Wednesday, October 5, 2016

క్షీరసాగరమథనం – ఇట్లు నారద వచన

8-383-వ.
ఇట్లు నారద వచన నియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు చాలించి సకల దేవ ముఖ్యులును ద్రివిష్టపంబునకుం జనిరి" హతశేషు లైన దైత్యదానవులు విషణ్ణుండైన బలిం దోడ్కొని పశ్ఛిమ శిఖిశిఖరంబుఁ జేరిరి; విధ్వంసమానకంధరులై వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్రుండు మృతసంజీవని యైన తన విద్య పెంపునం జేసి బ్రతికించె; బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై పరాజితుండయ్యును లోకతత్త్వ విచక్షణుం డగుటం జేసి దుఃఖింపక యుండె" నని చెప్పి రాజునకు శుకుం డిట్లనియె.

టీకా:
            ఇట్లు = ఈ విధముగ; నారద = నారదుని; వచన = మాటలచే; నియుక్తులు = నియమింపబడినవారు; ఐ = అయ్యి; రాక్షసుల = రాక్షసుల; తోడి = తోటి; సంగ్రామంబున్ = యుద్ధమును; చాలించి = ఆపివేసి; సకల = సమస్తమైన; దేవ = దేవతా; ముఖ్యులునున్ = ప్రముఖులు; త్రివిష్టపంబున్ = స్వర్గమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; హత = మరణించగా; శేషులు = మిగిలినవారు; ఐన = అయిన; దైత్య = రాక్షసులు; దానవులు = రాక్షసులు; విషణ్ణుండు = విషాదముపొందినవాడు; ఐన = అయిన; బలిన్ = బలిని; తోడ్కొని = కూడతీసుకెళ్ళి; పశ్ఛిమ = పడమటి; శిఖి = పర్వతపు; శిఖరంబున్ = శిఖరమునకు; చేరిరి = చేరుకొంటిరి; విధ్వంసమాన = తెగిపోయిన; కంధరులు = కంఠములుగలవారు; ఐ = అయ్యి; వినష్టదేహులు = మరణించినవారు; అగు = అయిన; యామినీచరులన్ = రాక్షసులను; ఎల్లను = అందరును; శుక్రుండు = శుక్రుడు; మృత = మరణించినవారిని; సంజీవని = చక్కగాజీవింపజేయునది; ఐన = అయిన; తన = తన; విద్య = విద్య యొక్క; పెంపునన్ = గొప్పదనము; చేసి = చేత; బ్రతికించెన్ = జీవింపజేసెను; బలియును = బలి కూడ; భార్గవ = శుక్రుని; అనుగ్రహంబునన్ = దయవలన; విగత = పోయినట్టి; శరీర = దేహ; వేదనుండు = బాధలుగలవాడు; ఐ = అయ్యి; పరాజితుండు = ఓటమిపాలైనను; లోక = సృష్టి; తత్త్వ = తత్త్వపు; విచక్షణుండు = జ్ఞానముగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దుఃఖింపక = శోకింపకుండ; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పి = పలికి; రాజున్ = రాజున; కున్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.

భావము:
          ఈ విధంగా నారదమునీంద్రుడు చెప్పిన మాటలు విని, రాక్షసులతో యుద్ధాన్ని చాలించి, దేవతావీరులు అందరూ దేవతాలోకానికి వెళ్ళిపోయారు. పరాజితుడు అయిన బలిచక్రవర్తిని, చావకుండా మిగిలిన రాక్షసులు పిలుచుకెళ్ళి, పడమటికొండ శిఖరానికి చేరుకున్నారు. శుక్రాచార్యుడు మృతసంజీవని అనే విద్య ప్రయోగించి, దాని మహత్యం వలన గొంతులు తెగి శరీరం వదిలిన రాక్షసులు అందరనూ మరల బ్రతికించాడు. బలి చక్రవర్తి దైహిక బాధలు అన్నీ కూడా ఆ భర్గుని కుమారుడు అయిన శుక్రాచార్యుని దయతో చల్లారాయి. ఆ బలి ప్రపంచతత్వం తెలిసినవాడు కాబట్టి, ఓటమి పాలైనా దుఃఖపడలేదు. అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.


: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

No comments: