జైశ్రీరామ
-:వాల్మీకి తెలుగు రామాయణము:-
-॥శతతమ సర్గః॥
[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]
2.100.67.అనుష్టుప్.
మంగళాస్యప్రయోగం చ
ప్రత్యుత్థానం చ సర్వతః।
కచ్చిత్త్వం వర్జయస్యేతాన్
రాజదోషాంశ్చతుర్దశ॥
తాత్పర్యము :-
13. మంగళకరమైనవి
చేయకపోవుట. 14. ప్రతీదానికి స్పందించుట. ఈ పద్నాలుగు (14) రాజదోషములను నీవు విసర్జించుతుంటివి
కదా?
ప్రతిపదార్థము :-
మంగళస్య = మంగళకరమైనవాటిని; అప్రయోగం = చేయకపోవుట; చ = కూడా; ప్రత్యుత్థానమ్ = ఎదుర్కొనుట; చ = పాదపూరణము; సర్వతః = అంతట; కచ్చిత్ = కదా; త్వమ్ = నీవు; వర్జయస్య = విడుచుచుంటివి; ఏతాన్ = ఈ; రాజ = రాజులయొక్క; దోషామ్ = దోషములను; చ = పాదపూరణము; చతుర్దశ = పద్నాలుగు (14).
2.100.68.అనుష్టుప్.
దశపంచచతుర్వర్గాన్
సప్తవర్గం చ తత్త్వతః।
అష్టవర్గం త్రివర్గం చ
విద్యాస్తిస్రశ్చ రాఘవ॥
తాత్పర్యము :-
ఓ రఘుకుల భరతుడా! దశఃవర్గము(10)
దుర్గుణములు, పంచఃవర్గము(5) రాజ్య విభాగమలు, చతుర్వర్గము(4) ఉపాయములు, సప్తవర్గము(7)
రాజ్యతంత్రములు, అష్టవర్గము(8) రాజ్యం అంగాలు, త్రివర్గము(3) శత్రుగతులు,
త్రివిద్యలను మఱియు.
ప్రతిపదార్థము :-
దశః = పదింటి (10); పంచః = ఐదింటి (5); చతుః = నాలుగింటి (4); వర్గాన్ = వర్గములను; సప్త = ఏడింటి (7); వర్గమ్ = వర్గమును; చ = పాదపూరణము; తత్త్వతః = యదార్థముగా; అష్ట = ఎనిమిదింటి (8); వర్గమ్ = వర్గము; త్రి = మూడింటి (3); వర్గమ్ = వర్గము; చ = మఱియు; విద్యాః = విద్యలు; తిస్రః = మూడింటిని; చ = మఱియు; రాఘవ = రఘువంశపు భరతుడా.
*గమనిక
:-
(1) దశ వర్గం- ఇవి రెండు: 1. వేట, జూదం,
అదే పనిగా ఇతరులను గురించి చెడుగా మాట్లాడటం, పొగరుబోతుతనం,
నృత్త, గీత, వాద్యాల
వ్యసనానికి లోనవడం, పనిలేకుండా తిరుగుతూ ఉండటం మొదలైనవి ఒక
వర్గం. 2. లుబ్ధత్వం, క్రౌర్యం,
సోమరితనం, అలవాటుగా అబద్ధమాడటం, ఏమరిపాటు వల్ల చిక్కుల్లో ఇరుక్కోవడం, పిరికితనం,
నిలకడలేకపోవడం, మూఢత్వం, అతి మెతకతనం (నయత్వం), ఇతరులను అవమానపరచే ధోరణి
మొదలైనవి రెండవ వర్గం. పారమార్థిక పదకోశం. (2) పంచవర్గం-
అమాత్యుడు, రాష్ట్రము, దుర్గము,
కోశము, దండము (సైన్యము). సంకేత పదకోశము.
(3)చతుర్వర్గం- చతురుపాయములు, సామ దాన బేధ దండోపాయములు. (4) సప్తవర్గము- సప్తాంగములు,
రాజ్యతంత్రంలో ఏడు అంగాలు ఉన్నాయని శాస్త్రం చెపుతుంది. అవి: రాజు, మంత్రి, మిత్రుడు, బొక్కసం/
ఖజానా, రాజ్యం, కోట, సైన్యం. (5) అష్టవర్గము- అష్టాంగములు- రాజనీతి సంబంధంగా, వైయక్తిక నీతి సంబంధంగా ఎనిమిది అంశాలు కలిగిన రెండు పట్టికలు ఉన్నాయి.
కృషి, వాణిజ్యం, దుర్గం (కోట ),
ఏనుగులను పట్టుకొని మచ్చిక చేసే అడవి, గనులు,
పన్నుల సేకరణ, వాస యోగ్యమైన కొత్త ప్రదేశాలలో
జనావాసాలను నిర్మించడం. పాఠ్యంతరమున. పైశున్యం (కొండేలు చెప్పడం), దుస్సాహసం, పర ధనాపహరణం, ఓర్వలేనితనం,
అసూయ, నోటి దురుసుతనం, దండ
పారుష్యం (అతి కఠినంగా శిక్షించడం). (6) త్రివర్గము- శత్రువులయొక్క ఉనికి వృద్ధి
క్షయము గమనించవలెను. (7) విద్యస్త్రిః- మూడు విద్యలు- త్రయి, వార్తా, దండనీతులు, ‘త్రయి’ ఋగ్యజుస్సామ వేదములు, ‘వార్తా’ కృషి గోరక్షణాదులు, ‘దండనీతులు’ నీతి శాస్త్రము.
2.100.69.అనుష్టుప్.
ఇంద్రియాణాం జయం బుద్ధ్యా
షాడ్గుణ్యం దైవమానుషమ్।
కృత్యం వింశతివర్గం చ
తథా ప్రకృతిమండలమ్॥
తాత్పర్యము :-
ఇంద్రియలౌల్యము
లేకుండుట, సంధివిగ్రహాది గుణములు ఆరింటిని తెలుసుకొని ఉండుట, దైవమువలన మానవులవలన
కలుగు బాధలు, సంధిచేసుకొనరాని వింశతి(20)వర్గము, రాజ్యమునకైన సప్తప్రకృతులు మఱియు
ద్వాదశమండలము అను రాజు,
ప్రతిపదార్థము :-
ఇంద్రియాణాం = ఇంద్రియములను; జయమ్ = జయించుట; బుద్ధ్యా = తెలుసుకొని; షాడ్గుణ్యమ్ = సంధివిగ్రహాది ఆరు; దైవిక = దైవమువలన కలిగెడి బాధలు; మానుషమ్ = మనుషుల వలన కలిగెడి బాధలు; కృత్యమ్ = శత్రుపక్షమునుండి నలుగురు గుర్తించిన
వారిని తన పక్షమునకు తెచ్చుకోనుట (4); వింశతి = ఇరవై (20); వర్గమ్ = వర్గము; చ = పాదపూరణము; తథా = మఱియు; ప్రకృతిః = సప్తప్రకృతుల; మండలమ్ = ద్వాదశమండలము రాజులు.
*గమనిక
:-
;(8) షాడ్గుణ్యము- ఆరుగుణములు, సంధి, విగ్రహ, ఆసన, ద్వైదీభావము, సమాశ్రయము, సంధి అనగా శత్రువుతో ఒడంబడిక చేసికొనుట, విగ్రహము అనగా శత్రువుతో విరోధము నడపుట, ఆసనము అనగా అనుకూల కాలమునకై వేచి ఉండుట, యానము అంటే శత్రువుపై దండెత్తి వెడలుట, ద్వైధీభావము అనగా బలహీనులు బలవంతులు ఇద్దరితో మంచిగా ఉండుట, సమాశ్రయము అనగా బలవంతుని ఆశ్రయించుట. (9) దైవికములు- దైవము వలన కలుగునవి, అగ్నిప్రమాదములు, వరదలు, కఱువుకాటకములు, మరణము అను ఈ ఐదు బాధలు. (10) మానుషములు- మనుషుల వలన కలుగు బాధలు, అధికారులు, దొంగలు, శత్రువులు, రాజునకు సన్నిహితులు, దురాశాపరుడైన రాజు, ఈ ఐదుగురు మనుషులవలన కలుగు బాధలు (11) కృత్యమ్ శత్రుపక్షమునుండి జీతము దొరకని లుబ్దుడు, అవమానించబడిన ఆత్మాభిమాని, నిష్కారణ కోపమునకు గురైనవాడు, భయపెట్టబడిన వీరుడు అను నాలుగు విధముల వారిని వారికి కావలసినవి ఇచ్చి తన వైపునకు త్రిప్పుకొనుట (12) వింశతివర్గము- 1. బాలుడు, 2. వృద్దుడు, 3. దీర్ఘరోగి, 4. బందువులచే బహిష్కరింపబడినవాడు, 5. పిఱికివాడు, 6. పిఱికివారైన జనులు కలవాడు, 7. లోభి, 8. దురాశాపరులకు ఆశ్రయమిచ్చువాడు, 9 మంత్రి సేనాపతి మొదలగు వారిని సంతృప్తి పరచనివాడు, 10. విషయాసక్తుడు, 11. చంచలచిత్తుల యొక్క సూచనలను గ్రహించువాడు, 12. దేవతలను బ్రాహ్మణులను నిందించువాడు. 13. దైవోపహతుడు, 14. అదృష్టమును నమ్ముకొని పురుషయత్నము చేయని వాడు, 15. దుర్భిక్షపీడితుడు, 16. చిక్కులపాలైన సేనలు కలవాడు, 17. స్వదేశము వీడినవాడు, 18. పెక్కుమంది శత్రువులు కలవాడు, 19. కాలము అనుకూలింపనివాడు, 20. సత్యధర్మములు పాటింపని వాడు అను ఈ ఇరవై విధములవారితో రాజు సంధిచేసుకొనరాదు. (13) ప్రకృతిమండలము, సప్తప్రకృతులు, స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము. ఇవి రాజ్యాంగములు. సంకేతపదకోశము.(14) మండలము- ద్వాదశమండలము, విజిగీషువు అనగా తన రాజ్యము విస్తరింపచేయవలెననెడి కోరిక కలవాడు. ఈ విజిగీషువు మఱియు అతని చుట్టూ పదకొండు మంది రాజులు ఉందురు వీరు పన్నెండు మందిని మండలము అందురు. విజిగీషువు మండలము మధ్యన ఉండును; అతనికి ముందుభాగమున శత్రువు, మిత్రుడు, శత్రుమిత్రుడు, మిత్రశత్రువు, శత్రుమిత్రమిత్రుడు అను ఐదుగురు; వెనుకభాగమున పార్ష్ణిగ్రాహుడు, దాడిచేయబోవుచున్న రాజునకు వెనుక కాచుకుని ఉన్నవాడు, ఆక్రందుడు, పార్ష్ణిగ్రాసారుడు, ఆక్రందసారుడు అను నలుగురు ఉందురు; పార్శ్వమునందు మధ్యస్తుడు ఉండును; వారికి వెలుపల ఉదాసీనుడు ఉండును
-----
శ్రీరామ రక్ష జగదభి రక్ష
No comments:
Post a Comment