8-384-సీ.
కైలాసగిరి మీఁద ఖండేందు భూషణుం;
డొకనాఁడు గొలువున నున్న వేళ
నంగన యై విష్ణుఁ డసురుల వంచించి;
సురలకు నమృతంబు సూఱ లిడుట
విని దేవియును దాను వృషభేంద్ర గమనుఁడై;
కడు వేడ్క భూత సంఘములు
గొలువ
మధుసూదనుం డున్న మందిరంబున కేగి;
పురుషోత్తమునిచేతఁ బూజ పడసి
8-384.1-తే.
తానుఁ గూర్చుండి పూజించె దనుజ వైరిఁ
గుశలమే మీకు మాకునుఁ గుశల మనుచు
మధురభాషల హరిమీఁద మైత్రి నెఱపి
హరుఁడు పద్మాక్షుఁజూచి యిట్లనియెఁ బ్రీతి.
టీకా:
కైలాసగిరి =
కైలాసపర్వతము;
మీద = పైన; ఖండేందుభూషణుండు = శంకరుడు;
ఒక = ఒక (1); నాడు =
దినమున; కొలువునన్ = సభతీరి;
ఉన్న = ఉన్నట్టి;
వేళన్ = సమయమునందు;
అంగన =
స్త్రీ; ఐ = అయ్యి; విష్ణుడు = విష్ణుమూర్తి;
అసురులన్ = రాక్షసులను;
వంచించి =
మాయజేసి; సురల్ = దేవతల;
కున్ = కు; అమృతంబున్ = అమృతమును;
సూఱలిడుట =
పంచిపెట్టుట;
విని = విని;
దేవియును = భార్య;
తాను = తను;
వృషభేంద్ర =
శ్రేష్టమైన వృషభముపై;
గమనుడు = వెళ్ళువాడు;
ఐ = అయ్యి; కడు = మిక్కిలి;
వేడ్కన్ = ఉత్సుకతో; భూత = ప్రమథ;
సంగములున్ = గణములు;
కొలువన్ = కొలుచుచుండగ;
మధుసూదనుండు = నారాయణుడు;
ఉన్న = ఉన్నట్టి;
మందిరమున్ = నివాసమున;
కిన్ = కి; ఏగి = వెళ్ళి;
పురుషోత్తముని = విష్ణుమూర్తి;
చేతన్ = వలన;
పూజ = అర్చనలు;
పడి =
పొంది.
తానున్ = తనుకూడ;
కూర్చుండి = కూర్చొని;
పూజించెన్ = అర్చించెను;
దనుజవైరిన్ = విష్ణుమూర్తిని;
కుశలమే = క్షేమమేకదా;
మీకు = మీకు;
మాకునున్ = మాకుకూడ;
కుశలము = క్షేమమే;
అనుచున్ = అనుచు;
మధుర = తీయని;
భాషలన్ = మాటలతో;
హరి = విష్ణుమూర్తి;
మీద =
ఎడల; మైత్రి = స్నేహము;
నెఱపి = చూపి;
హరుడు = శంకరుడు;
పద్మాక్షున్ = హరిని;
చూచి = చూసి;
ఇట్లు = ఇలా;
అనియెన్ = పలికెను;
ప్రీతిన్ = స్నేహముతో.
భావము:
శివుడు కైలాసపర్వతంపై ఒకనాడు కొలువుతీరి ఉన్నాడు. ఆ
సమయంలో విష్ణువు మోహినీరూపంలో రాక్షసులను మోసగించి
దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి విన్నాడు. అతడు పార్వతీదేవితోపాటు నందీశ్వరునిపై కూర్చుని ప్రమథగణ సమేతుడై వైకంఠానికి
వెళ్ళాడు. విష్ణువు శివుణ్ణి గౌరవించాడు. శివుడుకూడా
విష్ణువును గౌరవించాడు. విష్ణువు క్షేమం అడిగి తమ
క్షేమాన్ని తెలిపి తియ్యని మాటలతో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. తరువాత శివుడు చనువుగా విష్ణువుతో ఇలా అన్నాడు.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment