Monday, July 22, 2024

-:వాల్మీకి తెలుగు రామాయణము:- -॥శతతమ సర్గః॥ - 61, 62, 63

 జైశ్రీరామ

-:వాల్మీకి తెలుగు రామాయణము:-

-॥శతతమ సర్గః॥

[శ్రీరాముడు భరతునికి నీతి బోధించుట]

2.100.61.అనుష్టుప్.

కచ్చిద్గురూంశ్చ వృద్ధాంశ్చ

తాపసాన్ దేవతాతిథీన్।

చైత్యాంశ్చ సర్వాన్సిధ్దార్థాన్

బ్రాహ్మణాంశ్చ నమస్యసి॥

తాత్పర్యము :- 

గురువులను, పెద్దలను, వృద్దులను, మునులను, దేవతలను, అతిథులను మఱియు దేవాలయము లన్నింటినీ ఇంకా కృతార్థులైన బ్రాహ్మణులను నమస్కరించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; గురూమ్ = గురువులను; చ = మఱియు; వృద్ధామ్ = పెద్దలను; చ = మఱియు; తాపసాన్ = మునులను; దేవతాః = దేవతలను; అతిథీన్ = అతిథులను; చైత్యామ్ = దేవాలయములు; చ = పాదపూరణము; సర్వాని = అన్నింటిని; సిధ్దార్థాన్ = కృతార్థులైన; బ్రాహ్మణామ్ = బ్రాహ్మణులను; చ = కూడ; నమస్యసి = నమస్కరించుచుంటివి.

2.100.62.అనుష్టుప్.

కచ్చిదర్థేన వా ధర్మమ్

అర్థం ధర్మేణ వా పునః।

ఉభౌ వా ప్రీతిలోభేన

కామేన చ న బాధసే॥

తాత్పర్యము :

ధర్మాచరణకు అగు (ఉదయము) సమయములలో ధనాది ప్రయోజనాలను అర్థము సంపాదించుట కొఱకు ధర్మమునకు లోపము చేయుట కాని, ధనార్జన చేయు (తదనంతర) సమయములలో ధర్మాచరణలో పడి అర్థము సంపాదించుటలో లోపము చేయుట కాని, సుఖించవలసిన (రాత్రి)  సమయములలో ధర్మాచరణ అర్థసంపాదనలలో పడి సుఖాభిలాష కామములను తీర్చుకొనుటలో లోపము చేయుటలేదు కదా? ధర్మార్థకామములను సమతూకములో నడుపుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చిత్ = కదా; అర్థేన = అర్థముచేత; వా = కాని; ధర్మమ్ = ధర్మము; అర్థమ్ = అర్థము; ధర్మేణ = ధర్మముచేత; వా = కాని; పునః = లేదా; ఉభౌ = రెంటిని; వా = కాని; ప్రీతి = సుఖమునందు; లోభేన = అత్యాశచే; కామేన = కామముచే; చ = మఱియు; న = లేదు; బాధసే = బాధించుట.

2.100.63.అనుష్టుప్.

కచ్చిదర్థం చ ధర్మం చ

కామం చ జయతాంవర!।

విభజ్య కాలే కాలజ్ఞ!

సర్వాన్వరద! సేవసే॥

తాత్పర్యము :- 

ఓ ఉత్తమజయశీలుడా! కాలజ్ఞుడా! కోరిన దానములు ఇచ్చువాడా! భరతుడా! ధర్మార్థకామములను అన్నింటినీ తగిన కాలములను తగువిధముగా విభజించుకొని సేవించుచుంటివి కదా?

ప్రతిపదార్థము :- 

కచ్చి = కదా; అర్థమ్ = అర్థము; చ = మఱియు; ధర్మమ్ = ధర్మము; చ = మఱియు; కామమ్ = కామము; చ = పాదపూరణము; జయతాంవర = జయశీలశ్రేష్ఠుడా; విభజ్య = విభజించుకొనుము; కాలే = కాలమును; కాలజ్ఞ = తగిన కాలముల గుఱించి ఎరిగినవాడ; సర్వాన్ = అన్నింటినీ; వరద = వరములను ఇచ్చువాడా; సేవసే = సేవించుచుంటివి.

*గమనిక :- 

;ధర్మార్థకామములకు సమయ విభజన- (అ)ధర్మాచరణకు ఉదయ కాలము అనుకూలము. (ఆ) తదనంతర సమయములలో అర్థ సంపాదనకు అనుకూలము. (ఇ) తదనంతరము సుఖించటకైన రాత్రి సమయము కామములు తీర్చుకొనుటకు అనుకూలము.

-----


శ్రీరామ రక్ష జగదభి రక్ష

No comments: