8-385-సీ.
"దేవ! జగన్మయ! దేవేశ! జగదీశ! ;
కాలజగద్వ్యాపకస్వరూప!
యఖిల భావములకు నాత్మయు హేతువు;
నైన యీశ్వరుఁడ వాద్యంతములకు
మధ్యంబు బహియును మఱి లోపలయు లేక;
పూర్ణమై యమృతమై భూరిసత్య
మానంద చిన్మాత్ర మవికార మాద్య మ;
నన్య మశోకంబు నగుణ మఖిల
8-385.1-తే.
సంభవస్థితిలయముల దంభకంబు
నైన బ్రహ్మంబు నీవ; నీ యంఘ్రియుగము
నుభయ సంగ విసృష్టులై యున్నమునులు
గోరి కైవల్యకాములై కొల్తు రెపుడు.
టీకా:
దేవ = విష్ణుమూర్తి;
జగన్మయ = విష్ణుమూర్తి;
దేవేశ = విష్ణుమూర్తి;
జగదీశ = విష్ణుమూర్తి;
కాలజగద్వ్యాపకస్వరూప = విష్ణుమూర్తి;
అఖిల = సమస్తమైన;
భావముల్ = భావింగల
వస్తువుల; కున్ = కు; ఆత్మయున్ = అంతర్వాపివి;
హేతువున్ = కారణభూతుడవు;
ఐన =
అయిన; ఈశ్వరుడవు = భగవంతుడవు;
ఆది = మొదలు;
అంతముల్ = తుదిల;
కున్ = కు; మధ్యంబున్ = మధ్యభాగమున;
బహియును = వెలుపల;
మఱి = ఇంకను;
లోపలయున్ = లోపల
యనునవి; లేక = లేకుండగ;
పూర్ణము = అంతయుతానైనవాడవు;
ఐ = అయ్యి; అమృతము =
నాశములేనివాడవు;
ఐ = అయ్యి; భూరి = అత్యధికమైన;
సత్యము = సత్యస్వరూపము;
ఆనంద =
ఆనందస్వరూపము;
చిన్మాత్రము = చిద్రూపుడవు;
అవికారము = మార్పులేనివాడవు;
ఆద్యమున్ = మూలవస్తువవు;
అనన్యమున్ = సాటిలేనివాడవు;
అగుణము = గుణాతీతుడవు;
అఖిల =
సమస్తమైన;
సంభవ = సృష్టి;
స్థితి = స్థితి;
లయముల = లయములనెడి;
దంభకంబున్ = మాయకుకారణమవు;
ఐన = అయిన; బ్రహ్మంబున్ = పరబ్రహ్మమవు;
నీవ = నీవే;
నీ = నీ యొక్క;
అంఘిరి = పాదముల;
యుగమున్ = జంటను;
ఉభయ = పర అపరములురెంటి;
సంగ = తగులములను;
విసృష్టులు =
విడిచినవారు;
ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి;
మునులు = మునులు;
కోరి = యత్నించి;
కైవల్య = మోక్షమును;
కాములు = కోరువారు;
ఐ = అయ్యి; కొల్తురు = సేవించెదరు;
ఎపుడుని = ఎల్లప్పుడు.
భావము:
దేవదేవా! వాసుదేవా! జగదీశ్వరా! ఎల్లప్పుడూ సర్వ లోకాలలో నిండి
ఉండేవాడవు. సమస్త వస్తువులకూ కారణ భూతుడవు అయిన ప్రభువు
నీవే. ఆదిమధ్యాంతాలు లేకుండా, లోపలా వెలుపలా.అంతటా నిండినవాడవు నీవు. పరిపూర్ణమైన సత్యం నీవు. ఆనందంతో కూడిన జ్ఞానం నీవు. మార్పులేని మూలవస్తువు నీవు. సాటిలేనివాడవు నీవు. దుఃఖదూరుడవు నీవు.
గుణాతీతుడవు నీవు. అన్నింటి పుట్టుటకూ మనుగడకూ నాశనానికి
కారణం నీవు. మాయతో కూడిన పరమాత్మవు నీవు. మోక్షాన్ని
కోరేవారు స్వార్దాన్ని అహంకారాన్ని విడిచి ఎల్లప్పుడూ నీ పాదాలను సేవిస్తారు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment