Friday, July 19, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 52,53,54

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]


2.100.52.అనుష్టుప్.

కచ్చిన్న సర్వే కర్మాంతా
      ప్రత్యక్షాస్తేఽవిశంకయా।
సర్వే వా పునరుత్సృష్టా
      మధ్యమేవాత్ర కారణమ్

తాత్పర్యము :-
      నీ సేవకులు, పనిచేయు కార్మికులు అందరూ నీ ఎదుటకు వచ్చుటకు సందేహించుట లేదు కదా
? లేక భయాతిశయముచేత దూరందూరముగా ఉండిపోతున్నారా? ఈ విషయంలో మధ్యేమార్గము అవలంభించుట మంచిది.

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా; = కాదు; సర్వే = అందరు; కర్మాంతా = కార్మికులు; ప్రత్యక్షః = ఎదుటకు; స్తి = వచ్చుటకు; తే = నీకు; అవిశంకయా = సందేహము లేకుండా; సర్వే = అందరు; వా = లేదా; పునః = మరీ; ఉత్సృష్టా = దూరముగా ఉంచబడినవారు; మధ్యమేవ = మధ్యేమార్గము; త్ర = ఈ విషయము నందు; కారణమ్ = శ్రేయస్సుకు కారణము.

2.100.53.అనుష్టుప్.

కచ్చిత్సర్వాణి దుర్గాణి
      ధనధాన్యాయుధోదకైః।
యన్త్రేశ్చ పరిపూర్ణాని
      తథా శిల్పిధనుర్ధరైః॥

తాత్పర్యము :-
     
కోటలు అన్నింటిలోనూ యుద్దము, ప్రకృతి వైపరీత్యాది అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనుటకు అవసరమైనవి కోశాగారమున, ధాన్యాగారమున, జలవనరులందు, ఆయుధగారమున, మానవ వనరులు, బలవనరులు సర్వం ఎల్లప్పుడు సిద్దంగా ఉంటున్నవి కదా.

ప్రతిపదార్థము :-
      కచ్చిత్
= కదా;ర్వాణి = సమస్తమైన; దుర్గాణి = కోటలలోను; ధనః = ధనము; ధాన్యః = ధాన్యము మొదలగునవి;యుధః = ఆయుధములు;దకైః = జలపూర్ణమైన జలవనరులు; యన్త్రైః = యంత్రములు; = మఱియు; పరిపూర్ణాని = సుసంమృద్దిగా; తథా = అలాగే; శిల్పిః = వడ్రంగిలోనగువారు; ధనుర్ధరైః = విలుకాండ్రు.

*గమనిక :-

      (1) రాజ్యమునందు అత్యవసర సమయాలకోసం నిల్వ ఉంచుకొన వలసినవి (అ) కోశాగారము నందు జీతభత్యములు మున్నగు వానికి సరిపడు ధనము. (ఆ) ధాన్యాగారము నందు కోటదాటి వెళ్ళక్కరలేకుండా పరివారము, సైన్యము, ప్రజలు అందరికీ అవసరమైన ధాన్యము మున్నగు ఆహారపదార్థముల నిల్వలు. (ఇ) జలవనరులు అత్యవసర పరిస్థితులకును సరిపడు జలపూర్ణమైనవి అయిన సరోవరములు నూతులు మున్నగునవి. (ఈ) ఆయుధగారము నందు శత్రువులను ఎదుర్కొనుటకు వలసిన ఆయుధముల యుద్ధపరికరముల నిల్వలు. యంత్రాగారమున కోటగోడ పై భాగమున శత్రువులపై దాడి చేయుకు వలసిన సాధనములు పరికరములు, వాటి విడిభాగములు, ఆయుధములు తయారు చేయు యంత్రములు, తిరుగలి, రుబ్బురోలు, జలయంత్రము, నేతమగ్గములు మున్నగు కీలు పనిముట్లు. (ఉ) మానవ వనరులు వడ్రంగిలోనగువారు మఱియు విలుకాండ్రు మున్నగు వృత్తినిపుణులు. వడ్లంగిలోనగువాఁరు- వీరు ఐదుగురు, వడ్లంగి/ వడ్రంగి- కొయ్యపని వారు, సాలె- నేతపనివారు, మంగలి- క్షురకులు, చాకలి- బట్టలు శుభ్రపరచువారు, ముచ్చి- రంగులు వేయువారు. శబ్దరత్నాకరము. () బలసంగ్రహణములు విలుకాండ్రు, గజ, తురగ, రథ, పదాది సైనిక బలములు.

2.100.54.అనుష్టుప్.

ఆయస్తే విపులః కచ్చిత్
      కచ్చిదల్పతరో వ్యయః।
అపాత్రేషు న తే కచ్చిత్
      కోశో గచ్ఛతి రాఘవ
!

తాత్పర్యము :-
     
ఓ రఘువంశపు భరతుడా! నీ ఆదాయము అధికముగాను, వ్యయము మిక్కిలి తక్కువగాను ఉన్నవి కదా? నీ కోశాగారమునుండి అనర్హులకు ఇచ్చుట లేదు కదా? అనవసర వ్యయములు చేయుట లేదుకదా?

ప్రతిపదార్థము :-
      ఆయః
= ఆదాయము; తే = నీ; విపులః = అధికముగా ఉన్నది; కచ్చిత్ = కదా; కచ్చిత్ = కదా; అల్పతరః = మిక్కిలి తక్కువగ ఉన్నది; వ్యయః = వ్యయము; అపాత్రేషు = అనర్హులకు; = లేదు; తే = నీ; కచ్చిత్ = కదా; కోశః = కోశాగారమునుండి; గచ్ఛతి = పోవుట; రాఘవ = రఘువంశజ్ఞుడా.

*గమనిక :-

      ;అర్థశాస్త్ర సూత్రముల ప్రకారము ఆదాయముల కంటె వ్యయములు బాగా తక్కువ ఉండవలెను. అనవసర వ్యయములు జరుగ రాదు. మిగులు ధనములు భవిష్యత్కాల అవసరములకు, అత్యవసర సమయములలోని అవసరములకు, సంపదవృద్ధికిని దాచుకొనవలెను


శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: