8-407-సీ.
నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుఁడు దక్క;
నెవ్వఁడు నా మాయ నెఱుఁగ నేర్చు?
మానిని యైన నా మాయచే మునుఁగక;
ధృతి మోహితుండవై తెలిసి తీవు
కాలరూపంబునఁ గాలంబుతోడ నా;
యందును నీ మాయ యధివసించు
నీ మాయ నన్ను
జయింప నేరదు నిజ;
మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య
8-407.1-తే.
మిపుడు నీ నిష్ఠ పెంపున నెఱిఁగి తనుచు
సత్కరించిన సఖ్యంబు చాల నెఱిపి
దక్షతనయ గణంబులుఁ దన్నుఁ గొలువ
భవుఁడు విచ్చేసెఁదగ నిజ భవనమునకు.
టీకా:
నిఖిల = సమస్తమైన;
దేవ = దేవుళ్ళలోను;
ఉత్తమ = ఉత్తముడా;
నీవు = నీవు;
ఒక్కరుండున్ = ఒక్కడివి;
తక్కన్ = తప్పించి;
ఎవ్వడున్ = ఎవడు;
నా = నా యొక్క;
మాయన్ = మాయను;
ఎఱుగన్ =
తెలిసికొన; నేర్చున్ = కలుగును,
లేరు; మానిని = స్త్రీరూపిని;
ఐన = అయినట్టి;
నా = నా యొక్క; మాయ = మాయ; చేన్ = వలన;
మునుగక = మోసపోకుండగ;
ధృతిన్ = ధైర్యముగా;
మోహితుండవు = మోహింపబడినవాడవు;
ఐ = అయ్యి; తెలిసిచి = తెలిసికొంటివి;
ఈవు =
నీవు; కాల = కాలము యొక్క;
రూపంబునన్ = రూపముతో;
కాలంబు = కాలము;
తోడన్ = తోటి;
నా = నా; అందును = లో;
నీ = నీ యొక్క;
మాయ = మాయ; అధివసించున్ = చేరియుండును;
నీ = నీ యొక్క; మాయ = మాయ; నన్నున్ = నన్ను;
జయింపన్ = గెలువ;
నేరదు = చాలదు;
నిజము = ఇది సత్యము;
అకృతాత్ముల్ = అల్పజ్ఞుల;
కున్ = కు; ఎల్లన్ = అందరకు;
ఉపలభ్యము =
అందనిది; ఇపుడు = ఇప్పుడు;
నీ = నీ యొక్క;
నిష్ఠన్ = నేర్పు యొక్క;
పెంపునన్ = అధిక్యముచేత;
ఎఱిగితి = తెలుసుకొంటివి;
అనుచున్ = అనుచు;
సత్కరించిన = గౌరవింపగా;
సఖ్యంబున్ = స్నేహమును;
చాలన్ =
అధికముగా; నెఱిపి = సాగించి;
దక్షతనయ = పార్వతీదేవి;
గణంబులున్ = ప్రమథగణములు;
తన్నున్ = తనను;
కొలువన్ = సేవించుతుండగ;
భవుడు = పరమేశ్వరుడు;
విచ్చేసెన్ =
వెళ్లెను; తగన్ = చక్కగ;
నిజ = తన; భవనమున్ = నివాసమున;
కు = కు.
భావము:
“ఓ మహాదేవా! నీవు ఒక్కడవి తప్ప మరింకెవడూ
నామాయను తెలుసుకోలేడు. మోహినిగా మారిన నామాయలో పడి మోసపోకుండా ధైర్యంతో పొరపాటు
తెలుసుకొని మేలుకొన్నావు. కాలంతో కలిసి నీమాయ నాలో చేరింది. ఈమాయ నన్ను
గెలువజాలదు. అల్పజ్ఞులు తెలుసుకోలేని నామాయను నీవు ఇప్పుడు నేర్పుతో
తెలుసుకున్నావు.” అంటూ విష్ణువు శివుడిని
గౌరవించాడు. విష్ణువు పట్ల తన స్నేహాన్ని ప్రకటించి, పరమేశ్వరుడు సతీదేవితో ప్రమథగణాల
సేవలు అందుకుంటూ తన నివాసానికి వెళ్ళాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment