8-464-ఆ.
అన్నమైనఁ దక్రమైనఁ దోయంబైన
శాకమైన దనకుఁ జరగు కొలఁది
నతిథి జనుల కడ్డ మాడక యిడరేని
లేమ! వారు కలిగి లేనివారు.
8-465-వ.
మఱియు
భావము:
8-466-ఆ.
నెలఁత! విష్ణునకును నిఖిలదేవాత్మున
కాననంబు శిఖియు నవనిసురులు;
వారు దనియఁ దనియు వనజాతలోచనుం
డతఁడుఁ దనియ జగము లన్నిఁ దనియు.
8-467-క.
బిడ్డలు వెఱతురె నీకఱ
గొడ్డంబులు జేయ కెల్ల కోడండ్రును మా
ఱొడ్డారింపక నడతురె
యెడ్డము గాకున్నదే మృగేక్షణ! యింటన్.
టీకా:
అన్నము
= భోజనము; ఐనన్ =
అయినను; తక్రము =
మజ్జిగ; ఐనన్ =
అయినను; తోయంబు =
మంచినీరు; ఐనన్ =
అయినను; శాకము = కాయలు;
ఐనన్ = అయినను;
తన = తన; కున్ = కు; జరుగు = వీలగునంత;
కొలది = వరకు;
అతిథి = అతిథులైన;
జనుల = వారి;
కున్ = కి; అడ్డమాడక = లేదనకుండ;
ఇడరు = పెట్టని;
ఏని = చో; లేమ = సుందరి {లేమ - లేతయౌవనముగలామె,
స్త్రీ}; వారు =
అట్టివారు; కలిగి = సంపన్నులైయుండికూడ;
లేనివారు = బీదవారే.
మఱియున్ = ఇంకను.
నెలత = సుందరి {నెలత - చంద్రునివలెచల్లనియామె,
స్త్రీ}; విష్ణున్ = నారాయణున;
కును = కు; నిఖిలదేవాత్మున్ = నారాయణున {నిఖిలదేవాత్ముడు - నిఖిల (సమస్తమై) దేవ
(దేవతలు) ఆత్ముడు
(తానైనవాడు), విష్ణువు};
కున్ = కు; ఆననంబు = ముఖము;
శిఖియున్ = అగ్ని;
అవనిసురులు = బ్రాహ్మణులు {అవనిసురులు - అవని (భూమికి) సురులు
(దేవతలు), బ్రాహ్మణులు};
వారు = వారు;
తనియన్ = తృప్తిచెందగ;
తనియున్ = సంతృప్తులౌదురు;
వనజాతలోచనుండు = హరి {వనజాతలోచనుడు - వనజాతము (పద్మము) వంటి
లోచనుడు (కన్నులుగలవాడు),
విష్ణువు}; అతడు = అతను;
తనియన్ = సంతృప్తుడైనచో;
జగములు =
లోకములు; అన్నియు = సమస్తమును;
తనియున్ = తృప్తిచెందును.
బిడ్డలు = పిల్లలు;
వెఱతురె = భయభక్తులతోనున్నారా;
నీ = నీ; కున్ = కు; అఱగొడ్డంబులు = తిరగబడుట;
చేయకన్ = చేయకుండగ;
ఎల్ల = అందరు;
కోడండ్రును = కోడళ్ళు;
మాఱొడ్డారింపక =
ప్రతిఘటించకుండగ;
నడతురె = వర్తించుతున్నారా;
ఎడ్డము = ఇబ్బంది;
కాక = లేకుండగ;
ఉన్నదె = ఉన్నాదా;
మృగేక్షణ = సుందరీ {మృగేక్షణ - మృగ (లేడివంటి) ఈక్షణ
(చూపులుగలామె),
స్త్రీ}; ఇంటన్ = ఇంటిలో.
భావము:
అన్నమైనా, మజ్జిగైనా, నీళ్ళైనా చివరకు కూరగాయలైనా తమకు ఉన్నంతలో
అతిధులకు లేదనకుండా పెట్టాలి .అలా పెట్టకపోతే ఎంతటి ధనవంతులైనా వారు
దరిద్రులే.
అంతేకాకుండా.
. . .
చంద్రుని
వలె చల్లని మగువా! దేవతలు అందరకు ఆత్మ విష్ణుమూర్తి. ఆయన
ముఖము అయిన అగ్నినీ, బ్రాహ్మణులనూ సంతోష పెడితే విష్ణువు సంతోషపడతాడు. విష్ణుమూర్తి తృప్తిచెందితే, సమస్తలోకాలూ తృప్తి చెందుతాయి.
లేడికన్నులతో
అందంగా ఉండే అదితీ! నీ విషయంలో నీ కొడుకులు వినయంగా
ఉంటున్నారా? నీకు ఎదురు చెప్పకుండా ఉంటున్నారా? ఇంట్లో ఇబ్బందులు ఏమి లేవు కదా!”
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
2 comments:
Is it not Pothana named his work as Andhra Mahabhagavatham. Why this blog is referring it as Telugu Maha Bhagavatham???
స్కంధాంత గద్యములలో సూచించిన ప్రకారం పోతనామాత్య ప్రణీతంబైన “శ్రీమహాభాగవత పురాణం" అని అన్నారు. ఉదాహరణకు క్రింది లింకు చూడగలరు. "పోతన తెలుగు భాగవతము" పేర మూల గ్రంథాన్ని సర్వసమగ్రంగా సంబంధిత సమస్త సమాచారం సమేతంగా వివిధ మాధ్యమాలలో అందిస్తున్నమహాసంకలనం “తెలుగు భాగవతం”.
http://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=41&Padyam=530” t
Post a Comment