4-309-క.
జనకుని యాశీర్వచనము
లనయముఁ గైకొని ప్రమోదియై తత్పదముల్
దన ఫాలతలము సోఁకఁగ
వినతులు గావించి భక్తి విహ్వలుఁ డగుచున్.
4-310-తే.
అంత నా సజ్జనాగ్రణి యైన ధ్రువుఁడు
దల్లులకు భక్తి వినతులు దగ నొనర్చి
సురుచికిని మ్రొక్క నర్భకుఁ జూచి యెత్తి
నగు మొగంబున నాలింగనంబు చేసి.
4-311-సీ.
కరమొప్ప నానంద గద్గద స్వరమున;
జీవింపు మనుచు నాశీర్వదించె;
భగవంతుఁ డెవ్వనిపై మైత్రి పాటించు;
సత్కృపానిరతిఁ బ్రసన్నుఁ డగుచు
నతనికిఁ దమయంత ననుకూలమై యుండు;
సర్వభూతంబులు సమతఁ బేర్చి
మహిఁ దలపోయ నిమ్నప్రదేశములకు;
ననయంబుఁ జేరు తోయముల పగిది
4-311.1-తే.
గాన ఘను నమ్మహాత్ముని గారవించె
సురుచి పూర్వంబు దలఁపక సుజనచరిత!
విష్ణుభక్తులు ధరను బవిత్రు లగుట
వారి కలుగరు ధరణి నెవ్వారు మఱియు.
భావము:
తండ్రి దీవనలను అందుకొని ఆనందించి అతని పాదాలపై నుదురు మోపి భక్తి తన్మయుడై నమస్కరించాడు. సజ్జనులలో గొప్పవాడైన ఆ ధ్రువుడు తల్లులకు భక్తితో నమస్కరించాడు. సురుచి తనకు మ్రొక్కిన ధ్రువుణ్ణి లేవనెత్తి నవ్వుతూ అక్కున జేర్చుకొని ఆనందంతో వణుకుతున్న కంఠస్వరంతో “చిరంజీవ!” అని దీవించింది. పల్లమునకు నీళ్ళు ప్రవహించిన విధంగా భగవంతుని దయకు పాత్రుడైన వాని వద్దకు అందరూ తమంత తామే అనుకూల భావంతో చేరుకుంటారు. అందువల్లనే సురుచి గతాన్ని మరచిపోయి మహనీయుడైన ధ్రువుణ్ణి గౌరవించింది. నాయనా, విదురా! విష్ణుభక్తులు పరమపవిత్రులు. వారికి శత్రువులంటూ ఎవరూ ఉండరు. వారిపై ఎవ్వరూ కోపించరు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=12&padyam=311
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment