4-219-సీ.
ఒకనాఁడు సుఖలీల నుత్తానపాదుండు;
నెఱిఁ బ్రియురాలైన సురుచి గన్న
కొడుకు నుత్తముఁ దన తొడలపై నిడుకొని;
యుపలాలనము చేయుచున్న వేళ
నర్థిఁ దదారోహణాపేక్షితుం డైన;
ధ్రువునిఁ గనుంగొని తివక నాద
రింపకుండుటకు గర్వించి యా సురుచియు;
సవతి బిడ్డండైన ధ్రువునిఁ జూచి
4-219.1-తే.
"తండ్రి తొడ నెక్కు వేడుక దగిలెనేనిఁ
బూని నా గర్భమున నాఁడె పుట్ట కన్య
గర్భమునఁ బుట్టి కోరినఁ గలదె నేఁడు
జనకు తొడ నెక్కు భాగ్యంబు సవతి కొడుక!
భావము:
ఒకనాడు ఉత్తానపాదుడు సురుచి కొడుకైన ఉత్తముణ్ణి ఆనందంగా తన తొడలపై కూర్చుండబెట్టుకొని ముద్దు చేస్తుండగా ధ్రువుడు తానుకూడ తన తండ్రి తొడలపైకి ఎక్కటానికి ఉబలాటపడ్డాడు.కాని ఉత్తానపాదుడు ధ్రువుని దగ్గరకు తీసుకోలేదు. ఆప్యాయంగా ఆదరించలేదు. అందుకు సురుచి గర్వించి, సవతి కొడుకైన ధ్రువుణ్ణి చూచి ఇలా అన్నది. “నా కడుపున పుట్టినవాడే తండ్రితొడ ఎక్కటానికి అర్హుడు. మరొక స్త్రీ గర్భాన పుట్టిన నీకు తండ్రి తొడ ఎక్కే అదృష్టం ఎలా కలుగుతుంది?
http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=10&padyam=219
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment