Tuesday, July 16, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ 43-45

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]


2.100.43.అనుష్టుప్.

కచ్చిచ్చిత్యశతైర్జుష్టః

సునివిష్టజనాకులః।

దేవస్థానైః ప్రపాభిశ్చ

తటాకైశ్చోపశోభితః॥

తాత్పర్యము :- 

ఆ అయోధ్య వందలకొలది ప్రసిద్ధ యజ్ఞశాలలు, చక్కటి నివసించెడి ప్రజలు, దేవాలయములు, పానీయశాలలు, చెరువులతో ప్రకాశించుచుండెను

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = సంభావనమ్, సర్వశబ్దసంబేధిని, ప్రసిద్ద; చైత్యః = యజ్ఞశాలలు; శతైః = వందలకొలది; జుష్టః = కలది; సు = చక్కగా; నివిష్ట = నివసించెడి; జనాః = ప్రజలచే; ఆకులః = కిక్కిరిసి ఉన్నది; దేవస్థానైః = గుళ్ళు, దేవాలయమలు; ప్రపాభిః = పానీయశాలలూ; చ = మఱియు;  తటాకైః = చెరువులు; చ = మఱియు; ఉపశోభితః = ప్రకాశించునది.


2.100.44.అనుష్టుప్.

ప్రహృష్టనరనారీకః

సమాజోత్సవశోభితః।

సుకృష్టసీమా పశుమాన్

హింసాభిః పరివర్జితః॥

తాత్పర్యము :- 

మన కోసలరాజ్యంలోని స్త్రీపురుషులు పూర్తి తృప్తిగా జీవిస్తుంటారు. ఇక్కడ సామాజిక ఉత్సవాలు శోభిల్లుతుండును. పొలాలన్నీ చక్కగా దున్నబడితుండును. పశువులన్నీ కూడ శ్రేష్ఠమైనవి. హింసాకృత్యములు ఏమియును లేవు. 

ప్రతిపదార్థము :- 

ప్రహృష్ట = మిక్కిలి తృప్తిచెందిన; నరనారీకః = స్త్రీపురుషులు కలది; సమాజోత్సవ = సామాజిక ఉత్సవములతో; శోభితః = శోభిల్లుచున్నది; సు = మంచిగా; కృష్ట = దున్నబడిన; సీమా = పొలములు కలది; పశుమాన్ = శ్రేష్ఠమైన పశుసంపద కలది; హింసాభిః = హింసలచే; పరివర్జితః = విడువబడినది.


2.100.45.అనుష్టుప్.

అదేవమాతృకో రమ్యః

శ్వాపదైః పరివర్జితః।

పరిత్యక్తో భయైస్సర్వైః

ఖనిభిశ్చోపశోభితః॥

తాత్పర్యము :- 

మన కోసలరాజ్యము సమీపముననే సరయు జీవనది ఉండుటచే  వ్యవయాపనులకు దైవాధీనమైన వర్షముపై ఆధారపడనక్కరలేని నదీమాతృకము. ఇది మనోహరమైన దేశము. ఎట్టి క్రూరమృగాలూ లేవు. ఎట్టి భయాందోళనలు లేవు. గనులు సమృద్ధిగా ఉన్నవి

ప్రతిపదార్థము :- 

అదేవమాతృకః = వర్షాధారముకాని వ్యవసాయము సాగు దేశము, నదీమాతృకము; రమ్యః = మనోహరమైనది; శ్వాపదైః = క్రూరజంతువులచే; పరివర్జితః = విడువబడినది; పరిత్యక్తః = పూర్తిగా విడువబడిన; భయైః = భయములు కలది; సర్వైః = సమస్తమైన; ఖనిభి = గనులచే; చ = మఱియు; ఉపశోభితః = ప్రకాశింపజేయబడినది.


*గమనిక :-  

(1) దేవమాతృకము- వర్షము దైవాధీనమైనది కనుక. వాననీటితో సాగెడి వ్యవసాయము కల దేశము దేవమాతృకము, వర్షాధార వ్యవసాయము సాగు దేశము. (2) నదీమాతృకము- నదిలోని నీటితో సాగెడి వ్యవసాయము కలదేశము.

-----

శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: