Wednesday, March 11, 2020

ధ్రువోపాఖ్యానము - 6

4-233-సీ.
"పరికింప నీ విశ్వపరిపాలనమునకై;
యర్థి గుణవ్యక్తుఁ డైనయట్టి
నారాయణుని పాదనళినముల్ సేవించి;
తగ బ్రహ్మ బ్రహ్మపదంబు నొందె;
ఘనుఁడు మీ తాత యా మనువు సర్వాంతర;
యామిత్వ మగు నేకమైన దృష్టిఁ
జేసి యాగముల యజించి తా భౌమ సు;
ఖములను దివ్యసుఖముల మోక్ష
4-233.1-తే.
సుఖములను బొందె నట్టి యచ్యుతునిఁ బరుని
వితత యోగీంద్ర నికర గవేష్యమాణ
చరణ సరసిజ యుగళు శశ్వత్ప్రకాశు
భక్తవత్సలు విశ్వసంపాద్యు హరిని.
4-234-వ.
మఱియును.
4-235-క.
కరతల గృహీత లీలాం
బురుహ యగుచుఁ బద్మగర్భముఖ గీర్వాణుల్
పరికింపం గల లక్ష్మీ
తరుణీమణిచేత వెదకఁ దగు పరమేశున్.

భావము:
“లోకాలను రక్షించడానికి సగుణస్వరూపాన్ని గ్రహించిన నారాయణుని పాదపద్మాలను ఆరాధించి బ్రహ్మదేవుడు బ్రహ్మపదాన్ని పొందాడు. నీ తాత అయిన స్వాయంభువ మనువు భగవంతుని సర్వాంతర్యామిత్వాన్ని గుర్తించి ఏకాగ్రతతో యజ్ఞాలను చేసి ఆ దేవదేవుని సేవించి ఇహలోక సుఖాలను, పరలోక సుఖాలను అనుభవించి పరమపదాన్ని పొందాడు. నాశం లేనివాడు, యోగీశ్వరులు అన్వేషించి ఆరాధించే పాదపద్మాలు కలవాడు, ఆయన అనంత కాంతిస్వరూపుడు, భక్తవత్సలుడు, విశ్వ సంసేవ్యుడు అయిన హరిని ఆశ్రయించు. ఇంకా బ్రహ్మ మొదలైన దేవతలు వెదకినా కనిపించని లక్ష్మీదేవి లీలాకమలాన్ని చేత ధరించి ఆ హరి కోసం వెదకుతూ ఉంటుంది. అటువంటి పరమేశ్వరుని ఆశ్రయించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=233

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

ధ్రువోపాఖ్యానము - 5

4-228-క.
"అనఘా! యీ దుఃఖమునకుఁ
బనిలే దన్యులకు సొలయ బలవంతంబై
తన పూర్వ జన్మ దుష్కృత
ఘనకర్మము వెంటనంటఁగా నెవ్వలనన్.
4-229-వ.
కావున.
4-230-క.
పెనిమిటి చేతను బెండ్లా
మని కాదు నికృష్టదాసి యనియును బిలువం
గను జాలని దుర్భగురా
లనఁగల నా కుక్షి నుదయ మందిన కతనన్.
4-231-క.
నిను నాడిన యా సురుచి వ
చనములు సత్యంబు లగును; సర్వశరణ్యుం
డనఁగల హరిచరణంబులు
గను జనకుని యంక మెక్కఁగాఁ దలఁతేనిన్.
4-232-వ.
కావునం బినతల్లి యైన యా సురుచి యాదేశంబున నధోక్షజు నాశ్రయింపుము" అని వెండియు నిట్లనియె.

భావము:
“నాయనా! మన దుఃఖానికి ఇతరులను అనవలసిన పని లేదు. పూర్వజన్మంలో చేసిన పాపం మానవులను వెంబడించి వస్తుంది. కనుక భర్తచేత భార్యగానే కాదు, దాసిగా కూడా పిలువబడని దురదృష్టవంతురాలినైన నా కడుపున పుట్టిన కారణంచేత నీకు అవమానం తప్పలేదు. నీ సవతి తల్లి సురుచి నీతో పలికిన మాటలు వాస్తవమే. నీకు తండ్రి ఒడిలో కూర్చోవాలనే ఆశ ఉన్నట్లయితే అందరికీ దిక్కు అయిన హరిపాదాలను ఆరాధించు. కనుక పినతల్లి ఐన ఆ సురిచి ఆజ్ఞను పాటించి విష్ణువును ఆశ్రయించు” అని తల్లి ఇంకా ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=232

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Tuesday, March 10, 2020

ధ్రువోపాఖ్యానము - 4

4-224-వ.
తొడలపై నిడుకొని.
4-225-క.
కర మనురక్తిని మోము ని
విరి తద్వృత్తాంత మెల్ల వెలఁదులు నంతః
పురవాసులుఁ జెప్పిన విని
పఱపుగ నిట్టూర్పు లెసఁగ బా ష్పాకుల యై.
4-226-తే.
సవతి యాడిన మాటలు సారెఁ దలఁచి
కొనుచుఁ బేర్చిన దుఃఖాగ్నిఁ గుందుచుండెఁ
దావపావక శిఖలచేఁ దగిలి కాంతి
వితతిఁ గందిన మాధవీలతికబోలె.
4-227-వ.
అంత నా సునీతి బాలునిం జూచి "తండ్రీ! దుఃఖింపకు" మని యిట్లనియె.

భావము:
తన తొడలపై కూర్చుండబెట్టుకొని ఎంతో గారాబంతో కొడుకు ముఖాన్ని నిమిరి, జరిగిన వృత్తాంతం అంతఃపుర కాంతలు చెప్పగా విని, నిట్టూర్పులు విడుస్తూ, కన్నీరు కార్చుతూ సవతి అయిన సురుచి తన కొడుకును అన్న మాటలను మాటిమాటికీ తలచుకొంటూ కార్చిచ్చు మంటల వేడికి కంది కళతప్పిన మాధవీలతలాగా శోకాగ్నితో కుమిలిపోయింది. అప్పుడు ఆ సునీతి తన కొడుకును చూచి “తండ్రీ! దుఃఖించకు” అంటూ ఇలా అన్నది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=225

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

ధ్రువోపాఖ్యానము - 3


4-220-క.
అదిగాన నీ వధోక్షజు
పదపద్మము లాశ్రయింపు; పాయక హరి నా
యుదరమునఁ బుట్టఁ జేయును,
వదలక యట్లయిన ముదము వఱలెడి నీకున్."
4-221-క.
అని యీ రీతి నసహ్యవ
చనములు పినతల్లి యపుడు జనకుఁడు వినగాఁ
దను నాడిన దుర్భాషా
ఘనశరములు మనము నాఁటి కాఱియపెట్టన్.
4-222-క.
తను నట్లుపేక్ష చేసిన
జనకునికడఁ బాసి దుఃఖ జలనిధిలోనన్
మునుఁగుచును దండతాడిత
ఘనభుజగముఁబోలె రోషకలితుం డగుచున్,
4-223-క.
ఘన రోదనంబు చేయుచుఁ
గనుఁగవలను శోకబాష్ప కణములు దొరఁగన్
జనని కడ కేగుటయు నిజ
తనయునిఁ గని యా సునీతి దద్దయుఁ బ్రేమన్.

భావము:
కనుక ధ్రువకుమారా! నీవు విష్ణుదేవుని పాదపద్మాలను ఆశ్రయించు. ఆయన నిన్ను నా కడుపున పుట్టేటట్లు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది.” అని ఈ విధంగా తండ్రి వింటూ ఉండగా పినతల్లి సురుచి పలికిన వాక్యాలను ధ్రువుడు సహించలేకపోయాడు. ఆమె నిందావాక్యాలు బాణాలవలె అతని మనస్సులో నాటుకొని పీడించగా ఆ విధంగా తనను నిర్లక్ష్యం చేసిన తండ్రి దగ్గరనుండి దెబ్బ తిన్న పాములాగా రోషంతో, పట్టరాని దుఃఖంతో ధ్రువుడు తల్లి వద్దకు వచ్చాడు. బిగ్గరగా ఏడుస్తూ, కన్నులనుండి దుఃఖబాష్పాలు రాలుతూ ఉండగా కన్నతల్లిని సమీపించగా సునీతి కన్నకొడుకును చూచి మిక్కిలి ప్రేమతో....

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=222

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Saturday, March 7, 2020

ధ్రువోపాఖ్యానము - 2

4-219-సీ.
ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు;
నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న
కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడుకొని;
యుపలాలనము చేయుచున్న వేళ
నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన;
ధ్రువునిఁ గనుంగొని తివక నాద
రింపకుండుటకు గర్వించి యా సురుచియు;
సవతి బిడ్డండైన ధ్రువునిఁ జూచి
4-219.1-తే.
"తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ
బూని నా గర్భమున నాఁడె పుట్ట కన్య
గర్భమునఁ బుట్టి కోరినఁ గలదె నేఁడు
జనకు తొడ నెక్కు భాగ్యంబు సవతి కొడుక!

భావము:
ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు.కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది?

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=219

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

Thursday, March 5, 2020

ధ్రువోపాఖ్యానము - 1


4-216-క.
"విను నిఖిలభువన పరిపా
లనమునకై చంద్రధరకళా కలితుండై
వనజజునకు స్వాయంభువ
మను వపు డుదయించెఁ గీర్తిమంతుం డగుచున్.
4-217-తే.
రూఢి నమ్మనునకు శతరూపవలన
భూనుతు లగు ప్రియవ్రతోత్తానపాదు
లనఁగ నిద్దఱు పుత్రులై రందులోనఁ
భవ్య చారిత్రుఁ డుత్తానపాదునకును.
4-218-క.
వినుము సునీతియు సురుచియు
నను భార్యలు గలరు; వారి యందును ధ్రువునిం
గనిన సునీతియు నప్రియ
యును, సురుచియుఁ బ్రియయు నగుచు నున్నట్టి యెడన్.

భావము:
“విదురా! విను. స్వాయంభువ మనువు అనే కీర్తిమంతుడు సకల లోకాలను పాలించడానికి ఈశ్వరుని అంశతో బ్రహ్మదేవునికి జన్మించాడు. ఆ స్వాయంభువ మనువుకు శతరూప అనే భార్యవల్ల ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే ఇద్దరు కొడుకులు కలిగారు. వారిలో ఉత్తానపాదునికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలున్నారు. వారిలో ధ్రువుడు అనే కొడుకును కన్న సునీతిపై రాజుకు ప్రీతి లేదు. సురుచి అంటే రాజుకు మిక్కిలి మక్కువ. ఇలా ఉండగా...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=218

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

Sunday, March 1, 2020

దక్ష యాగము - 49

(శివుడనుగ్రహించుట )

4-162-వ.
అని యిట్లు రుద్రక్షమాపణంబు గావించి పద్మసంభవుచేత ననుజ్ఞాతుండై దక్షుం డుపాధ్యాయ ఋత్విగ్గణ సమేతుం డగుచుఁ గ్రతుకర్మంబు నిర్వర్తించు సమయంబున, బ్రాహ్మణజనంబులు యజ్ఞంబులు నిర్విఘ్నంబులై సాగుటకుఁ బ్రమథాది వీర సంసర్గ కృత దోష నివృత్త్యర్థంబుగా విష్ణుదేవతాకంబును ద్రికపాలపురోడాశ ద్రవ్యకంబును నైన కర్మంబుఁ గావింప నధ్వర్యుకృత్య ప్రవిష్టుం డగు భృగువు తోడం గూడి నిర్మలాంతఃకరణుం డగుచు దక్షుఁడు ద్రవ్యత్యాగంబుఁ గావింపఁ బ్రసన్నుండై సర్వేశ్వరుండు.
4-163-సీ.
మానిత శ్యామాయమాన శరీర దీ;
ధితులు నల్దిక్కుల దీటుకొనఁగఁ
గాంచన మేఖలా కాంతులతోడఁ గౌ;
శేయ చేలద్యుతుల్ చెలిమి చేయ
లక్ష్మీసమాయుక్త లలిత వక్షంబున;
వైజయంతీ ప్రభల్ వన్నెచూప
హాటకరత్న కిరీట కోటిప్రభల్;
బాలార్క రుచులతో మేలమాడ
4-163.1-తే.
లలితనీలాభ్రరుచిఁ గుంతలములు దనరఁ
బ్రవిమలాత్మీయ దేహజప్రభ సరోజ
భవ భవామర ముఖ్యుల ప్రభలు మాప
నఖిలలోకైక గురుఁడు నారాయణుండు.

భావము:
అని ఈ విధంగా దక్షుడు క్షమింపుమని రుద్రుణ్ణి వేడుకున్నాడు. తరువాత బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించగా ఉపాధ్యాయులతోను, ఋత్విక్కులతోను కూడి యజ్ఞం చేయడం ప్రారంభించాడు. అప్పుడు బ్రాహ్మణులు యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగడానికి, ప్రమథ వీరుల సంబంధంవల్ల కలిగిన దోషం నివారించడానికి విష్ణుమూర్తి దేవతగా కలిగినదీ, పురోడాశ ద్రవ్యం కలిగినదీ అయిన కర్మను నిర్వర్తించారు. అధ్వర్యుకార్యాన్ని స్వీకరించిన భృగువుతో కూడి నిర్మలమైన మనస్సు కలవాడై దక్షుడు ద్రవ్యత్యాగం చేసాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు అనుగ్రహించి సాక్షాత్కరించాడు. నల్లని మేని కాంతులు నాలుగు దిక్కుల్లో వ్యాపిస్తుండగా, బంగారు మొలత్రాడు కాంతులతో పట్టుబట్టల కాంతులు కలిసిపోగా, లక్ష్మికి కాపురమైన వక్షఃస్థలంపై వైజయంతీమాల కాంతులను ప్రసరిస్తుండగా, రత్నాలు పొదిగిన బంగారు కిరీటం కాంతులు బాలసూర్యుని వెలుగులతో అతిశయించగా, శిరోజాలు నీలమేఘ కాంతులతో ఒప్పుతుండగా, తన దేహంనుండి వెలువడే దివ్యకాంతులు బ్రహ్మ, శివుడు మొదలైన దేవతాశ్రేష్ఠుల దేహకాంతులను క్రిందుపరుస్తూ సమస్త లోకాలకు గురువైన నారాయణుడు సాక్షాత్కరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=8&padyam=163

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :