8-211-క.
ఎడమఁ గుడి మునుపు దిరుగుచు
గుడి నెడమను వెనుకఁ దిరుగు కులగిరి గడలిం
గడ లెడల సురలు నసురులుఁ
దొడితొడి ఫణి ఫణము మొదలుఁ దుదియును దిగువన్.
8-212-క.
వడిగొని కులగిరిఁ దరువఁగ
జడనిధి ఖగ మకర కమఠ ఝష ఫణి గణముల్
సుడివడుఁ దడఁబడుఁ గెలఁకులఁ
బడు భయపడి నెగసి బయలఁ బడు నురలిపడున్.
టీకా:
ఎడమన్ = ఎడమనుండి;
కుడి = కుడిపక్కకు;
మునుపు = ముందకు;
తిరుగుచున్ = తిరుగుతు;
కుడిన్ =
కుడినుండి; ఎడమనున్ = ఎడమపక్కకి;
వెనుకన్ = వెనుకకు;
తిరుగు = తిరిగును;
కులగిరి = కులపర్వతము;
కడలిన్ = సముద్రమును;
కడలు = చివర్లవరకు;
ఎడలన్ = ఎగసిపోవునట్లుగ;
సురలున్ = దేవతలు;
అసురులున్ = రాక్షసులు;
తొడితొడిన్ = తొందరతొందరగా;
ఫణి =
పాము యొక్క;
ఫణము = పడగల;
మొదలున్ = మొదలు;
తుదిన్ = తోకను;
తిగువన్ =
లాగుచుండగా.
వడిగొని = వేగము
అందుకొని; కులగిరిన్ = కులపర్వతముతో;
తరువగన్ = చిలుకుతుండగ;
జడనిధిన్ =
సముద్రపు; ఖగ = పక్షులు;
మకర = మొసళ్ళు;
కమఠ = తాబేళ్ళు;
ఝష = చేపలు;
ఫణి =
పాముల; గణముల్ = సమూహములు;
సుడివడున్ = చీకాకుపడును;
తడబడు = తొట్రుపడెడి;
కెలకులన్ = పక్కలకు;
పడున్ = పడిపోవును;
భయపడి = భయపడిపోయి;
ఎగసి = గెంతి;
బయలన్ = గట్టుమీదకి;
పడునున్ = పడిపోవును;
ఉరలి = పొరలు పాట్లు;
పడున్ = పడిపోవును.
భావము:
సర్పరాజు తోకా తలా పట్టుకుని దేవతలూ రాక్షసులూ కలిసి; వంతులువారీగా తొందర తొందరగా ముందుకూ వెనక్కూ కదులుతూ ఉంటే; మందర పర్వతం ఎడం ప్రక్క నుండి కుడి ప్రక్కకు, మరల కుడి ప్రక్క నుండి ఎడం ప్రక్కకు అలా తిరుగసాగింది.
అలా గిరగిరా కొండ కదులుతుంటే కడలిలోని పక్షులూ, మొసళ్ళూ, తాబేళ్ళూ, చేపలూ, సర్పాలూ తొట్రుపడుతూ ప్రక్కలకు పడుతూ భయంతో ఎగిరి గట్టుమీదకి పడి పొర్లుతూ ఉన్నాయి.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment