8-408-శా.
పారావారము ద్రచ్చుచో గిరి సముద్యద్భారమై కచ్ఛ పా
కారుండైన రమేశువర్తనము నాకర్ణింపఁ గీర్తింప సం
సారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయముం బొంది వి
స్తారోదార సుఖంబుఁ జెందుదురు తథ్యం బెంతయున్ భూవరా!
8-409-మ.
ఎలమిన్ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం
జలితాపన్నులకున్ సురోత్తములకుం జక్కన్ విభాగించి ని
ర్మల రేఖన్ విలసిల్లు శ్రీవిభునిఁ దన్మాయావధూరూపముం
దలఁతున్ మ్రొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్క రూపంబుగన్.
8-410-వ.
అని
చెప్పి శుకుం డిట్లనియె.
టీకా:
పారావారమున్ =
సముద్రమును;
ద్రచ్చుచోన్ = చిలుకునప్పుడు;
గిరి = పర్వతమునకు;
సమ = సమానమైన;
ఉద్యత్ = ఎత్తిన;
భారము = బరువుగలవాడు;
ఐ = అయ్యి; కచ్ఛప = కూర్మ;
ఆకారుండు =
అవతారుండు; ఐన = అయిన; రమేశున్ = హరి యొక్క;
వర్తనమున్ = చరిత్రను;
ఆకర్ణింపన్ =
వినినను; కీర్తింపన్ = పాడినను;
సంసార = సంసారము యనెడి;
అంభోనిధి = సముద్రము;
లోన్ = అందు;
మునుంగు = ములిగిపోయెడి;
కుడనుల్ = అల్పులైన జనులు;
సంశ్రేయంబున్ =
గొప్పపుణ్యమును;
పొంది = పొంది;
విస్తార = విశేషమైన;
ఉదార = అధికమైన;
సుఖంబున్ =
సుఖములను; చెందుదురు = పొందెదరు;
తథ్యంబు = సందేహములేనిది;
ఎంతయున్ = ఎంతైనను;
భూవర = రాజా.
ఎలమిన్ = ఉపాయముగా;
దైత్యులన్ = రాక్షసులను;
ఆడు = స్త్రీ;
రూపమునన్ = రూపముతో;
మోహింపించి =
మాయజెందించి;
పీయూషమున్ = అమృతమును;
చలిత = అడలుచున్నట్టి;
ఆపన్నుల్ =
ఆపదలచెందినవారల;
కున్ = కు; సుర = దేవతా;
ఉత్తముల్ = శ్రేష్ఠుల;
కున్ = కు; చక్కన్ = చక్కగ;
విభాగించి = పంచిపెట్టి;
నిర్మల = దివ్యమైన;
రేఖన్ = తేజస్సుతో;
విలసిల్లు = విరాజిల్లెడి;
శ్రీవిభుని = విష్ణుని;
తత్ = అతని;
మాయా = మాయ;
వధూ = మోహినీ; రూపమున్ = అవతారమును;
తలతున్ = స్మరించెదను;
మ్రొక్కుదున్ =
కొలిచెదను; ఆత్మ = మనసు;
లోనన్ = అందు;
దురిత = పాపము యనెడి;
ధ్వాంత =
అంధకారమునకు;
అర్క = సూర్యుని;
రూపంబుగన్ = స్వరూపముగా.
అని = అని; చెప్పి =
చెప్పి; శుకుండు = శుకుడు;
ఇట్లు = ఇలా;
అనియె = పలికెను.
భావము:
ఓ
పరీక్షిన్మహారాజా! సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు సైతం, సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్రమధ్యన మునిగిపోతున్న
మందరపర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను విన్నా
పాడినా గొప్ప పుణ్యాన్నీ విశేషమైన సుఖాన్నీ చూరగొంటారు ఇందులో ఏమాత్రం సందేహం
లేదు.
శ్రీమన్నారాయముడు
జగన్మోహినిగా స్త్రీ రూపం ధరించి ఉపాయంగా రాక్షసులను మోహింపజేసి ఆపదలలో
హడలిపోతున్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి దివ్య తేజస్సుతో విరాజిల్లాడు. ఆ
విష్ణుమూర్తినీ ఆయన మోహినీరూపాన్నీ తలచితలచి మ్రొక్కుతాను. అది పాపపు చీకట్లను రూపుమాపే
సూర్యుని రూపంగా భావిస్తాను.”
అని చెప్పి శుకుడు
ఇంకా ఇలా అన్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment