8-396-వ.
అని
మఱియుం జెఱకువిలుతుని మెఱవడిఁ దరపిన నెఱబిరుదు వెఱంగుపడం దెఱవ దుఱిమికొనిన తుఱుము బిగిముడి వదలి కదలి భుజముల మెడల నొడల నదరి చెదరిన కురులు నొసలి
మృగమద తిలకంపుటసలు మసల, విసవిస నగుమొగము మెఱుంగులు దశదిశలం బసలు కొలుపఁ, జిఱునగవు మెఱయ,
నునుఁ
జెమటం దడంబడి పులకరములు గులకరములు గొన,
హృదయానందకందం
బగు కందుకంబు గరారవిందంబునం దమర్చి, యక్కునం జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలంబులం గనక మణి వలయంబులు ఝణఝణ యనం గుచకలశంబు లొండొంటి నొరయ,
నెడమఁ
గుడిం దడంబడఁ గ్రమ్మన నెగురఁ
జిమ్ముచు, నెగురఁ జిమ్మి తనకుఁదానె కొన్ని చిన్నపన్నిదంబులు చేసికొని బడుగు నడుము బెడఁకి వడవడ వడంక నఱితి సరులుఁ గలయంబడఁ దిరుగుచు, తిరుఁగు నెడఁ బెనఁకువలుగొనఁ జెవుల తొడవుల రుచులు గటముల
నటనములు సలుపఁ బవిరి తిరిగి యొడియుచు,
నొడిచి
కెలంకులన్ జడియుచు, జడిసి జడను పడక వలువ నెలవు వదలి దిగంబడం, గటిస్థలంబునఁ గాంచీ కనకమణి కింకిణులు మొరయఁ జరణకటకమ్ములు గల్లుగల్లుమనం, గరకంకణమణి గణములు మెఱయ మితితప్పిన మోహాతిరేకం బుప్పొంగ వెనుకొని యుఱుకి పట్టుచుఁ, బట్టి పుడమిం బడవైచి, పాటు వెంటన మింటికెగసి గెంటక కరంబునం గరంబు దిరంబయి పలుమఱు నెగయ నడుచుచు,
నెగయు
నెడం దిగంబడు తఱిని నీలంపు మెఱుంగు
నిగ్గుసోగ
పగ్గంబుల వలలువైచి రాఁ దిగిచిన పగిది వెనుకొనంగ,
విలోకన
జాలంబులు నిగిడించుచు, మగిడించుచుఁ గరలాఘవంబున నొకటి,
పది, నూఱు, వేయి చేసి నేర్పులు వాటించుచు, నరుణ చరణకమల రుచుల నుదయ శిఖరి శిఖర తరణి
కరణి చేయుచు, ముఖచంద్ర చంద్రికలఁ జంద్రమండలంబులు గావించుచు,
నెడనెడ
నురోజ దుర్గ నిర్గత చేలాంచలంబు జక్క
నొత్తుచుం, గపోలఫల కాలోల ఘర్మ జలబిందు బృందంబుల నఖాంకురంబుల నోసరించుచు, అరుణాధరబింబఫల భ్రాంత సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్తమధుపంబుల
నివారించుచు, మందగమనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాస వీక్షణా నందిత మయూర మిథునంబులకు
నెడగలుగుచుఁ, బొదరిండ్ల యీఱములకుం బోక మలంగుచు, కరకిసలయాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమగుచు, దీఁగ యుయ్యెలల నూగుఁచు, మాధవీ మండపంబు లెక్కుచుఁ, గుసుమరేణు పటలంబుల గుబ్బళ్ళు ప్రాకుచు
మకరందస్యంద బిందుబృందంబు నుత్తరించుచుఁ, గృతక శైలం బుల నారోహించుచుఁ,
బల్లవ
పీఠంబులం బథిశ్రమంబు పుచ్చుచు, లతాసౌధభాగంబులఁ బొడచూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుఁ, బుష్పదళఖచిత వాతాయనంబులం దొంగిచూచుచుఁ, గమలకాండపాలికల నాలంబించుచుఁ,
జంపక
గేహళీ మధ్యంబుల నిలువంబడుచుఁ, గదళికాపత్ర కవాటంబుల నుద్ఘాటించుచుఁ, బరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల నాదరించుచు, మణికుట్టిమంబుల మురియుచుఁ, జంద్రకాంత వేదికల నొలయుచు, రత్నపంజర శారికానివహంబులకుం జదువులు
చెప్పుచుఁ, గోరిన క్రియంజూచుచు చూచిన క్రియ మెచ్చుచు,
మెచ్చిన
క్రియ వెఱఁగుపడుచు, వెఱఁగుపడిన క్రియ మఱచుచు, మఱవక యేకాంతం బగు నవ్వనాంతం బున ననంత
విభ్రమంబుల జగన్మోహినియై విహరించుచు నున్న సమయంబున.
టీకా:
అని = అని;
మఱియున్ = ఇంకను; చెఱకువిలుతుని = మన్మథుని;
మెఱవడిన్ = ఉద్రేకముతో;
తరపిన = హరించిన;
నెఱ = నిండు;
బిఱుదు = నిబ్బరము;
వెఱగుపడన్ = నీరైపోగా;
తెఱవ = స్త్రీ;
తుఱిమికొనిని = ముడుచుకొన్నట్టి;
తుఱుము = కొప్పుగ;
బిగి = బిగించిన;
ముడి =
ముడి; వదలి = విడిపోయి;
కదలి = జారిపోయి;
భుజముల = భుజములపైన;
మెడలన్ = మెడపైన;
ఒడలన్ = దేహముపైన;
అదరి = పడి;
చెదరిన = చెదిరిపోయిన;
కురులు = శిరోజములు;
నొసలి = నుదుటి; మృగమద = కస్తూరి;
తిలకంపు = తిలకము;
టసలు = బొట్టు;
మసలన్ = కరిగిపోవ;
విసవిసన్ = ప్రసరించిన;
నగు = నవ్వు;
మొగము = మొహము యొక్క;
మెఱుంగులు =
మెరుపులు; దశదిశలన్ = పదిదిక్కులను;
పసలుకొలుపన్ = ముసురుకొనగ;
చిఱునగవు =
చిరునవ్వు; మెఱయన్ = మెరుస్తుండగ;
నునున్ = లేత;
చెమటన్ = చెమటతో;
తడబడి =
తొట్రుపడి; పులకరములు = గగుర్పాటులు;
కులరకములుగొన = గుంపుగూడగ;
హృదయ = మనసునకు;
ఆనంద = సంతోషము;
కందంబు = కలిగించునది;
అగు = అయిన;
కందుకంబున్ = బంతిని;
కర =
చేతులు యనెడి;
అరవిందంబునన్ = పద్మము;
అందున్ = లో;
అమర్చి = అందుకొని;
అక్కునన్ = ఎదకు; చేర్చి = హత్తుకొని;
చెక్కున = చెక్కిళ్ళపై;
హత్తించి = చేర్చుకొని;
చుబుకంబున్ = గడ్డమును;
మోపి = ఆన్చి;
చూచుకంబులన్ = చనుమొనలపై;
కదియించి =
ఆనించికొని;
నఖంబులన్ = గోర్లతో;
మీటుచున్ = ఆడించుచు;
మెల్లమెల్లన =
అతిమెల్లగా;
కెల్లాడు = కదలెడు;
కర = చేతులు యనెడి;
కమలంబులన్ = పద్మములచేత;
కనక = బంగారపు; మణివలయములు = రత్నాలగాజులు;
ఝణఝణ = ఝణ ఝణ;
అనన్ = అనుచుండ;
కుచ =
స్తనములు యనెడి;
కలశంబులు = కుంభములు;
ఒండొంటి = ఒకదానినోకటి;
ఒరయన్ =
ఒరుసుకొనుచుండగ;
ఎడమ = ఎడమపక్క;
కుడిన్ = కుడుపక్కలకు;
తడంబడన్ =
తుళ్ళిపడునట్లుగ;
క్రమ్మనన్ = క్రమముగా;
ఎగురన్ = ఎగుర;
చిమ్ముచున్ = వేయుచు;
ఇగురన్ = ఎగుర;
చిమ్మి = వేసి;
తన = తన; కున్ = కు; తానె = తానే;
కొన్ని =
కొన్ని; చిన్న = చిన్నిచిన్ని;
పన్నిదంబులున్ = పందెములను;
చేసికొని =
పెట్టుకొని;
బడుగు = సన్నని;
నడుము = నడుము;
బెడకి = విలసించి;
వడవడ = వడవడ యని;
వడంకన్ = వణకునట్లుగ;
అఱితిసరులు = కంఠహారములు;
కలయన్ = చిక్కు;
పడన్ = పడునట్లుగ;
తిరుగుచున్ = తిరుగాడుచు;
తిరుగున్ = తిరిగెడి;
ఎడన్ = సమయమునందు;
పెనకువలుగొనన్
= మెలికలుతిరుగుచుండగ;
చెవుల = కర్ణ;
తొడవుల = ఆభరణముల;
రుచులు = కాంతులు;
గటముల = చెక్కిళ్ళపై;
నటనములు = చిందులు;
సలుపన్ = ఆడగా;
బవిరి = గుండ్రముగా;
తిరిగి =
తిరుగుచు; ఒడియుచున్ = పట్టుకొనుచు;
ఒడిచి = పట్టుకొని;
కెలంకులన్ = పక్కలకు;
జడియుచున్ = కదులుచు;
జడిసి = కదిలి;
జడనుపడక = ఆగక;
వలువ = పైబట్ట;
నెలవు =
స్థాన; వదలి = భ్రంశమై;
దిగంబడన్ = జారిపొగా;
కటిస్థలంబునన్ = మొలప్రాంతపు;
కాంచీ = వడ్డాణపు;
కనక = బంగారు;
మణి = రత్నాల;
కింకిణులు = చిరుగంటలు;
మొరయన్ =
మోగగా; చరణ = కాలి;
కటకమ్ములు = అందెలు;
గల్లుగల్లుమనగా = గల్లుగల్లుమనగా;
కర =
చేతుల; కంకణ = గాజుల;
మణి = రత్నాల;
గణములు = సమూహములు;
మెఱయన్ = మెరుస్తుండగా;
మితితప్పిన = మితిమీరిన;
మోహా = మోహముయొక్క;
అతిరేకంబునన్ = అతిశయము;
ఉప్పొంగన్ = విజృంభించగా;
వెనుకొని = వెనువెంట;
ఉఱికి = పరుగెట్టి;
పట్టుచున్ =
పట్టుకొనుచు;
పట్టి = పట్టుకొని;
పుడమిన్ = నేలపై;
పడవైచి = పడేసి;
పాటు =
పడిగెంతుటతో;
వెంటన = వెనుకనే;
మింటి = ఆకాశమున;
కున్ = కు; ఎగసి = ఎగిరి;
గెంటక = విడువక; కరంబునన్ = చేతిలో;
కరంబు = చేయి;
తిరంబయి = కలిపుంచి;
పలు = అనేక;
మఱున్ = సార్లు;
ఎగయన్ = ఎగుర;
నడచుచున్ = వేయుచు;
ఎగయున్ = ఎగిరెడి;
ఎడన్ =
సమయమునందు; దిగంబడు = కిందకుబడెడి;
తఱిన్ = సమయమునందు;
నీలంపు = నల్లని;
మెఱంగు = మెరుస్తున్న;
నిగ్గు = కాంతుల;
సోగ = పొడవైన;
పగ్గంబుల = తాళ్లుగల;
వలలు =
వలలను; వైచి = వేసి;
రాదిగిచిన = లాగుతున్న;
పగిదిన్ = విధముగా;
వెనుకొనంగ =
వెంటాడెడి; విలోకన = చూపుల;
జాలంబులు = వలలను;
నిగిడించుచున్ = సారించుచు;
మగిడించుచు = తిప్పుచు;
కర = చేతుల;
లాఘవంబునన్ = నేర్పులతో;
ఒకటి = ఒకటి (1);
పది = పది (10);
నూఱు = వంద (100);
వేయి = వెయ్యి (1,000);
చేసి = లెక్కించుచు;
నేర్పులు = నేర్పరితనములు;
వాటించుచున్ = వాటముగజూపుచు;
అరుణ = ఎర్రని;
చరణ =
చేతులు యనెడి;
కమల = పద్మముల;
రుచులను = కాంతులతో;
ఉదయ = తూర్పు;
శిఖరి = కొండ;
శిఖర = కొనగల;
తరణి = సూర్యబింబము;
కరణి = వలె;
చేయుచున్ = స్పురింపజేయుచు;
ముఖ = మోము యనెడి;
చంద్ర = చంద్రుని;
చంద్రికలన్ = వెన్నెలలతో;
చంద్ర = చంద్ర;
మండలంబులున్ = బింబములను;
కావించుచున్ = సృజించుచు;
ఎడనెడన్ = అప్పుడప్పుడు;
ఉరోజ = కుచముల;
దుర్గ = మిట్టపల్లములనుండి;
నిర్గత = జారిపోయిన;
చేలాంచలంబు =
పైటను; చక్కనొత్తుచున్ = సవరించుకొనుచు;
కపోలఫలక = చెక్కిళ్ళపై;
ఆలోల =
చిందుతున్; ఘర్మ = చెమట;
జల = నీటి; బిందు = చుక్కల;
బృందంబులన్ = సమూహములను;
నఖ = గోళ్ళ; అంకురంబులన్ = కొనలతో;
ఓసరించుచు = తొలగించుచు;
అరుణ = ఎర్రని;
అధర =
పెదవులు యనెడి;
బింబ = దొండ;
ఫల = పండ్లనెడి;
భ్రాంత = భ్రమతో;
సమాగత = వచ్చిన;
రాజకీరంబులన్ = రామచిలుకలను;
చోపుచున్ = తోలుచు;
ముఖ = మోము యనెడి;
సరోజ =
పద్మముల; పరిమళ = సువాసనలచే;
ఆసక్త = ఆశగొన్న;
మత్త = మత్తెక్కిన;
మదుపంబులన్ =
తుమ్మెదలను;
నివారించుచున్ = అదలించుచు;
మంద = మెల్లగా;
గమన = నడచుటను;
అభ్యాస =
నేర్చుకొనెడి;
కుతూహల = కుతూహలముతో;
ఆయత్త = వచ్చిన;
మరాళ = రాయంచల;
యుగ్మంబుల్
= జంటల (2); కున్ = కు; తలంగుచున్ = తప్పించుచు;
విలాస = సొగసైన;
వీక్షణ =
చూపులచేత; ఆనందిత = ముచ్చటపడిన;
మయూర = నెమళ్ళ;
మిథునంబుల్ = జంటల (2);
కున్ =
కు; ఎడన్ = దూరముగ;
కలుగుచున్ = అగుచు;
పొదరిండ్లన్ = పొదరిళ్ళలో;
ఈఱముల్ =
జొంపముల; కున్ = కు; పోక = దరిచేరకుండ;
మలంగుచున్ = తప్పుకొనుచు;
కర = చేతులు
యనెడి; కిసలయ = చిగుళ్ళను;
ఆస్వాద = తినుటకు;
కాముక = మనసుపడెడి;
కలకంఠ =
కోయిలల; దంపతుల్ = జంటల (2);
కున్ = కు; దూరము = దూరముగ;
అగుచున్ = జరుగుచు;
తీగ = తీవల; ఉయ్యెలలన్ = ఉయ్యాలలపై;
ఊగుచున్ = ఊగుతు;
మాధవీ = పూలగురువింద;
మండపంబులన్ = గుబుర్లను;
ఎక్కుచున్ = ఎక్కుతు;
కుసుమ = పూల;
రేణు =
పుప్పొడిరేణువుల;
పటలంబుల = సమూహములందు;
గుబ్బళ్ళు = గుట్టలపై;
ప్రాకుచున్ =
జరుగుచు; మకరంద = పూతేనె;
స్యందన = కారిన;
బిందు = చుక్కల;
బృందంబును =
సమూహములను; ఉత్తరించుచు = దాటుతు;
కృతక = క్రీడా;
శైలంబులన్ = పర్వతములను;
ఆరోహించుచు = ఎక్కుతు;
పల్లవ = చిగురుటాకుల;
పీఠంబులన్ = ఆసనములపై;
పథిశ్రమంబున్
= అలసటలను; పుచ్చుచున్ = తీర్చుకొనుచు;
లతాసౌధ = పొదరిండ్ల;
భాగంబులన్ = లోపల;
పొడచూపుచు = కనబడుతు;
ఉన్నత = ఎత్తైన;
కేతకీ = మొగలి;
స్తంభంబులన్ = బోదెలకు;
ఒరగుచు = జార్లాపడుతు;
పుష్ప = పూల;
దళ = రేకల; ఖచిత = కూర్చిన;
వాతాయనంబులన్ =
కిటికీలలోకి;
తొంగిచూచుచున్ = తొంగిచూస్తూ;
కమల = తామర;
కాండ = తూడుల;
పాలికలన్ = చిన్నముక్కలను;
ఆలంబించుచున్ = ఊదుతూ;
చంపక = సంపెంగ;
గేహళీ = పొదల;
మధ్యంబులన్ = లోపల;
నిలువంబడుచున్ = నిలబడుతు;
కదళికా = అరటి;
పత్ర = ఆకుల;
కవాటంబులన్ = తలుపులను;
ఉద్ఘాటించుచున్ = చింపుతూ;
పరాగ = పుప్పొడిరేణువుల;
నిర్మిత = చేసిన;
సాలభంజికా = బొమ్మల;
నివహంబులన్ = సమూహములను;
అదరించుచున్ =
బుజ్జగించుచు;
మణి = రత్నాల;
కుట్టిమంబులన్ = తిన్నెలపై;
మురియుచున్ =
మురిసిపోతూ;
చంద్రకాంత = చంద్రకాంతాశిలల;
వేదికలన్ = వేదికలపైకి;
ఒలయుచున్ =
చేరుతూ; రత్న = రత్నములుపొదిగిన;
పంజర = పంజరములలోని;
శారికా = గోరువంకల;
నివహంబుల్ = సమూహముల;
కున్ = కు; చదువులు = మాటలు;
చెప్పుచున్ = నేర్పుచు;
కోరిన = ఇష్టము వచ్చిన;
క్రియన్ = విధముగా;
చూచుచున్ = చూస్తూ;
చూచిన = చూసిన;
క్రియన్ = విధముగా; మెచ్చుచున్ = మెచ్చుకొనుచు;
మెచ్చిన = మెచ్చుకొన్న;
క్రియన్ =
విధముగా; వెఱగుపడుచు = అచ్చెరువొందుచు;
వెఱగుపడిన = అచ్చెరువొందిన;
క్రియన్ =
విధముగా; మఱచుచు = పరవశించిపోతూ;
మఱవ = ప్రమాదముపడక;
ఏకాంతంబు = నిర్మానుష్యంబు;
అగు = ఐన; ఆ = ఆ; వన = తోట; అంతంబునన్ = లోపల;
అనంత = అంతులేని;
విభ్రమంబులన్ =
విలాసములతో;
జగన్మోహిని = జగన్మోహినీ యాకృతి;
ఐ = అయ్యి; విహరించుచున్న =
సంచరించుచున్న;
సమయంబునన్ = సమయమునందు.
భావము:
అంతలో
మన్మథుని జయించి నంతటి పరమశివుని నిబ్బరం సైతం నీరైపోయేలాగ, మోహిని ముడుచుకున్న కొప్పుముడి వీడింది; వెంట్రుకలు భుజాలు మీదా, మెడ మీదా చెదరి పడి చలిస్తున్నాయి; ఆమె నుదుటిమీద కస్తూరి బొట్టు కరిగిపోతోంది; ముద్దులు మూటగట్టే ముఖకాంతులు నలుదెసలా ప్రసరిస్తున్నాయి; చిరునవ్వులు చిందుతున్నాయి; చెమటతో తడిసి తడబడుతూ తనువున
పులకలు మొలకెత్తుతున్నాయి; మనసుకు ఇంపునింపే బంతిని అందమైన
హస్తంతో అందుకుంటోంది; దానిని రొమ్ముపై ఉంచుకుంటోంది; చెక్కిలిపై చేర్చుకుంటోంది; గడ్డానికి తాకించుకుంటోంది; చనుమొనలపై ఆనించుకుంటోంది; గోళ్ళతో మీటుతోంది; సొగసైన చేతులలో బంతిని కుడిఎడమలకు తృళ్ళిపడేలా ఒయ్యారంగా ఎగురవేస్తోంది; బంతి ఎగరేస్తుంటే మెల్లమెల్లగా కదలాడే మేలిమి కంకణాలు ఝణ ఝణ
ధ్వనిస్తున్నాయి; కుచకుంభాలు ఒకదానితో ఒకటి
రాసుకుంటున్నాయి; తనకుతానే చిన్నచిన్న పందాలు
వేసుకుంటోంది; సన్నని నడుం వణికేట్లు మెడలోని
హారాలు చిక్కుపడేటట్లు తిరుగాడుతోంది; అలా తిరిగేటప్పుడు చెవులకుండలాల
కాంతులు చెక్కిళ్ళపై చిందులాడుతున్నాయి; ఆమె గుండ్రంగా తిరుగుతూ బంతిని
పట్టుకుని ప్రక్కలకు కదులుతోంది; అప్పుడు ఆమె పైటచెరగు జారిపోతోంది; ఒడ్డాణంలోని బంగారుచిరుగంటలు మ్రోగుతున్నాయి; కాలిఅందెలు గల్లుగల్లుమంటున్నాయి; కరకంకణాలు రత్నాలు మెరస్తున్నాయి; ఆమె బంతి వెనువెంట పరుగెత్తి పట్టుకొంటూ పట్టుకుని నేలపై చరుస్తూ అది
పైకెగిరినప్పుడు రెండుచేతులూ చేర్చి చాలా మార్లు పట్టుకుంటోంది; బంతి ఎగిరేటప్పుడూ పడేటప్పుడూ పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు తన సోగచూపులు
వ్యాపంపజేస్తోంది; బంతిని కొడుతూ ఒకటి నుండి పది, నూరు అంటూ వరుసగా ఎంతో నేర్పుతో లెక్కపెడుతోంది; ఎఱ్ఱతామరలవంటి తన పాదాల అరుణకాంతులతో తూర్పుకొండ మీది సూర్య బింబాన్ని
స్పురింపజేస్తోంది; నెమ్మోము చంద్రుని వెన్నెల
వెలుగులతో చంద్రమండలాలను సృజిస్తోంది; అప్పుడప్పుడు కుచలకలశాల
మిట్టపల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటోంది; చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్ళతో చిమ్ముతోంది; ఎఱ్ఱని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను తోలుతోంది; పద్మంవంటి ముఖంలోని సువాసనకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తోంది; అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంచ జంటలను గెంటుతోంది; సొగసైన చూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తోంది; పొదరిండ్ల దరిచేరకుండా చిగుళ్ళవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిల జంటలకు
దూరమవుతోంది; తీగఉయ్యాల మీద ఊగుతోంది; పూలగురివింద గుబుర్లపై ఎక్కుతోంది; పుప్పొడి గుట్టలను దాటుతోంది; మకరందాల మడుగులు గడుస్తోంది; క్రీడాపర్వతాలపై విహరిస్తోంది; చిగురుటాకుల ఆసనాలపై అలసట
తీర్చుకుంటోంది; తీగ ఇండ్లలో దాగుడుమూతలు ఆడుతోంది; మొగలిపొదలకు ఆనుకంటోంది; పూరేకుల గవాక్షాలలో
తొంగిచూస్తోంది; మెట్టతామర మొక్కలను తాకుతోంది; సంపెంగ పొదల గడపలలో నిలబడుతోంది; అరటి ఆకులద్వారాలు తెరుస్తోంది; కమ్మని పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తోంది; రత్నాలబాటపై విహరిస్తోంది; చంద్రకాంత వేదికలను సమీపిస్తోంది; రత్న పంజరాలలోని గోరువంకలకు మాటలు నేర్పుతోంది; ఇష్టం వచ్చిన దానిని చూస్తోంది; చూచిన దానిని మెచ్చుకుంటోంది; మెచ్చుకొన్నదానిపై అచ్చెరువు కనబరుస్తోంది; మైమరుస్తోంది; మైమరపిస్తోంది. అలా ఆ వాల్గంటి
ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్మోహిని అయి సంచరించసాగింది.
No comments:
Post a Comment