8-394-వ.
కని
మున్ను మగువ మరగి సగమయిన మగవాఁ డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున.
8-395-శా.
ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల
యందుఁ గాన; మజుఁ డీ యింతిన్ సృజింపంగఁ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండుఁ
గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?
టీకా:
కని = చూసి;
మున్ను = ఇంతకుముందే;
మగువన్ = స్త్రీని;
మరగి = అలవాటుపడి;
సగము = సగము;
అయిన =
ఐనట్టి; మగవాడు = పురుషుడు;
ఆ = ఆ; మగువన్ = స్త్రీ యొక్క;
వయస్ = ప్రాయము;
రూప = అందము; గుణ = సుగుణములు;
విలాసంబులున్ = వయ్యారములు;
తన్ను = తనను;
ఊరింపన్ =
ఆకర్షించుచుండగ;
కనుఱెప్పన్ = కంటిమీదిరెప్ప;
వ్రేయకన్ = ఆర్పకుండగ;
తప్పక =
విడువకుండ; చూచి = చూసి;
మెత్తను = మెత్తబడినది;
అయిన = ఐనట్టి;
చిత్తంబున =
మనసునందు.
ఈ = ఈ; కాంతా =
స్త్రీ; జన = జనములలో;
రత్నము = శ్రేష్ఠురాలు;
ఎవ్వరిదోకో = ఎవరికిచెందినదోకదా;
ఈ = ఇట్టి; ఆడు = స్త్రీ;
రూపంబున్ = అందమును;
మున్ను = ఇంతకుముందే;
ఏ = ఏ; కల్పంబులన్ = కల్పముల;
అందున్ = లోను;
కానము = చూడలేదు;
అజుడు = బ్రహ్మదేవుడు;
ఈ = ఈ; ఇంతిన్ = స్త్రీని;
సృజింపంగన్ = సృష్టించుటకు;
తాన్ = తాను;
లేకుంటన్ =
చేయలేదనుట; ఎల్లన్ = పూర్తిగా;
నిజంబున్ = సత్యము;
వల్లభతన్ = ప్రీతితో;
ఈ = ఈ; లీలావతిన్ = శృంగారవతిని;
చేరంగాన్ = దరిచేరుటకు;
ఏ = ఏ; కాంతుండు = చక్కనివాడు;
కలండొ = ఉన్నాడోకదా;
క్రీడల = లీలావిహారముల;
కున్ = కోసము;
నా = నా; కున్ = కు; ఈ = ఈ; ఇంతిన్ = స్త్రీ;
సిద్దించునే = దొరుకుతుందా.
భావము:
ఇంతకు ముందే మగువ వలపుతో సగమైన మగవాడు కదా శివుడు.
ఆజవరాలి ప్రాయమూ రూపమూ ఒయ్యారమూ విలాసమూ ఆయనను బాగా ఆకర్షించాయి. ఆయన కంటిరెప్పకూడా
వేయకుండా మైమరచి ఆమెను చూడసాగాడు. ఆయన చిత్తం మెత్తబడింది.
“ఎవరమ్మాయో ఈ అన్నులమిన్న. ఏ కల్పంలోనూ ఇప్పటి
వరకూ ఇంతటి అందమైన స్త్రీ కనబడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించ లేదనడం తథ్యం. ఈ
ఒయ్యారిని ఇల్లాలుగా పొందే అదృష్టవంతుడు ఎవడో? ఈ లావణ్యవతి లీలావిహారలకు నాకు లభిస్తుందా?” అని అనుకున్నాడు శివుడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment