Monday, July 15, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]



2.100.40.అనుష్టుప్.

వీరైరధ్యుషితాం పూర్వమ్

అస్మాకం తాత! పూర్వకైః।

సత్యనామాం దృఢ ద్వారామ్

హస్త్యశ్వరథసంకులామ్॥


తాత్పర్యము :- 

నాయనా భరతా! పేరుకు తగినది ఎంతటి యోధులకు శక్యముకానిదైన అయోధ్య. ఇది పూర్వమునుండి వీరులైన మన పూర్వీకులు పరిపాలించినది. దృఢమైన కోట ద్వారములు కలది, గజ తురగ రథాది చతురంగబలాలుతో కిక్కిరిసి ఉన్నది. 


ప్రతిపదార్థము :- 

వీరైః = వీరులులైన; అధ్యుషితామ్ = అధిష్టింపబడినది; పూర్వమ్ = ఇంతకుముందు; అస్మాకం = మన యొక్క; తాత = నాయనా; పూర్వకైః = పూర్వీకులచేత; సత్యనామామ్ = సార్థకమైన పేరుకలది; దృఢ = బలిష్టమైన; ద్వారామ్ = ద్వారమలుకలది; హస్తి = గజములు; అశ్వ = అశ్వములు; రథ = రథములు; సంకులామ్ = సమ్మర్థము కలది, కిక్కిరిసినది.


*గమనిక :- 

;అయోధ్యానగరము వర్ణనలో యోధులకునూ శక్యముకానిది, దృఢమైన ద్వారములు కలది అనుటచే, చుట్టూ బలమైన కోట కలదు అని తెలియుచున్నది



2.100.41.అనుష్టుప్.

బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః

స్వకర్మనిరతైస్సదా।

జితేంద్రియైర్మహోత్సాహైః

వృతామార్యైస్సహస్రశః॥


తాత్పర్యము :- 

అయోధ్యలో ఎల్లప్పుడు స్వధర్మము అనుసరించువారు, చపలత్వములు లేనివారు, ఉత్సాహభరితులు, గౌరవనీయులు ఐన వేలకోలది బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు కలరు.


ప్రతిపదార్థము :- 

బ్రాహ్మణైః = బ్రాహ్మణులు; క్షత్రియైః = క్షత్రియులు; వైశ్యైః = వైశ్యులు; స్వ = తమ; కర్మ = ధర్మమునందు; నిరతైః = మిక్కిలిఆసక్తికలవారు; సదా = ఎల్లప్పుడు; జితేంద్రియైః = ఇంద్రియ లోలత్వము లేనివారు; మహోత్సాహైః = గొప్పఉత్సాహభరితులు; వృతామ్ = నిండియున్నది; ఆర్యైః = ఆర్యులు; సహస్రశః = వేలకొలది.



2.100.42.అనుష్టుప్.

ప్రాసాదైర్వివిధాకారైః

వృతాం వైద్యజనాకులామ్।

కచ్చిత్సముదితాం స్ఫీతామ్

అయోధ్యాం పరిరక్షసి॥


తాత్పర్యము :- 

రకరకములైన రాజభవనములు, ఎందరో పండితులు, సంతుష్టులైన ప్రజలు కలది, సర్వసమృద్దమైనది ఐన అయోధ్యానగరమును చక్కగా రక్షించుచుంటివి కదా?


ప్రతిపదార్థము :- 

ప్రాసాదైః = సౌధములు; వివిధ = రకరకముల; ఆకారైః = ఆకారములు కలవి; వృతామ్ = నిండినది; వైద్యజనాః = పండితులుతో; ఆకులామ్ = కిక్కిరిసినది; కచ్చిత్ = కదా?; సముదితామ్ = సంతుష్టులతో కూడినదీ; స్ఫీతామ్ = సమృద్దికలదీ ఐన; అయోధ్యామ్ = అయోధ్యను; పరిరక్షసి = కాపాడుతుంటివి.



-----



శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: