద్ధార్థ ఫలాక్షతప్రసవ దూర్వావ్రాత దధ్యంబువుల్
కరవల్లీ మణి హేమ కంకణ ఝణత్కారంబు శోభిల్లఁ జ
ల్లిరి యా భాగవతోత్తమోత్తమునిపై లీలాప్రమేయంబుగన్.

భావము:
గోడలు, తలుపులు, గోపురాలు బంగారు పూతతో తళతళ మెరుస్తున్నాయి. పండ్లతోను పూలగుత్తులతోను నిండిన అరటి స్తంభాలు, చిన్న చిన్న పోకచెట్లు వీధికి ఇరువైపుల కనువిందు చేస్తున్నాయి. అంగళ్ళముందు పచ్చకర్పూరం, కస్తూరి, చందనం కలిపిన నీళ్ళు చల్లారు. ప్రతి ఇంటి ముంగిట్లోను నవరత్నాలతో ముగ్గులు తీర్చి దిద్దారు. పవిత్ర నదీజలాలతో నిండిన మంగళ కలశాలు నిలిపారు. బంగారు లాజలు, అక్షతలు, పూలు, పండ్లు పూజాద్రవ్యాలు సిద్ధపరిచారు. ఈ విధంగా అలంకరింపబడిన పట్టణంలోకి అలా ఉత్తానపాదుడు తన కొడుకు ధ్రువునితో ప్రవేశించి రాజమార్గం గుండా వస్తున్న సమయంలో సన్నని సింగపు నడుములు గల పురస్త్రీలు ఒయ్యారంగా మేడలపై నిలబడి, చేతులకు ధరించిన మణులు తాపిన బంగారు గాజులు ఝణఝణ ధ్వనులు చేస్తుండగా ఆ ఉత్తమోత్తముడైన భగవద్భక్తునిపై తెల్లావాలు, పండ్లూ, పూలు, అక్షతలు, దూర్వాంకురాలు, పెరుగు కలిపిన నీళ్ళను చల్లారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=317

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Sunday, April 12, 2020

ధృవోపాఖ్యానము - 34


4-312-వ.
కావున నుత్తముండును ధ్రువుండును బ్రేమ విహ్వలు లగుచు నన్యో న్యాలింగితులై పులకాంకురాలంకృత శరీరులై యానంద బాష్పముల నొప్పిరి; అంత సునీతియుం దన ప్రాణంబులకంటెఁ బ్రియుండైన సుతు నుపగూహనంబు చేసి తదవయవ స్పర్శనంబు చేత నానందంబు నొంది విగతశోక యయ్యె; నప్పుడు సంతోష బాష్ప ధారాసిక్తంబులై చనుఁబాలునుం గురిసె నంత.
4-313-సీ.
ఉన్నత సంతోష ముప్పతిల్లఁగఁ బౌర;
జనము లా ధ్రువుతల్లి నెనయఁ జూచి
"తొడరిన భవదీయ దుఃఖనాశకుఁ డైన;
యిట్టి తనూజుఁ డెందేని పెద్ద
కాలంబు క్రిందటఁ గడఁగి నష్టుం డైన;
వాఁడిప్డు నీ భాగ్యవశము చేతఁ
బ్రతిలబ్ధుఁ డయ్యెను; నితఁడు భూమండల;
మెల్లను రక్షించు నిద్ధమహిమ;
4-313.1-తే.
కమల లోచనుఁ జింతించు ఘనులు లోక
దుర్జయం బైన యట్టి మృత్యువును గెల్తు;
రట్టి ప్రణతార్తి హరుఁడైన యబ్జనాభుఁ
డర్థి నీచేతఁ బూజితుం డగుట నిజము."
4-314-వ.
అని ప్రశంసించిరి; అట్లు పౌరజనంబులచేత నుపలాల్య మానుండగు ధ్రువుని నుత్తాన పాదుం డుత్తమ సమేతంబుగా గజారూఢునిం జేసి సంస్తూయమానుండును, ప్రహృష్టాంతరంగుండును నగుచుఁ బురాభి ముఖుండై చనుదెంచి.

భావము:
కనుక, ఉత్తముడు ధ్రువుడు ప్రేమతో ఒడలు మరచి ఒకరినొకరు కౌగలించుకున్నారు. వారి శరీరాలు పులకరించాయి. వారి కనులలో ఆనంద బాష్పాలు నిండాయి. అప్పుడు సునీతి తన ప్రాణాలకంటే ఎక్కువ ప్రీతిపాత్రుడైన కొడుకును గట్టిగా కౌగిలించుకొని అతని తనూస్పర్శ వల్ల కలిగిన సంతోషంతో తన దుఃఖాన్ని మరిచిపోయింది. ఆనందబాష్పాలతో తడిసిన ఆ తల్లి పాలిండ్లు పొంగులెత్తాయి. పురజనులు ధ్రువుని తల్లియైన సునీతిని చూచి అంతులేని సంతోషంతో “చాలాకాలం క్రిందట కనిపించకుండా పోయిన నీ కొడుకు నీ అదృష్టం వల్ల మళ్ళీ తిరిగి వచ్చాడు. నీ దుఃఖాన్ని తొలగించాడు. ఇతడు సాటిలేని పరాక్రమంతో భూమండలాన్ని పరిపాలిస్తాడు. విష్ణువును సేవించే మహాత్ములు అజేయమైన మృత్యువును కూడా జయిస్తారు. ప్రపన్నులైన భక్తుల దుఃఖాన్ని తొలగించే నారాయణుని నీవు నిజంగా ఆరాధించావు.” అని పౌరజనులు ప్రశంసించారు. ఆ విధంగా పౌరులచేత ఉపలాలింప బడుతున్న ధ్రువుణ్ణి ఉత్తానపాదుడు ఉత్తమునితో కూడా ఏనుగుపైన కూర్చుండ బెట్టి, ప్రజల ప్రస్తుతులను అందుకుంటూ మనస్సులో పొంగిపొరలే సంతోషంతో పురం వైపు బయలుదేరి వచ్చి…

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=314

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 33

4-309-క.
జనకుని యాశీర్వచనము
లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్
దన ఫాలతలము సోఁకఁగ
వినతులు గావించి భక్తి విహ్వలుఁ డగుచున్.
4-310-తే.
అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు
దల్లులకు భక్తి వినతులు దగ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి
నగు మొగంబున నాలింగనంబు చేసి.
4-311-సీ.
కరమొప్ప నానంద గద్గద స్వరమున;
జీవింపు మనుచు నాశీర్వదించె;
భగవంతుఁ డెవ్వనిపై మైత్రి పాటించు;
సత్కృపానిరతిఁ బ్రసన్నుఁ డగుచు
నతనికిఁ దమయంత ననుకూలమై యుండు;
సర్వభూతంబులు సమతఁ బేర్చి
మహిఁ దలపోయ నిమ్నప్రదేశములకు;
ననయంబుఁ జేరు తోయముల పగిది
4-311.1-తే.
గాన ఘను నమ్మహాత్ముని గారవించె
సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట
వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.

భావము:
తండ్రి దీవనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు. సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=311

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, April 11, 2020

ధృవోపాఖ్యానము - 32


4-306-సీ.
వలను మీఱిన సైంధవంబులఁ బూన్చిన;
కనక రథంబు నుత్కంఠ నెక్కి
బ్రాహ్మణ కుల వృద్ధ బంధు జనామాత్య;
పరివృతుం డగుచు విస్ఫురణ మెఱసి
బ్రహ్మనిర్ఘోష తూర్యస్వన శంఖ కా;
హళ వేణు రవము లందంద చెలఁగ
శిబిక లెక్కియు విభూషితలై సునీతి సు;
రుచు లుత్తముండు నారూఢి నడువ
4-306.1-తే.
గరిమ దీపింప నతిశీఘ్రగమన మొప్ప
నాత్మనగరంబు వెలువడి యరుగుచుండి
బలసి నగరోపవన సమీపంబు నందు
వచ్చు ధ్రువుఁ గని మేదినీశ్వరుఁడు నంత.
4-307-చ.
అరదము డిగ్గి ప్రేమ దొలఁకాడ ససంభ్రముఁడై రమామనో
హరు చరణారవింద యుగళార్చన నిర్దళితాఖి లాఘు నీ
శ్వర కరుణావలోకన సుజాత సమగ్ర మనోరథున్ సుతుం
గర మనురక్తి డాసి పులకల్ ననలొత్తఁ బ్రమోదితాత్ముఁడై.
4-308-తే.
బిగియఁ గౌఁగిటఁ జేర్చి నెమ్మొగము నివిరి
శిరము మూర్కొని చుబుకంబు చేతఁ బుణికి
యవ్యయానంద బాష్ప ధారాభిషిక్తుఁ
జేసి యాశీర్వదింప నా చిరయశుండు.

భావము:
వడిగల గుఱ్ఱాలను పూన్చిన బంగారు రథాన్ని ఆత్రంగా ఎక్కి, బ్రాహ్మణులతో కులవృద్ధులతో బంధు మిత్రులతో మంత్రులతో కలసి బయలుదేరాడు. వేదఘోషలు, వాద్యధ్వనులు, శంఖ కాహళ వేణు నాదాలు అతిశయించాయి. పెద్దభార్య సునీతి, చిన్నభార్య సురుచి బంగారు పల్లకీలెక్కి ఉత్తమునితో కూడి అనుసరించారు. అలా వేగంగా ముందుకు సాగి వెళ్తూ పురం వెలుపల ఉపవనం సమీపాన అల్లంత దూరంనుండి వస్తున్న ధ్రువకుమారుణ్ణి ఉత్తానపాదుడు చూచి రథం దిగి, అనురాగం పొంగిపొరలగా సంభ్రమంతో ధ్రువునికి ఎదురువెళ్ళాడు. శ్రీపతి పాదపద్మాలను సేవించి పాపాలను పోగొట్టుకొని, ఆ భగవంతుని కరుణాకటాక్షం వల్ల కోరికలు తీర్చుకున్న తన కుమారుని సమీపించి ప్రేమతో పులకించిపోతూ సంతోషంగా గట్టిగా కౌగిలించుకొని, ముఖం నిమిరి, శిరస్సు మూర్కొని, గడ్డం పుణికి, జలజల ప్రవహించే ఆనందబాష్పాలతో పుత్రుని శిరస్సును అభిషేకించి ఉత్తానపాదుడు ఆశీర్వదించగా, చిరకీర్తివంతుడైన పుత్రుడు ఆ ధ్రువుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=308

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధృవోపాఖ్యానము - 31

4-303-క.
చచ్చిన వారలుఁ గ్రమ్మఱ
వచ్చుటయే కాక యిట్టి వార్తలు గలవే?
నిచ్చలు నమంగళుఁడ నగు
నిచ్చట మఱి నాకు శుభము లేల ఘటించున్.
4-304-క.
అని విశ్వసింపకుండియు
మనమున నా నారదుఁడు గుమారుఁడు వేగం
బునఁ రాఁగలఁ డనుచును బలి
కిన పలుకులు దలఁచి నమ్మి కృతకృత్యుండై.
4-305-క.
తన సుతుని రాక చెప్పిన
ఘనునకు ధనములును మౌక్తికపు హారములున్
మన మలర నిచ్చి తనయునిఁ
గనుఁగొను సంతోష మాత్మఁ గడలుకొనంగన్

భావము:
చచ్చినవారు తిరిగి రావడం అనే చోద్యం ఎక్కడైనా ఉందా? అన్నివిధాల నిర్భాగ్యుడనైన నాకు అంతటి అదృష్టం ఎలా లభిస్తుంది?ధ్రువుడు మరలి వస్తున్నాడు అని ముందు నమ్మనివాడై “నీ కొడుకు తొందరలోనే తిరిగివస్తాడు” అని పూర్వం నారదుడు చెప్పిన మాటలను జ్ఞప్తికి తెచ్చుకొని అటువంటి అదృష్టం లభిస్తుందేమో అని కొంత విశ్వసించి తన కొడుకు వస్తున్నాడని చెప్పిన చారునకు ధనం, ముత్యాల దండలు సంతోషంగా ఇచ్చి, కొడుకును చూడాలనే ఉత్సాహం మనస్సులో ఉప్పొంగగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=305

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Friday, April 10, 2020

ధృవోపాఖ్యానము - 30

4-300-మ.
"ధనహీనుండు నృపాలుఁ జేరి మిగులన్ ధాటిన్ ఫలీకార మి
మ్మని యర్థించినరీతి ముక్తిఫలదుం డై నట్టి పంకేజలో
చనుఁ డే చాలఁ బ్రసన్నుఁడైన నతనిన్ సాంసారికం బర్థిఁ గో
రిన నావంటి విమూఢమానసులు ధాత్రిం గల్గిరే యెవ్వరున్?"
4-301-సీ.
అని యిట్లు చింతించె" ననుచు నమ్మైత్రేయ;
ముని విదురునకు నిట్లనియెఁ "దండ్రి!
కమనీయ హరిపాద కమల రజోభి సం;
స్కృత శరీరులును యాదృచ్ఛికముగ
సంప్రాప్తమగు దాన సంతుష్టచిత్తులై;
వఱలుచు నుండు మీవంటి వారు
దగ భగవత్పాద దాస్యంబు దక్కంగ;
నితర పదార్థంబు లెడఁద లందు"
4-301.1-తే.
మఱచియును గోర నొల్లరు మనుచరిత్ర!
తవిలి యిట్లు హరిప్రసాదంబు నొంది
మరలి వచ్చుచునున్న కుమారు వార్తఁ
జారుచే విని యుత్తానచరణుఁ డపుడు.
4-302-వ.
మనమున నిట్లని తలంచె.

భావము:
పేదవాడు రాజును సమీపించి ఊకతో కూడిన నూకలను ఇమ్మని కోరినట్లు మోక్షప్రదాత అయిన కమలాక్షుడు నాకు ప్రసన్నుడైనా అతన్ని నేను సంసారాన్ని అర్థించాను. నావంటి మందబుద్ధులు ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు’ అని ఈ విధంగా ధ్రువుడు విచారించాడు ” అని చెప్పి మైత్రేయుడు విదురునితో ఇలా అన్నాడు “నాయనా! పావనమైన శ్రీహరి పాదపద్మాల పరాగంతో అలంకరింపబడిన శరీరం కలిగిన మీవంటివాళ్ళు తనంత తాను దొరికే దానితోనే సంతృప్తిపడతారు. భగవంతుని పాదసేవను తప్ప మరొకటి కోరుకొనరు. విష్ణుదేవుని అనుగ్రహాన్ని పొంది కన్నకొడుకు తిరిగి వస్తున్నాడన్న వార్తను ఉత్తానపాదుడు చారుల వల్ల విని మనస్సులో ఇలా తలంచాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=301

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :