Saturday, July 13, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- ॥శతతమ సర్గః॥

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]



2.100.35.అనుష్టుప్.

కచ్చిజ్జానపదో విద్వాన్

దక్షిణః ప్రతిభానవాన్।

యథోక్తవాదీ దూతస్తే

కృతో భరత! పండితః॥


తాత్పర్యము :- 

స్వదేశీయుడు అనగా కోసల దేశపువానిని, మంచి జ్ఞానసంపన్నుని, అత్యంత దక్షత కలవానిని, మంచి సమయల్పూర్తి కలవానిని, తగిన విధముగా సంభాషించుట యందు ఎలా చెప్పబడెనో అటులనే చెప్పుటయందు మరొక విధముగా పలుకు ఇతరుల పలుకులకు తర్కబద్దముగా ఖండించుటందు నేర్పు కలవానిని దూతగా నియమించితివి కదా? 


ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా?; జానపదః = స్వదేశీయుడు; విద్వాన్ = మిక్కిలి జ్ఞానము కలవాడు; దక్షిణః = అత్యంత దక్షతకలవాడు; ప్రతిభానవాన్ = సమయస్పూర్తి కలవాడు; యథోక్తవాదీ = చెప్పినవిధముగా చెప్పువాడు, తగినట్లు మాచ్లాడు వాడు; దూతః = రాయబారిగా; తే = నీకు; కృతః = చేయబడెను; భరత = భరతుడా; పండితః = శాస్త్రములు చదివిన వాడు. 



2.100.36.అనుష్టుప్.

కచ్చిదష్టాదశాన్యేషు

స్వపక్షే దశ పంచ చ।

త్రిభిస్త్రిభిరవిజ్ఞాతైః

వేత్సి తీర్థాని చారకైః॥


తాత్పర్యము :- 

పర రాజ్యపు మంత్రి, పురోహితుడు, యువరాజు మున్నగు అష్టాదశ (18) పదాధికారుల గురించి, మఱియు స్వరాష్ట్రపు మంత్రి, పురోహితుడు, యువరాజు ఎదురుగనే ఉందురు కనుక వారిని తప్పించి మిగతా పదిహేనుగురు (15) పదాధికారుల గుఱించి తెలుసుకొనుటకు ఒక్కొక్కరి మీద వారిలో వారికి తెలియని ముగ్గురేసి (3) గూఢచారులను నియమించి, వారి గురించి నిరంతర సమాచారాం గ్రహించుచుంటివి కదా అని అడుగుతుండెను


ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా?; అష్టాదశాః = పద్దెనిమిది; అన్యేషు = పరులలో, శత్రువులలో; స్వపక్షః = తనపక్షము నందు; దశపంచ = పదిహేను; చ = మరియు; త్రిభిస్త్రిభిః = ముగ్గురు ముగ్గురు; అవిజ్ఞాతైః = పరిచయము లేనివారు; వేత్సి = తెలుసుకొనుచున్నావు; తీర్థాని = దేశ పదాధికారులు; చారకైః = గూఢచారులచేత.


*గమనిక :- 

;(1) తీర్థాని-మంత్రి ఇతి మోదినీ, మంత్రిప్రభృత్యష్టాదశరాష్ట్రసంపత్, శబ్దకల్పదృమము, తీర్థములవారు అనగా రాజకార్యములను నిర్వహించెడి వారు. (2) అష్టాదశ-అధికారులు : సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి) 2002, (అ.) 1. మంత్రి, 2. పురోహితుడు, 3. యువరాజు, 4. సేనాపతి, 5. ద్వారపాలుడు, 6. అంతరవేశకుడు, 7. కారాగృహాధికారి, 8. కోశాధ్యక్షుడు, 9. ఆయవ్యయ నిరీక్షకుడు, 10. ఉపదేశకుడు, 11. నగరాధ్యక్షుడు, 12. నవోద్యమ యోజకుడు, 13. ధర్మాధ్యక్షుడు, 14. సభాధ్యక్షుడు, 15. దండాధ్యక్షుడు, 16. దుర్గాధ్యక్షుడు, 17. సీమాభాగరక్షకుడు, 18. అరణ్యరక్షకుడు. [మహాభారతము -సభా. 5అ.] 


-----


శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: