Sunday, July 14, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]



2.100.37.అనుష్టుప్.

కచ్చిద్వ్యపాస్తానహితాన్

ప్రతియాతాంశ్చ సర్వదా।

దుర్బలాననవజ్ఞాయ

వర్తసే రిపుసూదన!॥


తాత్పర్యము :- 

శత్రుసంహారకుడా భరతా! శత్రుశేషాదులు ప్రమాదకారులు కదా. నీచేతిలో ఓడిపోయినవారు, నీ ఎదుట నిలబడలేక వెనుదిరిగిన వారు కక్షతీర్చుకొన రావచ్చును. వారిని దుర్బలులు కదా అని నిర్లక్ష్యము చేయక అప్రమత్తముగా మెలగుతున్నావు కదా?


ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా?; వ్యపాస్తాన్ = ఓడింపబడిన; అహితాన్ = శత్రువులను; ప్రతియాతామ్ = కక్షదీర్చుకొనుటకువచ్చిన; చ = ఇంకనూ; సర్వదా = ఎల్లప్పుడూ; దుర్బలాన్ = బలహీనులను; అనవజ్ఞాయ = నిర్లక్ష్యము చేయక; వర్తసే = మెలగుచుంచివి; రిపుసూదన = శత్రుసంహారకుడా.


2.100.38.అనుష్టుప్.

కచ్చిన్న లోకాయతికాన్

బ్రహ్మణాంస్తాత! సేవసే।

అనర్థకుశలా హ్యేతే

బాలాః పండితమానినః॥

తాత్పర్యము :- 

నాయనా భరతా! నాస్తికులైన బ్రాహ్మణులను దరిచేరనీయుట లేదుకదా? ఎందుకనగా, తాము పండితులమని అహకరించుచుండు అజ్ఞానులు అగుటచే వీరు హాని కలిగించుటలో బహు నేర్పరులు


ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా?; న = లేదు; లోకాయతికాన్ = లోకాయత మతస్థుడైన, నాస్తికుడైన; బ్రహ్మణామ్ = బ్రాహ్మణులను; తాత = నాయనా; సేవసే = సేవించుట; అనర్థః = కీడుకలిగించుట లందు; కుశలాః = నేర్పరులు; ఏతే = వీరు; బాలాః = అజ్ఞానులు; పండితమానినః = పండితమన్యః, తాము పండితులమని భావించువారు.


*గమనిక :- 

(1) లోకాయతికులు - చార్వాకులు, స్వభావమును అనుసరించి లోకములు ప్రాప్తించుననెడి వారు, లోకాయత మతస్థులు. స్వభావమునకు ప్రభుత్వము ఆపాదింతురు. (2) లోకాయతికులు స్వభావము తప్ప వేరు భగవంతుడు లేడను నాస్తిక దుర్బుద్ధికలవారు. తమను తాము పండితులమని భావించుకొని, శుష్కవాదములు చేయుచూ హాని కలిగింతురు. కనుక, వారిని ఎల్లప్పుడూ దూరముపెట్టుటే ఉచితము. 



2.100.39.అనుష్టుప్.

ధర్మశాస్త్రేషు ముఖ్యేషు

విద్యమానేషు దుర్బుధాః।

బుద్ధిమాన్వీక్షికీం ప్రాప్య

నిరర్థం ప్రవదంతి తే॥


తాత్పర్యము :- 

ప్రామాణికమైన ధర్మశాస్త్రములన్నీ అందుబాటులోనే ఉండగా, వాటిని కాదని శుష్కతర్కములను అవలంబించి, నిరర్థకమైనవి నీకు చెప్పుదురు


ప్రతిపదార్థము :- 

ధర్మశాస్త్రేషు = ధర్మశాస్త్రములు; ముఖ్యేషు =  ప్రధానమైనవాటిని; విద్యమానేషు = వర్తమానకాలములో ఉండగా; దుర్బుధాః = ఈ దుర్బుద్ధి కల వారు; బుద్ధిమ్ = బుద్దిని; అన్వీక్షికీమ్ = తర్కశాస్త్రము పరిజ్ఞానము; ప్రాప్య = పొంది; నిరర్థం = శుష్క, ప్రయోజనశూన్యమైనవి; ప్రవదంతి = చెప్పుదురు; తే = నీకు.


*గమనిక :- 

;(1) దుర్బుద్దాః- అన్విక్షికీం శుద్ధిం ప్రాప్యశుఫ్క తర్క విషయాం బుద్ధిమేం స్థాప. శుభ్రమైన అక్షపాదుఁడు మొదలయినవారు చేసిన తర్కశాస్త్రము అన్వీక్షకీ నేర్చినను, శుష్క తర్కములను తీసి ప్రయోజన శూన్యమైన విషయములు బొందువారు. (2) ధర్మశాస్త్రములు:  భారతీయ సామాజిక వ్యక్తిగత జీవితములను శాసించు గ్రంథాలు. బౌద్ధాయన, ఆపస్తంబ, విశిష్ట ధర్మసూత్రములు, మను, యాజ్ఞవల్క్య, నారద, బృహస్పతి స్మృతులు, దేవన్నిబట్టు రచించిన స్మృతిచంద్రిక, క్రీ. శ. 12 వ శతాబ్దము నీలకంఠుడు రచించిన వ్యవహారమయూఖము ధర్మశాస్త్రములుగా గుర్తించబడినవి.


-----



శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: